ముజ్రాపార్టీ కేసులో హైకోర్టులో పోలీసుల కౌంటర్‌

Mujra Party in Vijayawada, Petition in High Court - Sakshi

ఈ కేసులో అసలు నిందితులను వదిలేశారు

కేసును వేరే దర్యాప్తు సంస్థకు అందించాలి

హైకోర్టులో పిటిషన్‌.. విచారణకు హాజరైన భవానీపురం సీఐ  

సాక్షి, విజయవాడ : ఇటీవల విజయవాడలోని ఓ ప్రముఖ హోటల్‌లో ముజ్రా పార్టీ పేరిట మహిళలతో అసభ్య నృత్యాలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంలో మొదటిసారి ముజ్రా పార్టీ కేసు నమోదు చేసిన పోలీసుల తీరుపై అనుమానాలు వ్యక్తమవుత్నునాయి. ఈ నేపథ్యంలో ముజ్రా పార్టీ కేసులో అసలు నిందితులను పోలీసులు వదిలేశారంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ కేసు దర్యాప్తును వేరే దర్యాప్తు సంస్థకు బదిలీ చేయాలని కోరుతూ మహమ్మద్ ఖాసీం బాషా  పిటిషన్ వేశారు. ఈ కేసును విచారణకు స్వీకరించిన హైకోర్టు.. రాష్ట్ర హోంశాఖ కార్యదర్శి, పోలీస్ కమిషనర్, వెస్ట్ జోన్‌ ఏసీపీ, భవానీపురం సీఐలకు కోర్టుకు హాజరు కావాలని ఆదేశాలు జారీచేసింది. దీంతో భవానీపురం సీఐ మోహన్ రెడ్డి బుధవారం హైకోర్టుకు హాజరయ్యారు. అందరిని అరెస్ట్ చేశామని, ఎవరిని తప్పించలేదని పోలీసులు కోర్టులో కౌంటర్ దాఖలు చేశారు.

నగరంలోని భవానీపురంలో ఉన్న ఆలీవ్ ట్రీ హోటల్‌పై గత బుధవారం (జూలై 19న) అర్ధరాత్రి పోలీసులు దాడి చేశారు. మహిళలతో అసభ్య నృత్యాలు నిర్వహిస్తున్నారనే సమాచారంతో పోలీసులు రైడ్‌ చేసి.. ఐదుగురు మహిళలు, 50మంది పురుషులను అదుపులోకి తీసుకున్నారు. అధికార పార్టీకి చెందిన ఓ నేత ముఖ్య అనుచరుడి ఆధ్వర్యంలో హోటల్‌లో ఈ పార్టీ జరిగినట్టు కథనాలు వచ్చాయి. హైదరాబాద్‌కు చెందిన కొందరు ప్రైవేట్ ఈవెంట్ యాంకర్లను తీసుకువచ్చి హోటల్‌లో అసభ్య నృత్యాలు నిర్వహించారని సమాచారం. ఈ ఘటనలో పట్టుబడిన వారిలో 10 మందిని వన్ టౌన్ పోలీస్‌ స్టేషన్‌కు, 15 మందిని భవానీపురం పీఎస్‌కు, 10 మందిని ఇబ్రహీంపట్నం పీఎస్‌కు, మరో పదిమందిని గవర్నర్‌పేట పీఎస్‌కు తరలించారు.

ఐదుగురు యువతులను వాసవ్య మహిళా మండలికి అప్పగించారు. పట్టుబడిన యువతులు హైదరాబాద్, భీమవరం, విజయవాడకు చెందిన వారిగా గుర్తించారు. అధికార పార్టీకి చెందిన ఓ నాయకుడి కుటుంబ సభ్యుడు కూడా ఈ  పార్టీలో పాల్గొన్నాడని, అయితే, పోలీసుల రైడ్‌ నుంచి అతన్ని తప్పించారని తెలుస్తోంది. పార్టీ జరుగుతున్న ప్రాంతంలో పెద్ద ఎత్తున మద్యం, కండోమ్ ప్యాకెట్లు లభ్యమయ్యాయి.

ఈ క్రమంలో ఈ ఘటనపై నగరంలో మొదటిసారి ముజ్రా పార్టీ కేసును పోలీసులు నమోదు చేశారు. ఈ ముజ్రా పార్టీకి సంబంధించి 53 మందిని అరెస్ట్ చేశామని జాయింట్ సీపీ రానా అప్పట్లో తెలిపారు. హోటల్ నిర్వాహకులపైనా కేసు పెట్టామని చెప్పారు. ఒక్కో వ్యక్తి నుంచి రూ. 5 వేల నుంచి 10 వేల చొప్పున రూ. 5 లక్షల వరకు నిర్వాహకులు ఈ పార్టీ కోసం వసూలు చేశారని తెలిపారు. పోలీసుల దాడిలో దొరికిన ఐదుగురు అమ్మాయిలను వాసవ్య మహిళా మండలి సంరక్షణలో పెట్టామని చెప్పారు. ఇకపై నగరంలో ఇలాంటి పార్టీలు జరగకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top