నిండు గర్భిణిని హతమార్చిన భర్త!

Husband Killed Pregnant Wife Brutally In Ibrahimpatnam - Sakshi

ఆస్పత్రిలో చూపిస్తానని దారుణహత్య

అదనపు కట్నం కోసం వేధింపులు 

పోలీసులకు లొంగిపోయిన నిందితుడు 

ఇబ్రహీంపట్నం ఠాణా పరిధిలో ఘటన

సాక్షి, ఇబ్రహీంపట్నం: కట్టుకున్న భార్య.. నిండు గర్భిణి.. భార్యనేను కనికరం లేకుండా కడతేర్చాడో ఓ భర్త. ఈ హృదయ విదారక సంఘటన రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని చింతపల్లిగూడ గేట్‌ సమీపంలోని చోటుచేసుకుంది. ఎస్‌ఐ మోహన్‌ కథనం ప్రకారం.. నల్లగొండ జిల్లా మర్రిగూడ మండలం అజీలపురం గ్రామానికి చెందిన సరిత (22)కు రంగారెడ్డి జిల్లా కందుకూర్‌ మండలం పోచమ్మగడ్డతండాకు చెందిన ఆటో డ్రైవర్‌ రాజు (25)తో 2018 మే నెలలో వివాహమైంది. కట్నకానుకల కింద రూ.పది లక్షలు ఇచ్చారు. అయితే కొన్నాళ్లు బాగానే ఉన్నా వీరి కాపురంలో అదనపు కట్నం చిచ్చుపెట్టింది. అదనంగా కట్నం తేవాలని తరచూ సరితను భర్త వేధించడం మొదలుపెట్టాడు. దీంతో భార్యాభర్తల మధ్య మనస్పర్థలు చోటుచేసుకున్నాయి.

ఈ విషయమై అప్పట్లో మర్రిగూడ పోలీస్‌స్టేషన్‌లో ఆమె ఫిర్యాదు చేయడంతో కౌన్సిలింగ్‌ ఇప్పించారు. అయితే పెద్దల సమక్షంలో రాజీకి వచ్చినా ఆ తర్వాత యథావిధిగానే పరిస్థితి ఉంది. అయితే రెండు రోజుల కిందట ఏడు నెలల గర్భవతిగా ఉన్న భార్యను ఆస్పత్రిలో చూపిస్తానని చెప్పి రాజు ఇంటి నుంచి ఆమెను తీసుకెళ్లాడు. క్యాబ్‌లో కందుకూర్‌ నుంచి మంగళ్‌పల్లికి భార్యతో పాటు వచ్చాడు. చింతపల్లిగూడ గేట్‌ సమీపంలోని పొదల్లోకి తీసుకెళ్లి ఆమె చున్నీని మెడకు బిగించి ఊపిరి ఆడకుండా చేసి హతమార్చేశాడు. ఆ తర్వాత బావమరిది నర్సింహకు ఫోన్‌ చేసి మీ సోదరి ఇంట్లో కనిపించడం లేదని చెప్పాడు. దీంతో నర్సింహా శనివారం కందుకూర్‌ పోలీస్‌స్టేషన్‌లో మిస్సింగ్‌ కేసు పెట్టాడు. అయితే ఆదివారం చింతపల్లిగూడ గేట్‌ పొదల్లో సరిత శవమై తేలిందని కబురు అందింది. డాగ్‌స్క్వాడ్‌తో చుట్టుముట్టు పరిసరాలను పరిశీలించారు. ఈలోపే కందుకూర్‌ పోలీస్‌స్టేషన్‌లో రాజు లొంగిపోయాడు. ఈ మేరకు దర్యాప్తు చేస్తున్నారు. 

కుటుంబసభ్యుల ఆందోళన 
అదనపు కట్నం కోసం వేధిస్తూ సరితను హతమార్చడంతో కుటుంబసభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అతడిని కఠినంగా శిక్షించి తమకు న్యాయం చేయాలని అజిలాపూర్‌ గ్రామస్తులు ఆదివారం రాత్రి ఇబ్రహీంపట్నం పోలీస్‌స్టేషన్‌ ఎదుట బైఠాయించారు. తన సోదరి మృతిచెందడంతో మనస్తాపం చెందిన సోదరుడు నర్సింహ ఒంటిపై పెట్రోల్‌ పోసుకోని ఆత్మహత్యాయత్నానికి యత్నించాడు. దీంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ప్రధాన రోడ్డుపై బైఠాయించడంతో ట్రాఫిక్‌ స్తంభించింది. దీంతో ప్రయాణికులు, వాహనదా రులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పోలీసులు ఎంతచెప్పినా ఆందోళనకారులు వినిపించుకో లేదు. చివరికి పోలీసులు కల్పించుకుని ఆందోళ నకారులతో మాట్లాడి శాంతింపజేశారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top