కల్తీ మద్యం బుసబుస

Fake alcohol case going wrong way - Sakshi

వెలుగుచూస్తున్న నకిలీ మద్యానికి సాక్ష్యాలు

‘సాక్షి’ వరుస కథనాలకు నిదర్శనాలు

తాజా డంప్‌..కేసు నీరుగార్చేందుకేనా?

తెనాలి: నకిలీ మద్యం కుంభకోణానికి ఇంకా తెరపడలేదు. ఖాళీ సీసాల్లో నకిలీ, చౌక మద్యం అమ్మకాల గుట్టు రట్టయి, నిందితులెవరో నిగ్గు తేలినప్పటికీ తవ్వేకొద్దీ అన్నట్టుగా కొత్త కేసులు వెలుగు చూస్తూనే వున్నాయి. ‘సాక్షి’ వరుస కథనాల్లోని అంశాలు పక్కా వాస్తవాలుగా బహిర్గతమవుతున్నాయి. ఆ క్రమంలోనే శుక్రవారం స్థానిక మార్కెట్‌ సెంటర్లోని బజారులో మూసి ఉంచిన కూరల దుకాణంలో కొత్త మూతల డంప్‌ పట్టుబడటం ఇందుకు నిదర్శనం.  దుకాణం లోపల ఉంచిన వివిధ రకాల మద్యం బ్రాండ్లకు చెందిన వేలాది మూతలను అధికారులు  స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు.

నకిలీ మద్యం గుట్టు రట్టు
రేపల్లె సమీపంలోని తుమ్మల పంచాయతిలోని గాదెవారిపాలెంలో ఒక ప్రైవేటు ఇంటిలో నడుస్తున్న నకిలీ మద్యం రాకెట్‌ జనవరి 16న బహిర్గతమైన విషయం తెలిసిందే. దీనికి కొన్ని నెలల ముందు నుంచి ఈ అక్రమ వ్యాపారం నడుస్తోంది. మ హారాష్ట్ర టు అదిలాబాద్, విజయవాడకు రెక్టిఫైడ్‌ స్పిరిట్‌ను తెప్పించి, రంగు కలిపి నకిలీ మద్యం తయారు చేయటం, ఖాళీ మద్యం సీసాల్లో నింపటం ఒకరకమైతే, మధ్య రకం ఖరీదు కలి గిన బ్రాండ్ల ఖాళీ సీసాల్లో చౌకమద్యం కలపటం మరో రకం. ముందే తెప్పించుకున్న కొత్త మూతల్ని క్యాప్‌ ఫిట్టింగ్‌ మిషనుతో సీలు వేస్తున్నారు. ‘ఎక్సైజ్‌’లోని ఆరితేరిన కొందరు ఉద్యోగులు, మద్యం లైసెన్సుదారులు కుమ్మక్కయి, తెనాలి డివిజనువ్యాప్తంగా ఈ అక్రమాన్ని నిర్విఘ్నంగా కొనసాగిస్తున్నారు.

‘సాక్షి’ కథనాలతో తెనాలికేసి చూపు
గాదెవారిపాలెం కల్తీ మద్యం కేసులో ఎక్సైజ్‌ కార్యాలయ జూనియర్‌ అసిస్టెంట్, అతడి బంధువు సహా పలువురు నిందితులని తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తెనాలి సమీపంలోని క్రాప, ఈమని గ్రామాల్లో పలు కేసులు వెలుగు చూశాయి. అయితే, పట్టించుకోకుండా అధికారులు కళ్లకు గంతలు కట్టుకున్నారు. అధికారుల కనుక మేల్కొంటే కల్తీ, నకిలీ వ్యవహారం ముందే వెలుగుచూసేదని అదే నెల 21న ‘సాక్షి’ కథనంలో పేర్కొనటంతో ఆ దిశగా దర్యాప్తుచేసిన అధికారులు కొత్త మూతల సరఫరాదారును గత నెల మొదటివారంలో అదుపులోకి తీసుకున్నారు. తమదైన ట్రీట్‌మెంట్‌తో ఇందులో భాగస్వాములైన లైసెన్సుదారుల పేర్లను వెల్లడించినట్టు తెలిసింది. 

సందేహాలకు తావిస్తున్న ‘ఎక్సైజ్‌’ గోప్యత
ప్రొహిబిషన్, ఎక్సైజ్‌ పోలీసులు ఈ కేసులో గోప్యతను పాటిస్తుండటం అనుమానాలకు తావిస్తోంది. గత నెలలో పట్టుబడిన మూతల సరఫరాదారు వెల్లడించిన లైసెన్సుదార్లపై  విచారించారా? ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? అనే అంశంపై అధికారులు మౌనాన్ని వీడటం లేదు. కీలకమైన రెక్టిఫైడ్‌ స్పిరిట్‌ను తన పేరుతో దిగుమతి చేసుకుంటూ కల్తీ మద్యం వ్యాపారం కేసులో నిందితుడైన తెనాలి ఎక్సైజ్‌ కార్యాలయం ఉద్యోగిని ప్రధాన నిందితుల్లో ఒకరుగా కాకుండా చివరి వరుసలోకి చేర్చి, పక్షపాతం చూపారనే విమర్శలున్నాయి.  

పక్కదారి పట్టించేందుకు ఎత్తుగడ
మార్కెట్‌ సెంటర్లో పట్టుబడిన కొత్త మూతల డంప్‌ కేసు నీరుగార్చే ప్రయత్నంలో భాగమేనని విశ్వసనీయ సమాచారం. నిజానికి కూరగాయల దుకాణం యజమాని ఆకుల సత్యనారాయణ, అద్దెదారుకు వివాదం నడుస్తోంది. కొద్దినెలలుగా దుకాణం మూసివేసి ఉంటోంది. లోపల బూజు పట్టి వున్న దుకాణంలో మూతలు, వుంచిన సంచీ ఎలాంటి మట్టీమరకలు లేకుండా ఉండటం చూస్తుంటే, ఒకటి రెండురోజుల ముందే ఎవరో అక్కడ పడేసి వుంటారనీ, అందుకు మార్గం  కూడా ఉందని చెబుతున్నారు. కేవలం కేసును పక్కదారి పట్టించేందుకు ఇప్పటికే ఆరోపణలున్న దుకాణం యజమానిపై నెట్టే ప్రయత్నంలో ఇదొక భాగమనీ, లైసెన్సుదార్లు తప్పించుకునే వ్యూహమన్న వాదన వినిపిస్తోంది. ఈ క్రమంలో పెద్దఎత్తున డబ్బు చేతులుమారినట్టు మద్యం వ్యాపారవర్గాలు గుసగుసలాడుతున్నారు.  

మద్యం కల్తీ కోసం దాచిన మూతలు స్వాధీనం
తెనాలి రూరల్‌ : మద్యం కల్తీ చేసి విక్రయించేందుకు దాచి ఉంచిన మూతలను ఎక్సైజ్‌ అధికారులు దాడి చేసి పట్టుకున్నారు. పట్టణంలోని మార్కెట్‌ కూడలికి వెనుక వైపున ఉన్న షాపులో కల్తీ మద్యం ఉందన్న సమాచారంతో ప్రొహిబిషన్‌ అండ్‌ ఎక్సైజ్‌ శాఖ అధికారులు దాడి చేశారు. మూసి ఉన్న షట్టర్‌ను తెరిచి చూడగా, శ్లాబుకు కన్నం వేసి ఉంది. దానికి ఆసరాగా ఉన్న నిచ్చెన సాయంతో శ్లాబు పైభాగంలో వెతకగా, మద్యంలోని వివిధ బ్రాండులకు చెందిన మూతలు ఉన్నాయి. సీసాల్లో మద్యం కల్తీ చేసి, వాటిని బిగిస్తారు. షాపు గత 15 సంవత్సరాలుగా ఆకుల సత్యనారాయణ అనే వ్యక్తి పేరున ఉన్నట్లు అధికారుల పరిశీలనలో వెల్లడైంది. దీనిపై కేసు నమోదు  చేసి దర్యాప్తు చేస్తున్నారు. దాడుల్లో ఎక్సైజ్‌ ఏఈఎస్‌ అరుణకుమారి, సిబ్బంది పాల్గొన్నారు.

మూతలు తెనాలికి సరఫరా
ఇటీవల కొల్లూరు మండలం క్రాపలో పట్టుబడిన నకిలీ మూతలు తెనాలికి సరఫరా అవుతున్నట్లు గుర్తించామని ఎక్సైజ్‌ అసిస్టెంట్‌ సూపరింటెండెంట్‌ అరుణకుమారి తెలిపారు. సత్యనారాయణ దుకాణంలో ఈ నేపథ్యంలోనే సోదా చేసినట్టు వివరించారు. బ్రాండెడ్‌ మద్యాన్ని చీప్‌ లిక్కర్‌తో కల్తీ చేసి, వాటికి ఈ మూతల్ని బిగిస్తున్నట్టు ప్రాథమికంగా గుర్తించామని, సత్యనారాయణ కొలకలూరు, దుగ్గిరాల గ్రామాల్లో మద్యం వ్యాపారం చేస్తున్నాడని చెప్పారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top