ప్రేమ పేరిట మహిళలకు వల | Man Arrest in Cheating Women in Social Media Case | Sakshi
Sakshi News home page

ప్రేమ పేరిట మహిళలకు వల

Jan 19 2019 1:39 PM | Updated on Jan 19 2019 1:39 PM

Man Arrest in Cheating Women in Social Media Case - Sakshi

నిందితుని వివరాలను వెల్లడిస్తున్న డీఎస్పీ , నిందితుడు వాసు

నెల్లూరు(క్రైమ్‌): ప్రేమ పేరిట మహిళలకు వలవేసి వారిని మోసం చేసి బెదిరింపులకు పాల్పడడం.. రూ.లక్షలు వసూలు చేసి విలాసవంతంగా జీవిస్తున్న ఓ నిత్య ప్రేమికుడిని నెల్లూరు బాలాజీనగర్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. నగరంలోని బాలాజీనగర్‌ పోలీసు స్టేషన్‌లో శుక్రవారం సాయంత్రం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో నగర డీఎస్పీ ఎన్‌బీఎం మురళీకృష్ణ వివరాలను వెల్లడించారు. ఇందుకూరుపేట మండలం రావూరు గారమానికి చెందిన తాటిచెట్ల వాసు ఏసీ మెకానిక్‌గా పనిచేస్తున్నాడు. ఏసీలు బిగించేందుకు, సర్వీస్‌ చేసేందుకు పలువురికి ఇళ్లకు వెళుతుండేవాడు. ఈ క్రమంలో అక్కడున్న మహిళలు, యువతులను పరిచయం చేసుకునేవాడు. వారి వివరాలను సేకరించి తరచూ వారికి ఫోన్లు చేయడం, వాట్సాప్, ఫేస్‌బుక్‌ల్లో చాటింగ్‌ చేసి వారిని ప్రేమిస్తున్నాని మాయమాటలు చెప్పి లోబర్చుకునేవాడు. వారి స్నేహితురాల వివరాలను తెలుసుకుని ఇదే తరహాలో వంచించేవాడు. ఆ తర్వాత వారిని బెదిరించి రూ.లక్షలు వసూలు చేసి విలాసవంతంగా జీవించసాగాడు. 

పెళ్లి చేసుకుంటానని నమ్మించి..
వాసు నగరంలోని చిన్నబజారుకు చెందిన ఓ మహిళను వివాహం చేసుకుంటానని నమ్మించాడు. ఆమెతో శారీరకంగా దగ్గరయ్యాడు. సదరు మహిళ ద్వారా ఆమె స్నేహితురాలైన వరంగల్‌ జిల్లా కె.సముద్రంకు చెందిన ఓ మహిళకు వలవేశాడు. ప్రేమిస్తున్నానని నమ్మించి ఆమెను తీసుకుని నెల్లూరుకు వచ్చాడు. ఇందుకూరుపేటలోని గంగమ్మగుడిలో వివాహం చేసుకుని కాపురం పెట్టాడు. అనంతరం ఆమెను పీడించి డబ్బులు తీసుకుని తీవ్రంగా హింసించడంతో బాధిత మహిళ తన స్వగ్రామానికి వెళ్లింది. వాసుపై కె.సముద్రం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు.

రూ.12 లక్షలు కాజేశాడు
అనంతరం ఇందుకూరుపేటకు చెందిన ఓ యువతికి ఫేస్‌బుక్, వాట్సప్‌ ద్వారా ప్రేమిస్తున్నాని సందేశాలు పంపి ఆమెను లోబర్చుకుని మోసం చేశాడు. కొంతకాలంగా ఆమెకు దూరంగా ఉంటూ నగరానికి చెందిన ఓ వైద్య విద్యార్థినికి వలవిసిరాడు. ఆమెకు మాటలు చెప్పి రూ.12 లక్షలు నగదు కాజేశాడు. ఈ మేరకు బాధితురాలు బాలాజీనగర్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన ఇన్‌స్పెక్టర్‌ జి.వేణుగోపాల్‌రెడ్డి తన సిబ్బందితో కలిసి నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. శుక్రవారం అదుపులోకి తీసుకున్నారు. అనంతరం తమదైన శైలిలో విచారించగా నిందితుడు ఇదే తరహాలో పలువురిని మోసగించినట్లు విచారణలో వెల్లడై ంది. అదేక్రమంలో 2013లో వాసు సైదాపురం పోలీసు స్టేషన్‌ పరిధిలో స్నేహితులతో కలిసి డెకాయిటీకి పాల్పడ్డాడని తేలింది. అతడిని అరెస్ట్‌ చేశామని డీఎస్పీ తెలిపారు.

జాగ్రత్త..
విద్యార్థినులు, యువతులు, మహిళలు సోషల్‌ మీడియాను వినియోగించే సమయంలో జాగ్రత్తగా ఉండాలని డీఎస్పీ మురళీకృష్ణ సూచించారు. వ్యక్తిగత వివరాలు తెలుసుకుని దుండగులు నేరాలకు పాల్పడుతున్నారన్నారు. తీయని మాటలు చెబుతూ ప్రేమిస్తున్నాని నమ్మబలికే ఈ తరహా వ్యక్తులను నమ్మి మోసపోవద్దని సూచించారు. నిత్య ప్రేమికుడిని అతి చాకచక్యంగా అరెస్ట్‌ చేసిన బాలాజీనగర్‌ ఇన్‌స్పెక్టర్‌ జి.వేణుగోపాల్‌రెడ్డి, ఎస్సై రమేష్, నాలుగో నగర హెడ్‌కానిస్టేబుల్‌ ప్రసాద్‌ను డీఎస్పీ అభినందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement