
ఫంక్షన్ హాల్ పైకి ఎక్కి ఆత్మహత్య చేసుకుంటానని బెదిరిస్తున్న వాసు
మంగళగిరిటౌన్: అక్రమ కట్టడాలను తొలగించడానికి వెళ్లిన అధికారులను ప్రభుత్వ స్థలాల్లో నిర్మాణాలను చేపట్టిన వ్యక్తి బెదిరింపులకు పాల్పడిన సంఘటన మంగళగిరి మండలం యర్రబాలెం గ్రామ రెవెన్యూ పరిధిలో బుధవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే మంగళగిరి మండలం రాజధాని ప్రాంతంగా ప్రకటించిన తరువాత ఇక్కడ భూములకు రెక్కలు వచ్చి కోట్లలో రేట్లు పలుకుతుండడంతో భూ మాఫియాగాళ్లు రెచ్చిపోయి, ఖాళీ స్థలం కనబడితే అక్కడ పాగా వెయ్యడం, అనంతరం చేయి మార్పిడి ద్వారా డబ్బులు చేసుకోవడం షరా మామూలైపోయింది.
అక్రమార్కులకు ఈ ప్రాంతం స్వర్గథామంగా మారింది. తాజాగా మంగళగిరి మండలం యర్రబాలెం గ్రామంలోని డాన్‌బాస్కో పాఠశాల ఎదురుగా మంగళగిరి రైల్వే ఓవర్ బ్రిడ్జి పక్కన ప్రభుత్వ రోడ్లు, భవనాల స్థలంలో విజయవాడ సింగ్ నగర్‌కు చెందిన దళారులు, స్థానిక పచ్చనేతల అండదండలతో ప్రభుత్వ ఖాళీ స్థలాలను ఆక్రమించి, ఫ్లాట్లు వేసి విక్రయాలకు పాల్పడ్డారు. అంతేకాకుండా... డిలైట్ దాభా ఎదురు స్థలంలో ఇళ్లను, వ్యాపార దుకాణాలను అక్రమంగా నిర్మించారు. ఈ నిర్మాణాలు ప్రస్తుతం కూడా కొనసాగుతుండడంతో బుధవారం జిల్లా అధికారులు స్పందించి అక్రమ కట్టడాలను కూల్చేందుకు పూనుకున్నారు.
అధికారులకు షాక్...
డిలైట్ దాభా ఎదురుగా ఆర్ అండ్ బీ స్థలంలో స్వర్ణ ఫంక్షన్ హాల్ నిర్మించిన వాసు అనే వ్యక్తి ఫంక్షన్ హాల్ కూల్చివేస్తే ఊరుకునేది లేదని, అవసరమైతే ఇక్కడికి వచ్చిన అధికారుల పేర్లన్నీ కాగితం మీద రాసి ఆత్మహత్య చేసుకుంటానని ఫంక్షన్ హాల్ పైకి ఎక్కి అధికారులతో బెదిరింపులకు దిగాడు. అంతేకాకుండా కులం పేరుతో బెజవాడ మనుషుల చేత అడ్డొచ్చిన అధికారులను హత్య చేయిస్తాననడంతో అధికారులు భయభ్రాంతులకు గురయ్యారు.
అడుగడుగునా అడ్డంకులు...
అక్రమ కట్టడాలను కూల్చివేయడానికి కదిలివచ్చిన జిల్లా ఉన్నత స్థాయి అధికారులకు వారి పనిని వారు చేయనివ్వకుండా కట్టడాలను కూల్చడానికి వీలులేదని అధికారపార్టీ నేతలు అడుగడుగునా అడ్డుపడ్డారు. అధికారులు ఏం చేయాలో అర్ధం కాక గురువారం నాటికి కార్యక్రమాన్ని వాయిదా వేసుకుని వెనుదిరిగారు.
పోలీసులను అశ్రయించిన అధికారులు
అక్రమంగా నిర్మించుకున్నదే కాక అడిగినందుకు వచ్చిన అధికారులను చంపుతామని బెదిరించడంతో చేసేది లేక జిల్లా అధికారులు మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్ నుఆశ్రయించారు. ఆర్‌అండ్‌బీ ఏఈ మధు జరిగిన సంఘటనను వివరిస్తూ ఫిర్యాదు చేశారు. గురువారం విధులకు ఆటంకం కలగకుండా చర్యలు తీసుకోవాలని, బెదిరింపులకు పాల్పడిన వ్యక్తిని అదుపులోకి తీసుకోని చర్యలు తీసుకోవాల్సిందిగా మంగళగిరి రూరల్ ఎస్‌ఐ వినోద్ ను కోరారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నట్టు ఎస్‌ఐ వినోద్ తెలిపారు.
నేడు ఆక్రమణలు తొలగిస్తారా..?
ఆర్ అండ్ బీ అధికారులు గురువారం ఆక్రమణలను తొలగిస్తారో...లేక అధికార పార్టీ నేతల ఒత్తిళ్లకు తలొగ్గుతారో అనే అంశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.