టీఎస్‌ ఆర్టీసీ డ్రైవర్‌పై దాడి.. కొత్తకోణం

Four Accused who attacked TS RTC Driver have Criminal cases - Sakshi

సాక్షి, విజయవాడ: నగరంలో తెలంగాణ ఆర్టీసీ డ్రైవర్‌ను చితకబాదిన కేసులో మరో కొత్త కోణం వెలుగుచూసింది. ఆర్టీసీ డ్రైవర్‌ను చితకబాదిన నలుగురు యువకులపై ఇప్పటికే పలు పాత కేసులు ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. డ్రైవర్‌పై దాడి చేసిన నిందితులైన సాజిద్‌, దుర్గా రాజేశ్‌పై దోపిడీ కేసులు ఉన్నాయి. అదేవిధంగా మరో ఇద్దరు నిందితులపై దొంగతనం కేసులు ఉండగా.. రాజేష్‌పై పేకాట కేసులు కూడా ఉన్నట్టు పోలీసుల విచారణలో తేలింది. నిందితులు ఉద్దేశపూర్వకంగానే ఆర్టీసీ డ్రైవర్‌పై దాడి చేసి.. రూ. 25వేలతో పరారైనట్టు పోలీసులు తేల్చారు. ఈ మేరకు నలుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు.
 
గత శనివారం అర్ధరాత్రి విజయవాడ భవానీపురంలో అల్లరిమూకలు బీభత్సం సృష్టించిన సంగతి తెలిసిందే. తమ బైక్‌లకు దారి ఇవ్వలేదంటూ ఆర్టీసీ బస్సుపై కొందరు దాడికి పాల్పడ్డారు. బైకులపై బస్సును వెంబడించిన 50 మందికి పైగా యువకులు గొల్లపూడి సెంటర్‌ వద్ద బస్సును నిలిపివేశారు. అనంతరం బస్సు అద్దాలను ధ్వంసం చేశారు. అంతటితో ఆగకుండా బస్సు డ్రైవర్‌ను చితకబాదడంతో పాటు, కండక్టర్‌ వద్ద నుంచి 25 వేల రూపాయలు లాకెళ్లారు. ఈ చర్యతో బస్సులోని ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. ఈ ఘటనపై బస్సు డ్రైవర్‌ భవానీపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top