పబ్లిగ్గా మాస్‌ కాపీయింగ్‌!

mass copying in distance education degree exams - Sakshi

ఎస్కేడీ దూరవిద్య పరీక్షలు

కె.కోటపాడు కేంద్రంలో బాగోతం

అభ్యర్థి నుంచి రూ.20 వేలకు బేరం?

సాక్షి, విశాఖపట్నం: శ్రీకృష్ణ దేవరాయ యూనివర్సిటీ నుంచి దూరవిద్యలో డిగ్రీ పరీక్షలు రాస్తున్న విద్యార్థులు పబ్లిగ్గా మాస్‌ కాపీయింగ్‌కు పాల్పడుతున్నారు. పుస్తకాలు చూసి రాసుకునే సదుపాయాన్ని అక్కడ ఇన్విజిలేటర్లే కల్పిస్తున్నారు. ఇది బహిరంగంగానే జరుగుతున్నా ఏ ఒక్క అధికారీ అటు వైపు కన్నెత్తి చూడడం లేదు. ఐదు రోజుల కిత్రం ఈ పరీక్షలు ప్రారంభమయ్యాయి. విశాఖ జిల్లా కె.కోటపాడు టీఎస్సార్‌ జూనియర్‌ కాలేజీని సెంటరుగా కేటాయించారు. దాదాపు 400 మంది అభ్యర్థులు ఈ కేంద్రంలో పరీక్షలు రాస్తున్నారు. బీఏ, బీకాం, బీబీఎం, బీఎస్సీ గ్రూపులకు సంబంధించి ఫిజిక్స్, స్టాటస్టిక్స్, కామర్స్, ఎకనామిక్స్‌ తదితర పరీక్షలు జరుగుతున్నాయి.  ఒక్కొక్క అభ్యర్థి రూ.20 వేలు చెల్లించే ఒప్పందంతో వారికి నేరుగా పుస్తకాల్లో చూసి పరీక్షలు రాసుకునే సదుపాయాన్ని కల్పించినట్టు తెలి సింది.

ఒప్పందంలో భాగంగా ఆయా అభ్యర్థులు నిర్భీతిగా మాస్‌కాపీయింగ్‌కు పాల్పడుతున్న వైనాన్ని కొంతమంది కెమెరాల్లో బంధించారు. వాటిని శనివారం రాత్రి మీడియాకు విడుదల చేశారు. సంబంధిత యూనివర్సిటీ నుం చి పరిశీలకులుగా ఇద్దరు అధికారులు వచ్చారు. వారు విశాఖలోని ఒక స్టార్‌ హోటల్లో బస చేసినట్టు చెబుతున్నారు. వారి కనుసన్నల్లోనే ఈ కాపీయింగ్‌ వ్యవహారమంతా జరుగుతోంది. మరో మూడు రోజుల పాటు ఈ పరీక్షలు జరగనున్నాయి. ఈ మాస్‌కాపీయింగ్‌పై  విచారణ జరిపించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. ఈ మాస్‌కాపీయింగ్‌పై శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ వైస్‌ చాన్సలర్‌ రాజగోపాల్‌ను వివరణ కోరడానికి ఫోన్‌లో  ప్రయత్నించగా ఆయన స్పందించలేదు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top