బలగాలపై మావోల పంజా

Four CRPF personnel killed as Maoists blow up mine-protected vechile in chattisgarh - Sakshi

ఛత్తీస్‌గఢ్‌లో మైన్‌ప్రూఫ్‌ వాహనం పేల్చివేత

ఐదుగురు జవాన్ల మృతి  

చర్ల / రాయ్‌పూర్‌: ఎన్నికలకు సన్నద్ధమవుతున్న ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులు రెచ్చిపోయారు. బీజాపూర్‌ జిల్లాలో తనిఖీలకు వెళ్లివస్తున్న భద్రతా బలగాల మైన్‌ప్రూఫ్‌ వాహనాన్ని శక్తిమంతమైన మందుపాతరతో పేల్చేశారు. ఈ ఘటనలో ఐదుగురు సీఆర్పీఎఫ్‌ జవాన్లు ప్రాణాలు కోల్పోగా, మరొకరు గాయపడ్డారు. పేలుడు ధాటికి సీఆర్పీఎఫ్‌ వాహనం తునాతునకలైంది. ఈ విషయమై బీజాపూర్‌ సూపరింటెండెంట్‌ ఆఫ్‌ పోలీస్‌(ఎస్పీ) మోహిత్‌ గార్గ్‌ మాట్లాడుతూ.. ఇక్కడి మర్దొండ క్యాంప్‌లో ఉన్న సీఆర్పీఎఫ్‌ 168వ బెటాలియన్‌కు చెందిన జవాన్లు శనివారం మధ్యాహ్నం 12 గంటలకు రోడ్లు, బ్రిడ్జీల తనిఖీలకు బయలుదేరినట్లు తెలిపారు.

సాయంత్రం 4 గంటల సమయంలో తిరిగివస్తుండగా బేస్‌క్యాంపుకు కేవలం కిలోమీటరు దూరంలో జవాన్లు ప్రయాణిస్తున్న మైన్‌ ప్రూఫ్‌ వాహనాన్ని మావోలు శక్తిమంతమైన మందుపాతరతో పేల్చేశారని వెల్లడించారు. ఈ ఘటనలో నలుగురు అక్కడికక్కడే చనిపోగా, ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారని పేర్కొన్నారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఒకరు ప్రాణాలు కోల్పోయారన్నారు. ప్రమాద ఘటన అనంతరం అదనపు బలగాలను రంగంలోకి దించామని తెలిపారు. ఛత్తీస్‌గఢ్‌ సీఎం రమణ్‌సింగ్‌ సుక్మా జిల్లాలో బీజేపీ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన రోజే మావోలు రెచ్చిపోవడం గమనార్హం. 90 స్థానాలున్న ఛత్తీస్‌గఢ్‌ అసెంబ్లీకి వచ్చే నెల 12న, 20వ తేదీన రెండు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి.
 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top