ముంబై టు మొహాలీ వయా సిటీ!

Gold Smuggling Gang Arrest In Hyderabad - Sakshi

రూ.6 కోట్ల ఆభరణాల అక్రమ రవాణా

చండీఘడ్‌ ఎయిర్‌పోర్ట్‌లో ఇరువురి పట్టివేత

ముంబైకి చెందిన వ్యాపారవేత్తలుగా గుర్తింపు

సాక్షి, సిటీబ్యూరో: ముంబై నుంచి నగరం మీదుగా చండీఘడ్‌లోని మొహాలీకి అక్రమ రవాణా అయిన రూ.6 కోట్ల బంగారు, వెండి ఆభరణాలు, అమెరికన్‌ డైమండ్స్‌ను ఎయిర్‌పోర్ట్‌ పోలీసులు పట్టుకున్నాడు. ఆ అధికారులకు అందిన విశ్వసనీయ సమాచారంతో చండీఘడ్‌ విమానాశ్రయంలో ఇరువురు ముంబై వాసుల్ని బుధవారం అదుపులోకి తీసుకున్నారు. వీరిని అక్కడి కస్టమ్స్‌ అధికారులకు అప్పగించిన పోలీసులు ఇంత సొత్తుతో ముంబై, హైదరాబాద్‌ విమానాశ్రయాలను వీరు ఎలా దాటి రాగలిగారనే అంశంపై ఆరా తీస్తున్నారు. ముంబైకి చెందిన వారిగా చెప్పుకుంటున్న బంగారం వ్యాపారులు రాకేష్‌ మీనావాలా, ధరమ్‌రాజ్‌ మీనావాలా బుధవారం విమానంలో హైదరాబాద్‌ చేరుకున్నారు. ఇక్కడ నుంచి ఇండిగో విమానంలో చండీఘడ్‌ విమానాశ్రయానికి చేరుకున్నారు. తమ వెంట ఉన్న హ్యాండ్‌ బ్యాగేజ్‌లో రూ.6 కోట్ల విలువైన బంగారు, వెండి ఆభరణాలతో పాటు కొన్ని విలువైన అమెరికన్‌ డైమండ్స్‌ను తీసుకువచ్చారు.

వీరి వ్యవహారంపై మొహాలీ పోలీసులకు సమాచారం అందింది. దీంతో ఆ అధికారులు చండీఘడ్‌ విమానాశ్రయ పోలీసుల్ని అప్రమత్తం చేశారు. రంగంలోకి దిగిన ఇన్‌స్పెక్టర్‌ హసిమ్రన్‌సింగ్‌ నేతృత్వంలోని బృందం ఇద్దరినీ గుర్తించి అదుపులోకి తీసుకుంది. బ్యాగేజీని తనిఖీ చేయగా 43 చెవి రింగులు, 19 బ్రాస్‌లెట్స్, 43 ఉంగరాలు, 4 గాజులు, 3 పెండెంట్‌ సెట్స్, 14 నెక్లెస్‌లు, 6 వెండి ఆభరణాలు, 10 అమెరికన్‌ డైమండ్స్‌ గుర్తించారు. వీటి మార్కెట్‌ విలువ రూ.6 కోట్లుగా లెక్కగట్టిన అధికారులు అక్కడి కస్టమ్స్‌ విభాగానికి అప్పగించారు. ప్రాథమిక లెక్కల ప్రకారం వీరికి రూ.35.75 లక్షల పన్ను విధించారు. ఈ మొత్తం చెల్లించకపోతే ఆభరణాలను వేలం వేస్తామని అధికారులు చెప్తున్నారు.

ఈ ఆభరణాలు ఎక్కడ నుంచి ఎక్కడకు తీసుకువెళ్తున్నారంటూ రాకేష్, ధరమ్‌రాజ్‌లను చండీఘడ్‌ ఎక్సైజ్‌ అధికారులు ప్రశ్నించారు. అవి తమ వ్యాపారంలో భాగమని చండీఘడ్‌లోని ఓ స్టార్‌హోటల్‌లో జరుగుతున్న జ్యువెలరీ ఎగ్జిబిషన్‌లో ప్రదర్శించేందుకు తీసుకువెళ్తున్నామంటూ వివరణ ఇచ్చారు. అయితే ముంబై నుంచి చండీఘడ్‌కు నేరుగా విమానాలు ఉండగా... టిక్కెట్స్‌ ధర ఎక్కువైనప్పటికీ హైదరాబాద్‌ మీదుగా ఎందుకు వచ్చారన్న కస్టమ్స్‌ అధికారుల ప్రశ్నకు రాకేష్, ధరమ్‌రాజ్‌ల నుంచి సమాధానం కరువైంది. మరోపక్క ఈ విషయాన్ని మొహాలీ పోలీసులు సీరియస్‌గా తీసుకున్నారు. ఇంత భారీ సొత్తు హ్యాండ్‌ బ్యాగేజీల్లో ముంబై, హైదరాబాద్‌ విమానాశ్రయాల్లోని తనిఖీల నుంచి ఎలా తప్పించుకున్నారు? అనే దానిపై కస్టమ్స్‌ అధికారులతో కలిసి ఆరా తీస్తున్నారు. ఈ వ్యవహారంలో తనిఖీల్లో లోపాలు కారణమా? లేక ఎవరైనా సహకరించారా? అనే అంశాన్ని పరిగణలోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఓ బృందం త్వరలో సిటీకి రానున్నట్లు తెలిసింది. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top