
ఘటనా స్థలంలో మనుమరాలి చేయి పట్టుకొని విలపిస్తున్న నాయనమ్మ
కృష్ణాజిల్లా, పెనుగంచిప్రోలు (జగ్గయ్యపేట) : రోడ్డు ప్రమాదంలో ఓ బాలిక మృతి చెందిన ఘటన మండల పరిధిలోని కొణకంచి క్రాస్‌రోడ్స్ వద్ద గురువారం సాయంత్రం చోటు చేసుకుంది. జగ్గయ్యపేట మండలం బండిపాలెం గ్రామానికి చెందిన నెల్లూరి నరేంద్ర పెద్ద కుమార్తె తరుణి (7) నాయనమ్మ ఈశ్వరమ్మతో కలిసి గౌరవరం గ్రామంలో బంధువుల ఇంటికి పండగకు వెళ్లింది. తిరుగు ప్రయాణంలో గౌరవరం నుంచి బస్సులో కొణకంచి క్రాస్ రోడ్స్ వద్ద దిగి ఈశ్వరమ్మ మనమరాలు తరుణి చేయి పట్టుకొని బండిపాలెం వెళ్లేందుకు రోడ్డు దాటుతోంది. అదే సమయంలో విజయవాడ నుంచి హైదరాబాద్ వైపు వేగంగా వెళ్తున్న కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తరుణి అక్కడికక్కడే మృతి చెందింది. అప్పటి వరకు చేయి పట్టుకొని నడిచిన మనుమరాలు మృతి చెందటంతో ఘటనా స్థలంలో నాయనమ్మ బోరున విలపిస్తున్న తీరు అందరినీ కలచివేసింది. పండగకు వెళ్లి వస్తూ తమ కుమార్తె మరణించటంతో బాలిక తల్లిదండ్రుల వేదన వర్ణనాతీతంగా మారింది. పెనుగంచిప్రోలు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా, బాలిక గౌరవరంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో ఒకటవ తరగతి చదువుతోంది.