ఇదేమీ క్రైం సినిమా కథ కాదు.. | Interstate Thief Arrest In Guntur | Sakshi
Sakshi News home page

వామ్మో.. సత్పాల్‌సింగ్‌!

Jun 18 2018 1:26 PM | Updated on Aug 24 2018 2:36 PM

Interstate Thief Arrest In Guntur - Sakshi

సత్పాల్‌సింగ్‌ (ఫైల్‌)

టిప్‌టాప్‌గా తయారై, ల్యాప్‌టాప్‌ బ్యాగ్‌తో విమానంలో దర్జాగా దిగుతాడు. అప్పటికే విమానాశ్రయం వద్ద కొన్ని కార్లలో కొందరు అతని కోసం నిరీక్షిస్తుంటారు. వారితో కలసి కార్లలో నగరంలోకి ప్రవేశిస్తాడు. అప్పటికే రెక్కీ నిర్వహించిన ఖరీదైన కాలనీలు, అపార్టుమెంట్లలో రాత్రి వేళల్లో ప్రవేశించి దొంగతనం చేస్తాడు. ఎవరైనా గుర్తిస్తే నిర్దాక్షిణ్యంగా హత్య చేస్తాడు. పని ముగించుకుని వేషం మార్చుకుని అంతే దర్జాగా మళ్లీ విమానంలో మరో నగరానికి వెళ్లిపోతాడు. ఇదేమీ క్రైం సినిమా కథ కాదు. దేశంలో 14 ఏళ్లుగా 10 రాష్ట్రాల్లో బెంబేలెత్తిస్తున్న అంతర్రాష్ట్ర దొంగల ముఠా రియల్‌ స్టోరీ ఇదీ. ఈ ముఠాకు నాయకుడే సత్పాల్‌సింగ్‌ అలియాస్‌ అజయ్‌ చౌహాన్‌.

సాక్షి, అమరావతి బ్యూరో : హరియాణాలోని గుర్‌గామ్‌కు చెందిన సత్పాల్‌సింగ్‌ అలియాస్‌ అజయ్‌ చౌహాన్‌ మూడేళ్ల పాటు సైన్యంలో పనిచేశాడు. అందుకే అతన్ని ఫౌజీ అని ఆ ముఠా సభ్యులు సంబోధిస్తారు. గతంలో సత్పాల్‌సింగ్‌ ఒకర్ని హత్యచేసి కొన్నాళ్లు జైలు శిక్ష అనుభవించాడు. జైలు నుంచి విడుదల అయిన అనంతరం 2004లో ఓ అంతర్రాష్ట్ర దొంగల ముఠాను ఏర్పాటు చేశాడు. హరియాణా, యూపీ, రాజస్థాన్‌లకు చెందిన 10 మంది ఈ ముఠాలో సభ్యులు. అక్రమంగా ఆయుధాలు సమకూర్చుకుని దొంగతనాలు మొదలుపెట్టారు. నగరాల్లో ధనవంతులు ఉండే కాలనీలు, అపార్టుమెంట్లను లక్ష్యంగా చేసుకుని ఈ ముఠా చెలరేగిపోతోంది. సత్పాల్‌సింగ్‌ తాము లక్ష్యంగా చేసుకున్న నగరానికి తమ ముఠా సభ్యులను ముందుగా పంపించి రెక్కీ నిర్వహిస్తారు. అనంతరం సత్పాల్‌సింగ్‌ విమానంలో ఆ నగరానికి చేరుకుంటాడు. రాత్రి వేళలో టిప్‌టాప్‌గా తయారై ల్యాప్‌టాప్‌ బ్యాగ్‌ మెడలో వేసుకుని ఎంపిక చేసిన కాలనీలోకి ఖరీదైన కారులో వస్తారు.

ఇంగ్లిషులో అనర్గళంగా మాట్లాడే ఇతన్ని చూస్తే ఎవరో ఉన్నతాధికారి అని అనుకుంటారు. ముఠా సభ్యులు బయటే ఉంటారు. సత్పాల్‌సింగ్‌ ఒక్కడే ఎంపిక చేసుకున్న బంగ్లాలు, అపార్టుమెంట్లలోకి దర్జాగా ప్రవేశిస్తాడు. సీసీ కెమెరాలు ఉంటే వాటిని పనిచేయకుండా చేస్తాడు. గంట వ్యవధిలో దొంగతనం పూర్తి చేసుకుని వెళ్లిపోతాడు. అపార్టుమెంట్‌లోకి ప్రవేశించేటప్పుడు లిఫ్ట్‌లో వెళ్లే సత్పాల్‌సింగ్‌.. వచ్చేటప్పుడు మాత్రం మెట్లు దిగి వస్తాడు. వేషం మార్చుకుని ఆ మర్నాడే విమానం ఎక్కి ఢిల్లీ చేరుకుంటాడు. ఆ తరువాత  ముఠా సభ్యులు కూడా వేర్వేరు మార్గాల్లో విమానాల్లో ఢిల్లీ వెళ్తారు. తాము దొంగతనం చేసిన బంగారు ఆభరణాలను ఢిల్లీలో విక్రయించి సొమ్ము చేసుకుంటారు. ఈ ముఠా అత్యంత విలాసవంతమైన జీవితాన్ని గడుపుతుంటుంది. తరచూ గోవా, సిక్కిం, కేరళ తదితర ప్రాంతాలకు వెళ్లి జల్సా చేస్తుంటారు. ఏటా డిసెంబర్‌ 31న ఈ ముఠా సభ్యులు గోవాలో పెద్ద పార్టీ చేసుకుంటారని పోలీసులు చెబుతున్నారు.

14 ఏళ్లుగా 10 రాష్ట్రాల్లో హల్‌చల్‌
ఇలా సత్పాల్‌సింగ్‌ ముఠా 2004 నుంచి దేశంలో వరుస దొంగతనాలతో 10 రాష్ట్రాల్లో  హల్‌చల్‌ చేస్తోంది. ఢిల్లీ, ముంబాయి, అహ్మదాబాద్, జైపూర్, భోపాల్, హైదరాబాద్‌ తదితర నగరాల్లో కోట్లాది రూపాయల విలువైన బంగారాన్ని కొల్లగొట్టింది. ఆ క్రమంలో హత్యలు చేసేందుకు కూడా వెనుకాడలేదు. సత్పాల్‌సింగ్‌ తమ ముఠా సభ్యులకు అధునాతన రివాల్వర్లు కూడా  సమకూర్చాడు. సీసీ కెమెరాలు పనిచేయకుండా చేయడం, తరచూ వేషాలు మార్చి ఏమారుస్తుండటంతో సత్పాల్‌సింగ్‌ ప్రస్తుతం ఎలా ఉంటాడో కూడా పోలీసులు చెప్పలేకపోతున్నారు. 2010లో ఒకసారి మాత్రమే ఢిల్లీ పోలీసులు సత్పాల్‌సింగ్‌ను అరెస్టు చేశారు. ఆ కేసులో బెయిల్‌పై విడుదల అయిన అనంతరం మళ్లీ అతను దొంగతనాలతో చెలరేగిపోతున్నాడు. ఈ ముఠా కోసం తమ తరఫున వాదించేందుకు ఖరీదైన న్యాయవాదులను కూడా వినియోగిస్తుండటం గమనార్హం. ఈ ముఠా 2017 అక్టోబరులో మన రాష్ట్రంలో అడుగుపెట్టింది. ఈ తొమ్మిది నెలల్లోనే రాష్ట్రంలో ఐదు జిల్లాల్లో 16 చోట్ల దొంగతనాలతో బెంబేలెత్తించింది. ఈ ముఠా సభ్యులు ఇద్దర్ని విజయవాడ పోలీసులు అరెస్టు చేశారు. మరి సత్పాల్‌సింగ్‌ ఆటను పోలీసులు  ఎప్పుడు కట్టిస్తారో మరి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement