సిలిండర్‌ పేలి వ్యక్తి సజీవదహనం | Man Died in Fire Accident Krishna | Sakshi
Sakshi News home page

సిలిండర్‌ పేలి వ్యక్తి సజీవదహనం

Feb 8 2019 1:44 PM | Updated on Feb 8 2019 1:44 PM

Man Died in Fire Accident Krishna - Sakshi

ఎగసి పడుతున్న మంటలు, (అంతరచిత్రం) మహమ్మద్‌ బాజీ (ఫైల్‌)

సమయం తెల్లవారుజాము 4.30 గంటలు... చుట్టుపక్కల వారంతా గాఢ నిద్రలో ఉన్నారు... ఆ అభాగ్యుడు మాత్రం అనారోగ్యంతో బాధపడుతూ లేవలేని స్థితిలో మంచానపడి నిద్రపోతున్నాడు.... అతనిపై అమ్మోరు పూనటంతో ఇంట్లో వాళ్ళు సైతం దూరంగా ఆరుబయట నిద్రపోతున్నారు. అనారోగ్యంతో బాధపడుతూ కలత నిద్రలో ఉన్న ఆ అభాగ్యుడిపైకి మృత్యువు మంటల రూపంలో దూసుకువచ్చింది. నిముషాల వ్యవధిలో అగ్నికీలలు అతన్ని చుట్టుముట్టి శరీరాన్ని మాంసపు ముద్ద చేసేసింది. ఈ ప్రమాదంలో ప్రాణాలతో బయటపడిన అతని తల్లి.. కొడుకు మంటల్లో కాలిపోతున్న దృశ్యాన్ని ప్రత్యక్షంగా చూసి తల్లడిల్లిపోయింది.... ‘బేటా బాహర్‌ ఆ..’ అంటూ ఆర్తనాదాలు చేసింది. బేటాను కాపాడండంటూ చుట్టుపక్కల ఇళ్ల తలుపులను తట్టి ప్రాధేయపడింది. ఇరుగు పొరుగు వచ్చి అతన్ని కాపాడేందుకు ప్రయత్నించేలోపే ఘోరం జరిగిపోయింది. ఈ హృదయ విదారక ఘటన జిల్లా కేంద్రమైన మచిలీపట్నంలో గురువారం తెల్లవారుజామున చోటుచేసుకుంది.

కోనేరుసెంటర్‌ (మచిలీపట్నం): స్థానిక రాజుపేటలోని మగ్గాలకాలనీకి చెందిన మహమ్మద్‌ బాజీ (38) వంట పనులు చేస్తుంటాడు. పదేళ్ళ క్రితం అతనికి విజయవాడకు చెందిన మహమ్మద్‌ బహరున్నీసాతో వివాహం అయ్యింది. వీరికి ఒక పాప, బాబు ఉన్నారు. భార్యాభర్తల మధ్య స్వల్ప విభేదాలు రావటంతో రెండు నెలల క్రితం బహరున్సీసా పిల్లలతో సహా పుట్టింటికి వెళ్లిపోయింది. అప్పటి నుంచి బాజీ తన తల్లి మెహరున్నీసాతో ఉంటున్నాడు. ఈ క్రమంలో వారం రోజుల క్రితం బాజీకి పొంగు జ్వరం సోకింది. అప్పటి నుంచి అన్నపానీయాలు తీసుకోవటం లేదు. దీంతో అతని ఆరోగ్యం మరింత క్షీణించింది.

షార్టు సర్క్యూట్‌తో అగ్నిప్రమాదం..
బుధవారం రాత్రి బాజీ నిద్రలోకి జారుకున్నాడు. బాజీకి పొంగు జ్వరం సోకటంతో తల్లి మెహరున్నీసా ఇంటి వరండాలో పడుకుంటోంది. తెల్ల వారుజాము సుమారు 4.30 గంటల సమయంలో విద్యుత్‌ షార్టు సర్క్యూట్‌ కారణంగా ఇంట్లో మంటలు రేగాయి. అలా రేగిన మంటలు ఇంటి కప్పుకు అంటుకున్నాయి. ప్రమాదాన్ని పసిగట్టిన మెహరున్నీసా వరండాలో నుంచి బాజీని బయటికి వచ్చేయమంటూ బిగ్గరగా కేకలు పెట్టింది. మంటలను అదుపు చేసేందుకు సహాయం కోరుతూ చుట్టుపక్కల వారిని నిద్రలేపేందుకు పరుగులు పెట్టింది. 

గ్యాస్‌ బండ పేలటంతో సజీవ దహనం..
ఇంటికి నిప్పంటుకుని మంటలు రేగటంతో పాటు తల్లి కేకలు విన్న బాజీ ప్రమాదం నుంచి బయటపడేందుకు ప్రయత్నించాడు. అయితే అనారోగ్యంతో నీరసించిపోయిన బాజీ శరీరం అందుకు సహకరించలేదు. అయినప్పటికీ ప్రాణాలను కాపాడుకునేందుకు ప్రయత్నిస్తుండగా ఎగసిపడుతున్న మంటలకు గ్యాస్‌ సిలిండర్‌ ఒక్కసారిగా పేలటంతో ఇంటి మొత్తాన్ని మంటలు ఆవహించాయి. లేవలేనిస్థితిలో ఉన్న బాజీని సైతం మంటలు చుట్టుముట్టి అతని శరీరాన్ని దహించివేశాయి. ఈ ప్రమాదంలో బాజీ అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. ఈ హృదయ విదారక ఘటనను ప్రత్యక్షంగా చూసిన స్థానికులు సైతం కంటతడిపెట్టగా, కళ్ల ఎదుట కొడుకు కాలిపోతుంటే చూస్తూ తట్టుకోలేని ఆ తల్లి దిక్కులు పిక్కటిల్లేలా విలపించింది.

మంటలను అదుపు చేసిన ఫైర్‌ సిబ్బంది..
స్థానికుల సమాచారంలో అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకుని మంటలను అదుపు చేశారు. అయితే అప్పటికే బాజీ శరీరం కాలి బూడిద అయిపోయింది. సమాచారం అందుకున్న ఇనగుదురుపేట పోలీసులు అక్కడికి చేరుకున్నారు. మెహరున్నీసా నుంచి వివరాలు తెలుసుకుని ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. మృతదేహానికి అక్కడే పోస్టుమార్టం చేయించి బంధువులకు అప్పగించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement