భార్యకు వీడియో కాల్‌.. వెంటనే ఆత్మహత్య

Man Commits Suicide After Video Calling His Wife In Miryalaguda - Sakshi

కుటుంబ కలహాలతో వ్యక్తి ఆత్మహత్య

నిద్రమాత్రలు మింగి అఘాయిత్యం

మిర్యాలగూడలో ఘటన

సాక్షి, మిర్యాలగూడ: కుటుంబ కలహాలతో ఓ వ్యక్తి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన మిర్యాలగూడ పట్టణంలో చోటు చేసుకుంది. మృతుడి బంధువులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణంలోని శాబునగర్‌ మాజీ కౌన్సిలర్‌ బంటు రామచంద్రు కుమారుడు బంటు రాజశేఖర్‌( 35) హైదరాబాద్‌లో నివాసముంటూ పలు వ్యాపారాలు చేస్తున్నాడు. అంతే కాకుండా చిట్యాల సమీపంలో ఓ పరిశ్రమకు డైరక్టర్‌గా ఉంటూనే తన వ్యాపారాలు చూసుకునేవాడు.

కాగా బంటు రాజశేఖర్‌ పదేళ్ల క్రితం పట్టణానికి చెందిన లక్ష్మిని ప్రేమ వివాహం చేసుకున్నాడు. వీరికి ఇద్దరు సంతానం. ఏమైందో తెలియదు కానీ భార్య లక్ష్మి కొద్ది రోజుల క్రితం పుట్టింటికి వెళ్లింది. రాజశేఖర్‌ రెండు రోజుల క్రితం మిర్యాలగూడలోని తల్లిదండ్రుల వద్దకు వచ్చాడు. గురువారం అర్ధరాత్రి సమయంలో తన భార్య లక్ష్మికి వీడియో కాల్‌ చేసి నిద్రమాత్రలు మింగి ఆత్మహత్య చేసుకుంటున్నట్లు చెప్పాడు. దీంతో లక్ష్మి వెంటనే తన అత్తగారు బంటు కాత్యాయినికి ఫోన్‌ చేసి రాజశేఖర్‌ ఆత్మహత్యకు పాల్పడుతున్నాడని చెప్పింది. వెంటనే రాజశేఖర్‌ నిద్రిస్తున్న గది తలుపులు తెరిచి అతడిని  పట్టణంలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో హైదరాబాద్‌కు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందాడు. 

రోదిస్తున్న కుటుంబ సభ్యులు 

శోక సంద్రంలో శాబునగర్‌ కాలనీ..
మాజీ కౌన్సిలర్‌ బంటు రామచంద్రు కుమారుడు రాజశేఖర్‌ మృతిచెందాడన్న వార్త తెలియడంతో కాలనీ ప్రజలు, పట్టణ వాసులు అతడి నివాసానికి భారీగా చేరుకున్నారు. స్నేహితులు రాజశేఖర్‌తో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకుని కన్నీటి పర్యంతమయ్యారు. వృద్ధాప్యంలో తమకు అండగా ఉంటాడనుకున్న కుమారుడు మృతి చెందడంతో బంటు రామచంద్రు, తల్లి కాత్యాయిని రోదించిన తీరు అక్కడి వారిని కలిచి వేసింది. పలు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, పట్టణ ప్రముఖులు రాజశేఖర్‌ మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. అనంతరం అశ్రునయనాల మధ బంటు రాజశేఖర్‌ అంతిమయాత్ర సాగింది. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top