లండన్‌వాసి మృతిపై అనుమానం

London Doctor Suspicious death West Godavari - Sakshi

మృతదేహానికి పోస్టుమార్టం చేసిన అధికారులు

పశ్చిమగోదావరి ,పాలకొల్లు సెంట్రల్‌: పట్టణంలో శంభుని పేటకు చెందిన డాక్టర్‌ చదలవాడ డేవిడ్‌జాన్‌ (75) మృతిపై అనుమానంతో మంగళవారం అతని మృతదేహానికి అధికారులు పోస్టుమార్టం చేశారు. బంధువుల కథనం ప్రకారం పట్టణానికి చెందిన డేవిడ్‌జాన్‌ 50 సంవత్సరాల క్రితం లండన్‌ వెళ్లి డాక్టర్‌ వృత్తిలో అక్కడే స్థిరపడ్డారు. కొన్నాళ్లకు లండన్‌కు చెందిన జీన్‌మూడీ అనే మహిళను వివాహం చేసుకున్నారు. వీరికి  ముగ్గురు అబ్బాయిలు, ముగ్గురు అమ్మాయిలు సంతానం. డాక్టర్‌గా రిటైరైన తరువాత ఆరు మాసాలకు ఒకసారి పాలకొల్లు వస్తుండేవారు. పాలకొల్లులో అతని సొంత నివాసంలో వృద్ధుల కోసం ఓ అనాథాశ్రమాన్ని ఏర్పాటు చేశారు. పట్టణంలో ఈ వృద్ధాశ్రమాన్ని 18 మాసాలు కొనసాగించారు. అనంతరం దీనిని మూడు సంవత్సరాల క్రితం వైజాగ్‌లో బాబా ట్రస్ట్‌గా ఏర్పాటు చేసి అక్కడ బుర్రె ఉమ, భర్త తులసీరావులను నిర్వాహకులుగా నియమించారు.

ఇటీవల జూన్‌ 16న లండన్‌ నుంచి వైజాగ్‌ వచ్చిన డేవిడ్‌ జాన్‌ జులై 21న మృతి చెందారు. దీంతో అతని కుటుంబ సభ్యులు స్వగ్రామం పాలకొల్లు కావడంతో పాలకొల్లు రూరల్‌ క్రిస్టియన్‌ శ్మశాన వాటికలో అంత్యక్రియలు చేసినట్లు బంధువులు తెలిపారు. జాన్‌ డెత్‌ సర్టిఫికెట్‌ కోసం ఆయన పిల్లలు వైజాగ్‌లో బాబా ట్రస్ట్‌ నిర్వాహకులను అడగగా ఆసుపత్రిలో చనిపోయినట్లు తెలిపారు. ఆసుపత్రికి వెళ్లి సమాచారం అడగగా ఇంటి వద్ధ చనిపోయిన వ్యక్తినే ఆసుపత్రికి తీసుకువచ్చారని చెప్పడంతో నిర్వాహకులపై అనుమానం వచ్చిందని బంధువులు తెలిపారు. లండన్‌ వెళ్లిపోయిన డేవిడ్‌ జాన్‌ పిల్లలు వారికి సమీప బంధువైన మాముడూరి జయంత్‌తో పాలకొల్లు పోలీస్‌ స్టేషన్లో జాన్‌ మృతిపై అనుమానం ఉందని కేసు పెట్టించారు. నాలుగు రోజుల క్రితం జయంత్‌ అనే వ్యక్తి కేసు పెట్టగా కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్లు పట్టణ సీఐ బి.కృష్ణకుమార్‌ తెలిపారు. ఈ మేరకు మంగళవారం తహసీల్దార్‌ దాశి రాజు ఆధ్వర్యంలో డేవిడ్‌ జాన్‌ బంధువుల సమక్షంలో పూడ్చిపెట్టిన మృతదేహాన్ని వెలికి తీయించి పాలకొల్లు ప్రభుత్వ ఆసుపత్రి డాక్టర్‌ భాస్కరరావు పోస్టుమార్టం చేశారు. పట్టణ వైద్యులు డాక్టర్‌ సీహెచ్‌ సత్యనారాయణమూర్తికి డేవిడ్‌జాన్‌ చిన్ననాటి స్నేహితుడు కావడంతో పోస్టుమార్టం జరిగే వరకూ ఆయన కూడా శ్మశాన వాటిక వద్దే ఉన్నారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top