అప్పు+అవమానం=ఆత్మహత్య

Farmer Commit to Suicide When Insult Loan Dealer - Sakshi

అతడొక నిరుపేద రైతు. ఓ వ్యాపారి వద్ద అప్పు చేశాడు. సరుకుల కోసం తన వద్దకు వచ్చిన ఆ రైతును.. సదరు వ్యాపారి గదిలో నిర్బంధించాడు. అప్పు తీర్చిన తరువాతనే బయటకు పంపిస్తానన్నాడు. దీనిని అవమానంగా భావించిన ఆ రైతు.. అదే గదిలోగల పురుగు మందు తాగాడు. తీవ్రంగా అస్వస్థుడయ్యాడు. ఖమ్మం ఆస్పత్రిలో బుధవారం ప్రాణాలొదిలాడు. ఆ వ్యాపారిపై కేసు నమోదైంది.

ఇల్లెందు: ఇల్లెందు మండలం  చల్లసముద్రం పంచాయతీ ధనియాలపాడు గ్రామానికి చెందిన ఆ రైతు పేరు రైతు ఏసు(45). స్థానిక వ్యాపారి లక్ష్మీనారాయణ దుకాణానికి ఈ నెల 4వ తేదీ రాత్రి 8.00 గంటల సమయంలో వెళ్లాడు. అప్పటికే ఆ వ్యాపారి నుంచి ఏసు అప్పు చెల్లించాల్సుంది. ఇదే విషయమై అక్కడ వీరిద్దరికీ వాగ్వివాదం జరిగింది. తన అప్పు చెల్లించిన తరువాతనే వదులుతానంటూ ఏసును తన దుకాణం గదిలో లక్ష్మీనారాయణ బంధించాడు. ఈ అవమానాన్ని ఆ రైతు భరించలేకపోయాడు. తీవ్ర మనోవేదనను తట్టుకోలేక, తనను నిర్బంధించిన దుకాణం గదిలోగల పురుగుల మందును తాగాడు. తీవ్రంగా అస్వస్థుడయ్యాడు. స్థానికులు వెంటనే ఖమ్మం ఆస్పత్రికి తరలించారు. అతడు బుధవారం ఉదయం మృతిచెందాడు. ఏసు కుమారుడు లక్ష్మణ్‌రావు ఫిర్యాదుతో ఇల్లెందు సీఐ ఎస్‌.సారంగపాణి కేసు నమోదు చేశారు. దర్యాప్తు జరుపుతున్నారు. ఏసుకు భార్య, కుమారుడు, కూతురు ఉన్నారు. 

భారంగా మారిన వ్యవసాయ అప్పు
దారెల్లి ఏసుకు గ్రామంలో ఎకరం భూమి ఉంది. అరెకరంలో వరి, మరో అరెకరంలో పత్తి సాగు చేశాడు. గ్రామంలోగల వ్యాపారి లక్ష్మీనారాయణ దుకాణంలో అప్పు కింద ఎరువులు, విత్తనాలు తీసుకున్నాడు. 15,000 రూపాయలు బాకీ ఇవ్వాల్సుంది. కొంతైనా అప్పు తీరుద్దామని సోమవారం రాత్రి వ్యాపారి వద్దకు వెళ్లాడు. మొత్తం అప్పు తీర్చాలని వ్యాపారి పట్టుబట్టాడు. దీంతో ఇద్దరి మాటామాటా పెరిగింది. ఇది చివరికి, ఏసు ప్రాణాలు తీసింది.

నాయకుల సందర్శన
ధనియాలపాడులో ఏసు మృతదేహాన్ని కాంగ్రెస్‌ పార్టీ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు ఐతా సత్యం, నాయకులు తాజ్‌బాబా, జానీ, చీమల వెంకటేశ్వర్లు, బానోతు హరిప్రియ, సాములు నాయక్, గిన్నారపు నాగేందర్, సుదర్శన్‌కోరి, జేబీ శౌరి, అక్తర్, ఆజం, చింత నరసింహారావు, రజని తదితరులు సందర్శించి నివాళులర్పించారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top