చెట్ల పొదల్లో దాక్కుని దోచేస్తారు | Cheddi Gang Arrest in Hyderabad | Sakshi
Sakshi News home page

చెట్ల పొదల్లో దాక్కుని దోచేస్తారు

Dec 31 2019 11:31 AM | Updated on Dec 31 2019 11:37 AM

Cheddi Gang Arrest in Hyderabad - Sakshi

సాక్షి, సిటీబ్యూరో: చెట్ల పొదల్లో దాక్కుంటారు, చీకటి కాగానే ప్యాంట్, షర్ట్‌ విప్పి తమ భుజానికి ఉన్న కిట్‌బ్యాగ్‌లో పెట్టుకుంటారు. అప్పటికే రెక్కీ నిర్వహించిన ఇళ్లలోకి చొరబడి మనుషులు ఉంటే బెదిరించి మరీ బంగారు, వెండి ఆభరణాలతో పాటు నగదు ఎత్తుకెళతారు. ఇలా చెడ్డీగ్యాంగ్‌ వేషధారణకు దగ్గరి పోలికలు ఉన్న ఈ నేరగాళ్లు దుర్గామాతను పూజిస్తారు. రాష్ట్రంలో ఈ ఏడాది జనవరి నుంచి చోరీలకు పాల్పడిన ఏడుగురు సభ్యులతో కూడిన ‘గుమాన్‌’ గ్యాంగ్‌ను రాచకొండ పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. రాచకొండ కమిషనరేట్‌లో ఏడు, నిజామాబాద్‌లో ఒక చోరీకి పాల్పడిన ఈ ముఠా కొత్తది కావడం, చెడ్డీ గ్యాంగ్‌ తరహాలో వారి వేషధారణ ఉండటంతో దర్యాప్తు దారి మళ్లింది. అయితే చివరకు సాంకేతిక ఆధారాలతో వివిధ రాష్ట్రాల్లో సంచరిస్తున్న ఈ ముఠాను రాచకొండ పోలీసులు రెండు నెలల్లో పట్టుకున్నారు. వీరి నుంచి రూ.6.55లక్షల విలువైన చోరీ సొత్తు స్వాధీనం చేసుకున్నారు. నేరేడ్‌మెట్‌లోని ఓ రెస్టారెంట్‌లో సోమవారం రాచకొండ సీపీ మహేష్‌ భగవత్‌ వివరాలు వెల్లడించారు. 

బ్లాంకెట్లు...బొమ్మలు అమ్ముతూ...
కుటుంబసభ్యులు, బంధుమిత్రులైన చౌహన్‌ తారా సింగ్, ఎండీ సోనూ, బిట్టూ, గుఫ్టాన్, సైఫ్‌ ఆలీ, సాదిక్, ఎండీ సాజీద్‌కి చెందిన పూర్వీకులు కొన్ని దశాబ్దాల క్రితం బంగ్లాదేశ్‌ నుంచి వెస్ట్‌బెంగాల్‌కు వలసవచ్చారు. అప్పటి నుంచి వివిధ రాష్ట్రాల్లో తిరుగుతూ నగర శివారుల్లోని నిర్మానుష్య ప్రాంతాల్లో గూడారాలు వేసుకొని నివాసంఉంటూ రహదారులపై బ్లాంకెట్లు, బొమ్మలు విక్రయిస్తూ జీవనం సాగించేవారు. రెండేళ్లుగా రాజస్థాన్, గుజరాత్, మధ్యప్రదేశ్, హిమాచల్‌ ప్రదేశ్‌లో నివాసం ఉన్న వీరు ప్రస్తుతం  మహరాష్ట్రలోని అకోలా పట్టణంలో తలదాచుకుంటున్నారు. 

పగలు రెక్కీ..రాత్రి దోపిడీ...
15 మంది సభ్యుల ముఠా గత మూడేళ్లుగా ‘గుమాన్‌ గ్యాంగ్‌’గా ఏర్పడి చోరీలకు పాల్పడుతోంది. ముందుగానే ఎంచుకున్న నగరాలకు రైళ్లలో చేరుకుంటారు. ముఖ్యంగా కొంత అటవీ ప్రాంతం కలిగిన శివార్లను ఎంపిక చేసుకుని గుడారాలు వేసుకుంటారు. పగలు సమీపంలోని కాలనీల్లో తిరిగి రెక్కి నిర్వహిస్తారు. రాత్రి వేళ్లల్లో ఆయా ఇళ్లకు సమీపంలోని చెట్లపొదల్లో దాక్కుని అర్ధరాత్రి తర్వాత ఇళ్ల తాళాలను పగులగొట్టి అందినంత దోచుకెళతారు.గత జనవరిలో తొలిసారిగా హైదరాబాద్‌ కు వచ్చిన ఈ ముఠా నాంపల్లి రైల్వే స్టేషన్‌లో మూడు రోజుల పాటు మకాం వేసి ఉప్పల్, చైతన్యపురి, ఎల్‌బీనగర్, పద్మారావునగర్, చందానగర్‌  ప్రాంతాల్లో రెక్కీ నిర్వహించింది. చైతన్యపురిలోని ఓ ఇంట్లో చోరీకి యత్నించగా వాచ్‌మన్‌ అప్రమత్తం కావడంతో అతడిపై దాడి చేసి అక్కడి నుంచి పరారయ్యారు. మళ్లీ కొన్నిరోజుల అనంతరం హైదరాబాద్‌కు వచ్చిన ఈ ముఠా చైతన్యపురి, ఎల్‌బీనగర్‌ ప్రాంతాల్లో చోరీలకు పాల్పడింది. గత అక్టోబర్‌లో హయత్‌నగర్‌లో మకాం వేసిన వీరు కుంట్లూరు ప్రాంతంలో రెండు ఇళ్లల్లో చోరీలకు పాల్పడింది. అనంతరం విజయవాడవెళ్లి దుర్గమ్మను దర్శించుకున్నా రు. అక్కడ చోరీ సొత్తును విక్రయించాలని భావించినా పట్టుబడతామనే భయంతో వెనకడుగు వేశారు. అనం తరం హైదరాబాద్‌ వచ్చి అకోలాకు తిరిగి వెళ్లారు. ఆ తర్వాత కొద్ది రోజులకు రైలులో నిజామాబాద్‌ వచ్చిన వీరు ఓ ఇంట్లో చోరీకి పాల్పడ్డారు. గత నవంబర్‌ 20న విజయవాడ జాతీయ రహదారిపై హోటళ్లలో తలదాచుకున్న ఈ ముఠా కనకదుర్గ కాలనీలోని రెండు ఇళ్లల్లో చోరీ చేసింది. ఇదే తరహాలో రాజస్థాన్, మధ్యప్రదేశ్, గుజరాత్‌ రాష్ట్రాల్లో ఆరు చోరీలకు పాల్పడినట్లు విచారణలోవెల్లడైంది. ఇక్కడ చోరీ సొత్తు విక్రయిస్తే బయటపడతామనే భయంతో ఉత్తరప్రదేశ్, ఢిల్లీలో విక్రయించినట్లు తెలిపారు.

చిక్కిందిలా..
తొలుత చెడ్డీ గ్యాంగ్‌గా భావించిన పోలీసులు ఆ దిశగా దర్యాప్తు చేపట్టారు. అయితే కేసులు కొలిక్కి రాకపోవడంతో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో చోరీ సమయంలో నిందితుల కదలికలను పరిశీలించడమేగాక బాధితులు చెప్పిన వివరాల ఆధారంగా మళ్లీ కేసును దర్యాప్తు చేశారు.  రాచకొండ సీపీ ఆదేశాలతో ఎల్‌బీనగర్‌ ఎస్‌ఓటీ, ఎల్‌బీనగర్‌ సీసీఎస్, హయత్‌నగర్‌ పోలీసులు ప్రత్యేక బృందంగా ఏర్పడి రెండు నెలల పాటు మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, గుజరాత్, హిమాచల్‌ప్రదేశ్‌ రాష్ట్రాల్లో గాలింపు చేపట్టారు. నిందితులు అకోలాలో ఉన్నట్లు గుర్తించి అక్కడికి వెళ్లిన పోలీసులు వారు దొరక్కపోవడంతో వెనక్కి తిరిగి వచ్చారు. మరో సారి వారు హయత్‌నగర్‌ ఠాణా పరిధిలో చోరీ చేసేందుకు నగరానికి వచ్చినట్లు సమాచారం అందడంతో ఆదివారం రాత్రి చెట్ల పొదల్లో దాక్కున్న వారిని చుట్టుముట్టి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. అప్పటికే చోరీ చేసిన సొత్తుతో పరారయ్యేందుకు సిద్ధంగా ఉన్న ముఠా సభ్యుడు సాజీద్‌ను ఎల్‌బీనగర్‌ మెట్రో స్టేషన్‌లో అరెస్టు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement