పక్కా ప్లానింగ్‌ ప్రకారమేనా..?

MRO Vijayareddy Murder Case, Investigation Raises Many Doubts - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: పక్కా పథకం ప్రకారమే అబ్దుల్లాపూర్‌మెట్‌ తాహసీల్దార్‌ విజయారెడ్డి హత్య జరిగిందా? హత్యా సమయంలో ఎమ్మార్వో ఆఫీసు బయట కారులో ఉన్నది ఎవరు? ఘటన తర్వాత నిందితుడు సురేష్‌ వారితో ఏం మాట్లాడాడు? అసలు హత్యకు ముందు విజయారెడ్డి గదిలో ఏం జరిగింది? సురేష్‌కు, విజయారెడ్డికి మధ్య వాగ్వాదానికి కారణం ఏంటి? సురేష్‌ ఆమెపై పెట్రోల్‌ పోస్తుండగా... ఆ వాసన బయటకు రాలేదా? ఆ సమయంలో అటెండర్‌తోపాటు అక్కడ ఎవరూ ఎందుకు లేరు?

విజయారెడ్డి సజీవదహనం కేసులో ఎన్నో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నిందితుడు సురేష్‌ పక్కా ప్రణాళికతోనే తహసీల్దార్‌ విజయారెడ్డిని హత్య చేసినట్టు పోలీసు వర్గాలు చెప్తున్నాయి. ఈ కేసులో దర్యాప్తును ముమ్మరం చేసిన పోలీసులు.. సంఘటనాస్థలం పరిసరాల్లో లభించిన సీసీ ఫుటేజ్‌లను పరిశీలించారు. హత్యకు ముందు, ఆ తర్వాత పరిణామాలు చూస్తే.. ఇది పక్కా ప్రణాళికగానే కనిపిస్తోందని పోలీసులు భావిస్తున్నారు. ఘటన జరిగిన తర్వాత సురేష్‌ మంటలతో బయటకు వచ్చి.. దగ్గరలోని వైన్‌ షాపు ముందు కారులో ఉన్నవారితో మాట్లాడినట్టు సమాచారం. వారితో మాట్లాడిన తర్వాతే అతను పోలీస్‌ స్టేషన్‌కు పరుగులు తీశాడని సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించిన పోలీసులు చెప్తున్నారు.

మరోవైపు అబ్థుల్లాపూర్‌మెట్ తహసీల్దార్ విజయారెడ్డికి నిప్పటించి హత్య చేసిన నిందితుడు సురేష్ పరిస్థితి విషమంగా ఉందని ఉస్మానియా ఆస్పత్రి ఆర్ఎంవో డాక్టర్ రఫీ వెల్లడించారు. సురేష్‌కు 65 శాతం గాయాలయ్యాయని, ఆయన ప్రాణానికి గ్యారెంటీ ఇవ్వలేమని రఫీ తెలిపారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top