
తమ్ముడిని హతమార్చిన అన్న యువతిపై హత్యాయత్నం
సాక్షి ప్రతినిధి, చెన్నై: ఒకే ప్రాంతానికి చెందిన వారు కావడంతో ఆ యువతీ యువకులిద్దరి మధ్య ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. వేర్వేరు సామాజిక వర్గాలకు చెందిన తాము ప్రేమించుకుంటే ప్రాణం మీదకు వస్తుందని వారికి తెలియదు. పెద్దలను ధిక్కరించైనా పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకున్నారు. ఈ విషయం కాస్త పెద్దలకు తెలియడంతో ప్రేమ వ్యవహారం ప్రమాదస్థాయికి చేరుకుంది. స్వయానా అన్న చేతిలో తమ్ముడు హత్యకు గురికాగా, ప్రియురాలు చావుబతుకుల మధ్య ఆస్పత్రిలో కొట్టుమిట్టాడుతోంది. వివరాలు.
కోయంబత్తూరు మేట్టుపాళయంకు చెందిన కరుప్పుస్వామికి వినోద్ (25), కనకరాజ్ (22), కార్తిక్ (19) అనే ముగ్గురు కుమారులున్నారు. కూరగాయల మార్కెట్‌లో కూలీగా పనిచేస్తున్న కనకరాజ్ అదే ప్రాంతానికి చెందిన మూర్తి కుమార్తె వర్షిణిప్రియ (16) రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఇద్దరూ వేర్వేరు సామాజికవర్గాలకు చెందిన వారు. మూడునెలల క్రితం కనకరాజ్ ఇంటికి వచ్చిన వర్షిణిప్రియ తనను పెళ్లి చేసుకోవాలని కోరగా వినోద్ సహా కుటుంబసభ్యులంతా ఆమెపై కోపగించుకున్నారు. దీంతో మూర్తి తన కుమార్తెను మరో ప్రాంతంలోని బంధువు ఇంట్లో ఉంచాడు. అయినా వీరిద్దరి ప్రేమ కొనసాగింది. మూడురోజుల క్రితం వర్షిణి మరలా కనకరాజ్ ఇంటికి వచ్చి పెళ్లిపై ఒత్తిడి తేవడంతో వినోద్ ఇతర కుటుంబసభ్యులు మరలా గొడవపడ్డారు. దీంతో కనకరాజ్ ఒక ఇంటిని అద్దెకు తీసుకుని అందులో వర్షిణితో కలిసి ఉండడం ప్రారంభించాడు. ఇందుకు మరింత ఆగ్రహం చెందిన వినోద్ మంగళవారం సాయంత్రం కనకరాజ్ ఇంటికి వెళ్లి వర్షిణిప్రియను పెళ్లిచేసుకోవడానికి వీల్లేదని చెప్పాడు. దీంతో ఇరువురి మధ్య వాగ్యుద్ధం చోటుచేసుకుని తీవ్రస్థాయికి చేరుకుంది.
ఈ సమయంలో వినోద్ తన వెంట తెచ్చుకుని వేటకత్తితో తమ్ముడు కనకరాజ్‌పై దాడిచేయగా సంఘటన స్థలంలోనే మృతి చెందాడు. అడ్డుపడిన వర్షిణి తీవ్రంగా గాయపడి విషమపరిస్థితిలో ఆçస్పత్రిలో చికిత్స పొందుతోంది. నిందితుడు వినోద్ బుధవారం ఉదయం మేట్టుపాళయం పోలీసుస్టేషన్‌లో లొంగిపోయాడు. తమ్ముడు కనకరాజ్ వేరే సామాజికవర్గానికి చెందిన యువతిని ప్రేమించడంతో వద్దని వారించాను. అయినా వినకుండా ఒకరోజు ఇంటికి తీసుకొచ్చాడు. అంతేగాక తన మాటను ధిక్కరించి ప్రియురాలితో కలిసి జీవించడాన్ని సహించలేక ఇద్దరిని చంపేయాలని భావించానని పోలీసులకు వినోద్ వాంగ్మూలం ఇచ్చాడు.