మందేశారు... చోరీ చేశారు! | Drunked Friends Stole Moble Phone in Hyderabad | Sakshi
Sakshi News home page

మందేశారు... చోరీ చేశారు!

Feb 28 2019 6:25 AM | Updated on Feb 28 2019 6:25 AM

Drunked Friends Stole Moble Phone in Hyderabad - Sakshi

సాక్షి, సిటీబ్యూరో: స్నేహితులైన ఆ ఇద్దరూ మరో మిత్రుడి పుట్టినరోజు పార్టీకి వెళ్లారు... మద్యం తాగడంతో నిషా తలకెక్కింది... ఆ మత్తులోనే ‘మిడ్‌నైట్‌ వాకింగ్‌’కు వెళ్లిన ఇరువురూ విచక్షణ కోల్పోయారు... ఆ దారితో వెళ్తున్న ఓ వ్యక్తి నుంచి సెల్‌ఫోన్‌ తీసుకున్నారు... అదును చూసుకుని అతడి దృష్టి మళ్లించి దాన్ని పట్టుకుని పారిపోయారు. సోమవారం అర్ధరాత్రి చోటు చేసుకున్న ఈ కేసును నార్త్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు 24 గంటల్లో ఛేదించారు. నిందితులను అదుపులోకి తీసుకుని గోపాలపురం అధికారులకు అప్పగించారు. వెస్ట్‌ మారేడ్‌పల్లిలోని అశ్వినినగర్‌కు చెందిన గౌడి శివశంకర్‌ స్టేషన్‌ రోడ్‌లోని ఓ గార్మెంట్స్‌ షాపులో పని చేస్తున్నాడు. డిగ్రీ చదువుతున్న సంజీవయ్యనగర్‌కు చెందిన గుగ్గిలం కార్తీక్‌ ఇతడి స్నేహితుడు. వీరిద్దరూ తరచూ మారేడ్‌పల్లి ప్రాంతంలో కలుసుకుని మద్యం తాగేవాళ్లు. అదే ప్రాంతానికి చెందిన వీరి స్నేహితుడు ఆశిష్‌ పుట్టిన రోజు కావడంతో సోమవారం పార్టీ ఇచ్చాడు.

దీనికి హాజరైన శివ శంకర్, కార్తీక్‌ పూటుగా మద్యం తాగారు. ఆ నిషా తలకెక్కడంతో అర్ధరాత్రి వేళ వాకింగ్‌కు బయలుదేరారు. తెల్లవారుజామున 2.05 గంటల ప్రాంతంలో గోపాలపురంలోని సప్తగిరి హోటల్‌ వద్దకు వచ్చిన వారిని తోట రాము అనే వ్యక్తి కనిపించాడు. మద్యం మత్తులో వీరు రాము వద్ద ఉన్న సెల్‌ఫోన్‌ తస్కరిద్దామని అప్పటికప్పుడే పథకం వేశారు. దీంతో అతడి పక్కగా నడుచుకుంటూ వచ్చిన శివశంకర్‌ ఓ కాల్‌ చేసుకుంటానంటూ ఫోన్‌ అడిగాడు. రాము ఇవ్వడంతో ఓ కాల్‌ చేసుకున్న అతగాడు ఫోన్‌ తన వద్దే ఉంచుకున్నాడు. తిరిగి ఇవ్వమంటూ రామ కోరగా... తన స్నేహితుడు తిరిగి ఫోన్‌ చేస్తానని అన్నాడంటూ చెప్పాడు. ఈ నేపథ్యంలోనే కార్తీక్‌ అదును చూసుకుని రాము దృష్టి మళ్లించాడు. ఇదద్దరూ రోడ్డు దాటేసి సెల్‌ఫోన్‌తో సహా పరారయ్యారు. దీంతో బాధితుడు రాము గోపాలపురం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ కేసును ఛేదించాలంటూ టాస్క్‌ఫోర్స్‌ డీసీపీ పి.రాధాకిషన్‌రావు నార్త్‌జోన్‌ టీమ్‌ను ఆదేశించారు. రంగంలోకి దిగిన ఇన్‌స్పెక్టర్‌ కె.నాగేశ్వర్‌రావు నేతృత్వంలోని బృందం  సీసీ కెమెరాల్లో రికార్డు అయిన ఫీడ్‌పై దృష్టి పెట్టింది. నేరం జరిగిన ప్రాంతానికి సమీపంలో ఉన్న వివిధ కెమెరాల నుంచి ఫీడ్‌ను సేకరించి అధ్యయనం చేసింది. ఇందులో అనుమానితులను గుర్తించిన టాస్క్‌ఫోర్స్‌ టీమ్‌ క్షేత్రస్థాయిలో గాలింపు చేపట్టి మంగళవారం రాత్రి శివ శంకర్, కార్తీక్‌లను గుర్తించింది. బుధవారం వీరిని అదుపులోకి తీసుకుని గోపాలపురం పోలీసులకు అప్పగించారు. పోలీసుల విచారణ నేపథ్యంలో తాము మద్యం మత్తులోనే ఆ నేరం చేశామని నిందితులు వెల్లడించారు. నిందితుల నుంచి సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. మోసం, దొంగతనం ఆరోపణలపై వీరిని అరెస్టు చేశారు. 

తరచూ ఇలాంటి ఉదంతాలు...
నగరంలో ఈ తరహా నేరాలు చోటు చేసుకోవడం ఇటీవల కాలంలో పెరిగిందని అధికారులు పేర్కొంటున్నారు. ఈ కేసుల్లో ప్రొఫెషనల్‌ నేరగాళ్లు, ఉద్దేశపూర్వకంగా, దురుద్దేశంతో చేసిన వాళ్లే కాదు... విద్యార్థులు, చిరుద్యోగులు కూడా నిందితులుగా ఉంటున్నారన్నారు. ఓ వ్యక్తి నుంచి ఫోన్‌ సహా ఏ వస్తువును అయినా వారి అనుమతి లేకుండా పట్టుకుపోవడం చోరీ అవుతుందని, బలవంతంగా లాక్కోవడం దోపిడీ కిందికి వస్తుందనే విషయంపై నిందితులకు అవగాహన ఉండట్లేదని తెలిపారు. ఈ కారణంగానే క్షణికావేశం, మద్యం మత్తు, దురాశ, ఆకతాయితనం తదితర కారణాలతో నేరాలు చేస్తున్నారని వివరించారు. ఇలాంటి కేసుల్లో పోలీసు రికార్డుల్లోకి ఎక్కిన విద్యార్థుల భవిష్యత్తు అంధకారంగా మారుతోందని, అనేక ఉద్యోగాలకు అనర్హులుగా మారుతున్నారని హెచ్చరిస్తున్నారు. తల్లిదండ్రులు సైతం తమ వారిపై కన్నేసి ఉంచడం, వారి చర్యల్ని గమనించడం ద్వారా దుష్ఫరిణామాలు చోటు చేసుకోకుండా చూడాలని కోరుతున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement