అందమే శాపమై.. హత్యకు గురైన దివ్య

Divya murder case was solved by Visakha police within two days - Sakshi

అసూయ, ద్వేషంతోనే యువతిని మట్టుబెట్టిన సహచరి  

సాక్షి, విశాఖపట్నం: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన దివ్య హత్య కేసును విశాఖ పోలీసులు రెండు రోజుల్లోనే ఛేదించారు. బుధవారం రాత్రి హత్యకు గురైన దివ్య మృతదేహానికి శనివారం కేజీహెచ్‌లో పోస్ట్‌మార్టం నిర్వహించారు. ఆమె శరీరంపై 33 చోట్ల గాయాలు ఉన్నట్లు వైద్యులు గుర్తించినట్లు తెలిసింది. దివ్యను చిత్రహింసలకు గురిచేసి హత్య చేసినట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. ఆమెతో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడేటట్లు చేసిన అక్కయ్యపాలెం నందినగర్‌ నివాసి వసంత అనే మహిళే ఈ హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. 

బతుకుదెరువుకు వచ్చి బలి
తూర్పుగోదావరి జిల్లా రావులపాలెంలో ఊబలంకకు చెందిన దివ్య(20) తల్లిదండ్రులు చనిపోవడంతో బతుకుదెరువు కోసం వసంత(30) దగ్గరకు వచ్చింది. అప్పటికే అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న వసంత దివ్యను కూడా వ్యభిచార రొంపిలోకి దింపింది. కొన్నాళ్లకు తన అందంతో ఎదుగుతున్న దివ్యను చూసి అసూయ, ద్వేషాలకు గురైన వసంత దివ్యను మట్టుబెట్టాలని నిర్ణయించుకుంది. ఈ క్రమంలో ముందుగా దివ్య అందాన్ని చెరిపేయాలని నిర్ణయించుకుని ఇంట్లో బంధించి వారం రోజుల పాటు చిత్రహింసలకు గురి చేసింది. వీటిని భరించలేక దివ్య బుధవారం రాత్రి మృతి చెందింది. 

అంతిమయాత్ర వాహన యజమాని అనుమానంతో...
దివ్య మరణించాక.. ఆమె మృతదేహాన్ని ఖననం చేసేందుకు జ్ఞానాపురం ప్రాంతంలోని అంతిమ యాత్ర వాహనం యజమానికి ఫోన్‌ చేసి ఎంత డబ్బయినా ఇస్తానని వసంత ఆశ చూపించింది. అనుమానం వచ్చిన వాహన యజమాని పోలీసులకు సమాచారం ఇవ్వడంతో విషయం వెలుగులోకి వచ్చింది. పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో దివ్యది సహజ మరణంగా చూపడానికి ఆమె ప్రయత్నించింది. దివ్య మృతదేహంపై గాయాలు ఉండడాన్ని గమనించి హత్య కోణంలో దర్యాప్తు చేశారు. వసంత హత్యా నేరం అంగీకరించినట్లు సమాచారం. ఈ కేసులో వసంత సోదరి, మరిదిని అదుపులోకి తీసుకున్నారు.  

2015లో దివ్య కుటుంబ సభ్యుల హత్య 
దివ్య కుటుంబ సభ్యులు కూడా 2015లో హత్యకు గురైనట్లు పోలీసుల విచారణలో తేలింది. దివ్య తల్లి, తమ్ముడు, అమ్మమ్మలను కూ డా గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేసినట్లు తెలుస్తోంది. ఆ కేసు ఇప్పటికీ పెండింగ్‌లో ఉన్నట్లు సమాచారం. ఆ హత్యలపైనా పోలీసులు విచారణకు సిద్ధమవుతున్నట్లు తెలిసింది. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top