మాట్రి‘మోసగాడికి’ అరదండాలు!

Matrimony Chester Jeevan Arrest in Hyderabad - Sakshi

మాట్రిమోనియల్‌ సైట్స్‌ ద్వారా యువతులకు ఎర

ప్రొఫెసర్‌గా చెప్పుకుంటూ పెళ్లి ప్రతిపాదనలు

తల్లికి వైద్యం పేరుతో అందినకాడికి స్వాహా

నిందితుడు జీవన్‌కుమార్‌ అరెస్ట్‌

సాక్షి, సిటీబ్యూరో: గోవాలో పుట్టి పెరిగాడు... చదువు అబ్బకపోయినా మంచి మాటకారి.. తండ్రి మరణంతో ఆర్థిక ఇబ్బందుల్లో పడ్డాడు... వీటి నుంచి గట్టెక్కేందుకు ‘మాట్రిమోనియల్‌ ఫ్రాడ్స్‌’ మొదలెట్టాడు... తానో ప్రొఫెసర్‌గా చెప్పుకుంటూ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లకు ఎర వేసి పెళ్లా ప్రస్తావన తెచ్చాడు... తల్లికి అనారోగ్యమంటూ అందినకాడికి దండుకున్నాడు... ఈ పంథాలో అనేక మంది యువతులను మోసం చేసిన ఘరానా మోసగాడిని సిటీ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు పట్టుకున్నారు. బుధవారం అదనపు డీసీపీ కేసీఎస్‌ రఘువీర్‌ ఇన్‌స్పెక్టర్‌ సీహెచ్‌ గంగాధర్‌తో కలిసి వివరాలు వెల్లడించారు.

గోవా ‘ప్రభావం’తో చదువుకు దూరం...
 నెల్లూరుకు చెందిన నల్లపాటి వెంకటేశ్వర్లు వృత్తిరీత్యా బిల్డర్‌. ఈ నేపథ్యంలోనే కొన్నేళ్ల క్రితం గోవాలో స్థిరపడ్డాడు. అతడికి  అక్కడే జీవన్‌కుమార్‌ పుట్టాడు. చిన్నప్పటికీ నుంచి అక్కడే పెరిగిన జీవన్‌పై ‘స్థానిక పరిస్థితుల’ ప్రభావం ఎక్కువగా ఉంది. దీంతో చదువు అబ్బక పదో తరగతితోనే పుల్‌స్టాప్‌ పెట్టాడు. చాలా కాలంగా ఫేస్‌బుక్‌లో వివిధ పేర్లతో నకిలీ ప్రొఫైల్స్‌ క్రియేట్‌ చేయడం అతడికి అలవాటు. తల్లి చిన్నతనంలోనే చనిపోగా... గత ఏడాది తండ్రి సైతం మరణించడంతో జీవన్‌ ఒంటరయ్యాడు. తనకు ఉన్న ‘క్వాలిఫికేషన్స్‌’తో ఉద్యోగాల కోసం ప్రయత్నించినా దొరక్కపోవడంతో ప్రకాశం జిల్లాలో ఉన్న నానమ్మ దగ్గరకు వచ్చేశాడు. ఆమె తన పింఛన్‌తోనే మనువడిని పోషిస్తోంది.  

ఫొటో, పేరు మార్చేసి ప్రొఫైల్‌...
కొన్నేళ్లుగా తనకు ఉన్న ‘ఫేస్‌బుక్‌ అనుభవాన్ని’ మాట్రిమోనియల్‌ సైట్స్‌లో వాడాలని కుట్ర పన్నాడు. మారు పేరు, ఫొటోలతో పాటు లేని అర్హతలను అందులో పొందుపరిచి మోసాలకు తెరలేపాడు. ఇన్‌స్ట్రాగామ్‌ నుంచి గుజరాత్‌కు చెందిన మోడల్‌ పృథ్వీష్‌ శెట్టి ఫొటోను డౌన్‌లోడ్‌ చేసుకుని దీనిని వినియోగించి తన పేరు రిషి కుమార్‌గా పేర్కొంటూ జూన్‌లో జీవన్‌సాథీ.కామ్‌ వెబ్‌సైట్‌లో ప్రొఫైల్‌ క్రియేట్‌ చేశాడు. అందులో తాను పీహెచ్‌డీ పూర్తి చేసి డాక్టరేట్‌ పొందానని, బెంగళూరులోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైస్సెస్‌ (ఐఐఎస్సీ) ప్రొఫెసర్‌గా పని చేస్తున్నట్లు పొందుపరిచాడు. దీని ఆధారంగా అనేక మంది సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్లు అయిన యువతులకు రిక్వెస్ట్‌లు పంపాడు. ఫొటో, ప్రొఫైల్స్‌ చూసిన అనేక మంది అతడిని సంప్రదించారు. దీంతో జీవన్‌కుమార్‌ తన పథకాన్ని అమలులో పెట్టాడు.  

ఎట్టి పరిస్థితుల్లోనూ ‘కనిపించకుండా’...
సదరు యువతుల వద్ద పెళ్లి ప్రతిపాదన చేసే జీవన్‌ ఫోన్‌ నెంబర్లు తీసుకునే వాడు. బోగస్‌ వివరాలతో తీసుకున్న సిమ్‌కార్డులు వినియోగించి వారితో మాట్లాడటం, చాటింగ్‌ చేయడం చేసేవాడు. నకిలీ ఫొటోతో ప్రొఫైల్‌ క్రియేట్‌ చేసిన నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ యువతులను కలవకుండా జాగ్రత్తలు పడ్డాడు. కొందరు వీడియో చాటింగ్‌ చేద్దామన్నా... వద్దంటూ వారించేవాడు. పూర్తిగా తనను నమ్మారని భావించిన తర్వాత తన తల్లికి క్యాన్సర్‌ అంటూ కథ చెప్పేవాడు. వైద్య ఖర్చుల పేరు చెప్పి వారి నుంచి నగదును తన బ్యాంకు ఖాతాల్లోకి ట్రాన్స్‌ఫర్‌ చేయించేవాడు. మరికొందరి నుంచి క్రెడిట్‌/డెబిట్‌కార్డుల వివరాలు, ఓటీపీలు తీసుకుని ఆన్‌లైన్‌లో షాపింగ్‌లు చేసేవాడు. ఇలా ఐదు నెలలుగా ఐదుగురిని మోసం చేశాడు. ఇతడిపై అక్కడి సైబర్‌ క్రైమ్‌ ఠాణాల్లోనూ కేసులు నమోదైనా ఇప్పటి వరకు ఎవరూ గుర్తించి పట్టుకోలేదు.  

 విలాసవంతమైన జీవితం...
నగరంలోని సికింద్రాబాద్‌ ప్రాంతానికి చెందిన యువతి నుంచి రూ.2.4 లక్షలతో సహా బెంగళూరు, ఢిల్లీ, ఒడిస్సాలకు చెందిన నలుగురి నుంచి రూ.20 లక్షలు స్వాహా చేశాడు. ఈ సొమ్ముతో జీవన్‌ అత్యంత విలాసవంతమైన జీవితం గడిపేవాడు. గోవాలో ఎంజాయ్‌ చేయడంతో పాటు రూ.70 వేల నుంచి రూ.లక్ష వరకు ఖరీదు చేసే ఆరు ఐ–ఫోన్లు, రూ.33 వేలతో యాపిల్‌ వాచ్, రూ.2.4 లక్షలతో బైక్, రూ.13 వేలతో యాపిల్‌ ఇయర్‌ ఫోన్లు తదితరాలు ఖరీదు చేశాడు. ఓ యువతి నుంచి డబ్బు తీసుకుని తర్వాత ఆమెతో సంప్రదింపులకు వాడిన సెల్‌ఫోన్‌ నెంబర్‌ మార్చేసేవాడు. ఇలా మోసపోయిన సికింద్రాబాద్‌ యువతి గత నెల మొదటి వారంలో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. సాంకేతిరంగా దర్యాప్తు చేసిన ఇన్‌స్పెక్టర్‌ సీహెచ్‌ గంగాధర్, ఎస్సై మధుసూదన్‌రావు, కానిస్టేబుళ్లు సతీష్‌ కుమార్, మురళీ నిందితుడు ప్రకాశం జిల్లాలో ఉన్నట్లు గుర్తించారు. అక్కడకు వెళ్లి అరెస్టు చేసి తీసుకువచ్చి రిమాండ్‌కు తరలించారు. ఇతడి నుంచి రూ.6 లక్షల విలువైన సొత్తు రికవరీ చేసిన అధికారులు బ్యాంక్‌ ఖాతాల్లో ఉన్న రూ.4.8 లక్షలు ఫ్రీజ్‌ చేశారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top