కస్టడీకి జయరామ్‌ హత్య కేసు నిందితులు

Custody of the accused in the Jayaram murder case  - Sakshi

మూడు రోజుల వరకు అనుమతించిన నాంపల్లి కోర్టు 

నేటి నుంచి ప్రశ్నించనున్న జూబ్లీహిల్స్‌ పోలీసులు 

శిఖా చౌదరి పని మనిషి నుంచి వాంగ్మూలం నమోదు 

సాక్షి, హైదరాబాద్‌: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన ఎక్స్‌ప్రెస్‌ టీవీ చైర్మన్, కోస్టల్‌ బ్యాంకు డైరెక్టర్‌ చిగురుపాటి జయరామ్‌ హత్యకేసు దర్యాప్తును జూబ్లీహిల్స్‌ పోలీసులు ముమ్మరం చేశారు. ఓవైపు నిందితులను విచారించేందుకు సన్నాహాలు చేస్తూనే మరోవైపు ఈ కేసులో కీలక సాక్షులను ప్రశ్నిస్తూ పోలీసులు వాంగ్మూలాల నమోదు ప్రారంభించారు. హత్య కేసు నిందితులుగా ఉన్న రాకేశ్‌రెడ్డి, శ్రీనివాస్‌లు ఇప్పటికే జ్యుడీషియల్‌ రిమాండ్‌లో ఉండగా వీరిని తదుపరి విచారణ నిమిత్తం మూడు రోజుల పాటు పోలీసుల కస్టడీకి అప్పగిస్తూ నాంపల్లి కోర్టు మంగళవారం ఆదేశాలిచ్చింది. దీంతో బుధవారం చంచల్‌గూడ జైలు నుంచి వీరిద్దరినీ అదుపులోకి తీసుకుంటామని కేసు దర్యాప్తు చేస్తున్న బంజారాహిల్స్‌ ఏసీపీ కె.శ్రీనివాసరావు మంగళవారం మీడియాకు చెప్పారు.

కస్టడీలోకి తీసుకున్న తర్వాత వీరిద్దరితో ‘క్రైమ్‌సీన్‌ రీ–కన్‌స్ట్రక్షన్‌’చేయనున్నారు. నిందితుల విచారణ నేపథ్యంలో జయరామ్‌ హత్యలో శిఖా చౌదరితో పాటు ఇతరుల పాత్ర, పోలీసు అధికారులైన ఏసీపీ మల్లారెడ్డి, ఇన్‌స్పెక్టర్‌ శ్రీనివాసుల ప్రమేయంపై ఆరా తీయనున్నారు. జయరామ్‌ భార్య పద్మశ్రీ చేసిన ఆరోపణల పైనా లోతైన విచారణ అవసరమని పోలీసులు నిర్ణయించారు. శిఖా చౌదరి నివసిస్తున్న విల్లాకు గత నెల 29న జయరామ్‌ వచ్చినట్లు అధికారులు నిర్ధారించారు. దీంతో ఆ రోజు ఆయన ఎందుకు అక్కడకు వెళ్లారనే అంశాన్ని ఆరా తీస్తున్నారు. ఆయన వచ్చినప్పుడు అక్కడ ఎవరెవరు ఉన్నారు? ఇంటి వద్ద ఏం జరిగింది? అనే అంశాలు తెలుసుకోవడానికి శిఖా చౌదరి ఇంట్లో పని మనిషిని పోలీసులు విచారించారు. ఆమె నుంచి వాంగ్మూలాన్నీ నమోదు చేశారు. ఈమెతో పాటు మరికొందరి వాంగ్మూలాలను నమోదు చేసిన పోలీసులు శిఖా చౌదరికి నోటీసులు జారీ చేయాలని యోచిస్తున్నారు.  

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top