చోరీకి యత్నించి.. పట్టుబడి! | Chain Snatchers Arrested In Bodhan | Sakshi
Sakshi News home page

చోరీకి యత్నించి.. పట్టుబడి!

Nov 13 2019 9:34 AM | Updated on Nov 13 2019 9:34 AM

Chain Snatchers Arrested In Bodhan - Sakshi

పట్టుబడ్డ నిందితుడు

సాక్షి, బోధన్‌(నిజామాబాద్‌) : రెండు చోట్ల చైన్‌స్నాచింగ్‌కు పాల్పడి పారిపోతుండగా, స్థానికులు వెంటబడడంతో ఒక దొంగ నాటకీయంగా చిక్కాడు. మరొకడు తప్పించుకుని పరారయ్యాడు. అసలేం జరిగిందంటే.. బోధన్‌లోని నాయీబ్రాహ్మణ కాలనీకి చెందిన సావిత్రి మంగళవారం మధ్యాహ్నం ఇంటి ఎదుట నిలబడి ఉన్నారు. ఈ క్రమంలో బైక్‌పై వచ్చిన ఇద్దరు దుండగులు ఆమె మెడలోని మంగళ సూత్రాన్ని లాక్కెళ్లేందుకు యత్నించారు. అప్రమత్తమైన సావిత్రి గొలుసును గట్టిగా పట్టుకోవడంతో దొంగల చేతికి ఒక పుస్తే, రెండు గుండ్లు మాత్రమే చిక్కాయి. దీంతో దొంగలు బైక్‌పై వేగంగా అక్కడి నుంచి వెళ్లి పోయారు. బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

బోధన్‌లో చోరీకి యత్నించి విఫలమైన దొంగలు ఎడపల్లిలో స్నాచింగ్‌ చేయాలని భావించారు. మాజీ సర్పంచ్‌ జనగం పుష్ప మిగులు అన్నాన్ని బయటకు పారేసి ఇంట్లోకి వెళ్తుండగా, దొంగలు ఆమె మెడలోని గొలుసును లాక్కొని నిజామాబాద్‌ వైపు పరారయ్యారు. ఆమె గట్టిగా కేకలు వేయడంతో చుట్టుపక్కల ఉన్న యువకులు, ప్రజాప్రతినిధులు పోగయ్యారు. దొంగలను పట్టుకునేందుకు కార్లు, బైకులపై బయల్దేరారు. ఈ క్రమంలో జానకంపేట, నెహ్రూనగర్‌ ఎంపీటీసీ ఇమ్రాన్‌ఖాన్‌కు ఫోన్‌ చేసి, బైక్‌పై వస్తున్న వారిని అడ్డుకోవాలని కోరారు.

దీంతో ఆయన కొంత మందిని జమ చేసి రోడ్డుకు అడ్డంగా నిలబడ్డారు. వారిని గమనించిన దొంగలు తమ బైక్‌ను బోధన్‌ వైపు మళ్లించారు. అయితే, అప్పటికే ఎడపల్లి నుంచి వస్తున్న నేతలు ఎల్లయ్య యాదవ్, సుభాష్‌ అలీసాగర్‌ ఎత్తిపోతల పథకం వద్ద రోడ్డుపై కారును అడ్డంగా పెట్టగా, దొంగలు కారును ఢీకొని కింది పడిపోయారు. దొంగలను పట్టుకునేందుకు యత్నించగా ఒకరు చిక్కగా, మరొకరు పరారయ్యారు. ఎడపల్లి పోలీసులు అక్కడకు చేరుకుని దొంగతో పాటు బైక్‌ను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం నిందితుడ్ని బోధన్‌ ఠాణాకు తరలించి విచారిస్తున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు రెండు చోట్ల కేసులు నమోదు చేసినట్లు బోధన్‌ టౌన్, రూరల్‌ సీఐలు రాకేశ్, షాకీర్‌ తెలిపారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement