ఇంటి పైకప్పు కూలి చిన్నారి దుర్మరణం

Child Death in Top Roof Collapse in Hyderabad - Sakshi

తల్లికి తీవ్ర గాయాలు సీతాఫల్‌మండిలో విషాదం  

చిలకలగూడ : ఇంటి పైకప్పు కూలి ఓ చిన్నారి(14 నెలలు) మృతి చెందగా, తల్లి తీవ్రంగా గాయపడిన సంఘటన సికింద్రాబాద్‌ పరిధిలోని సీతాఫల్‌మండీలో చోటు చేసుకుంది. చిలకలగూడ సీఐ బాలగంగిరెడ్డి, ప్రత్యక్షసాక్షుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. సీతాఫల్‌మండి డివిజన్‌ మేడిబావి వీరయ్య గల్లీలో రాజు(34), స్వాతి (30) దంపతులు తమ కుమారుడు గీతాన్ష్‌ అలియాస్‌ మను(14 నెలలు), రాజు తల్లి పుష్ప, సోదరుడు రమేష్‌లతో కలిసి ఓ పురాతన ఇంట్లో అద్దెకు ఉంటున్నారు. రాజు కుటుంబ సభ్యులతో కలిసి పాల వ్యాపారం నిర్వహించేవాడు. ఆదివారం ఉదయం రాజు, అతని తల్లి పుష్ప పాలు పిండేందుకు బయటికి వెళ్లగా. సోదరుడు రమేష్‌ బాత్‌రూంకు వెళ్లాడు. కుమారుడితో కలిసి స్వాతి ఇంట్లో నిద్రిస్తుండగా ఇంటి పైకప్పు ఒక్కసారిగా కుప్పకూలింది. దీనిని గుర్తించిన స్థానికులు ఇంటి తలుపులు బద్ధలుకొట్టి  లోపటికి వెళ్లి చూడగా శిథిలాల కింద చిక్కుకున్న తల్లి, కుమారుడిని గుర్తించారు. శిథిలాలను తొలగించి చూడగా  తలకు తీవ్ర గాయాలు కావడంతో చిన్నారి గీతాన్ష్‌  అప్పటికే మృతి చెంది ఉన్నట్లు గుర్తించారు. తీవ్రంగా గాయపడిన స్వాతిని అంబులెన్స్‌లో గాంధీ ఆస్పత్రికి తరలించారు.

రెండునెలల క్రితమే చిన్నారి గీతాన్ష్‌  మొదటి పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించామని తండ్రి రాజు, నానమ్మ పుష్ప కన్నీటి పర్యంతమయ్యారు. గాంధీ మార్చురీలో చిన్నారి మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబసభ్యులకు అప్పగించారు. వైద్యచికిత్సల అనంతరం స్వాతి కోలుకుందని సీఐ బాలగంగిరెడ్డి పేర్కొన్నారు. జీహెచ్‌ఎంసీ సికింద్రాబాద్‌ జోనల్‌ కమిషనర్‌ రఘప్రసాద్, డిప్యూటీ కమిషనర్‌ రవికుమార్, సీతాఫల్‌మండి కార్పొరేటర్‌ సామల హేమ, సీఐ బాలగంగిరెడ్డి, ఎస్‌ఐ రవికుమార్‌ ఆదివారం ఉదయం ఘటనా స్థలాన్ని సందర్శించారు. ప్రమాదం జరిగిన ఇంటి పక్కన నిర్మిస్తున్న భవనం క్యూరింగ్‌ చేసే సమయంలో నీళ్లు ఇంటిపై నిలిచి పైకప్పు కూలినట్లు బాధిత కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. ఐదు అంతస్తుల్లో నిర్మిస్తున్న నూతన భవనానికి సంబంధించిన అనుమతులపై జోనల్‌ కమిషనర్‌ రఘప్రసాద్‌ ఆరా తీశారు.  డీసీ రవికుమార్‌ మీడియాతో మాట్లాడుతూ పురాతన భవనంలో ఐదు కుటుంబాలు నివసిస్తున్నాయని, ముందు భాగంలో రంగులు వేయడంతో పురాతన కట్టడంగా తమ సిబ్బంది గుర్తించలేక పోయారన్నారు. మిగిలిన కుటుంబాలను తక్షణమే ఖాళీ చేయాలని సూచించారు. మరోమారు స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహించి సర్కిల్‌ పరిధిలోని పురాతన భవనాలను గుర్తించి నోటీసులు జారీ చేసి కూల్చివేస్తామన్నారు. బాధితు కుటుంబానికి ప్రభుత్వ పరంగా ఆర్థికసాయం అందించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top