Panjagutta PS: సిబ్బందిపై వేటు వెనక కారణాలివే? | 86 Police Transferred From Panjagutta Police Station | Sakshi
Sakshi News home page

పంజాగుట్ట పీఎస్‌ ప్రక్షాళన.. అసలేం జరిగింది? 86 మందిపై వేటు వెనక కారణాలివేనా?

Published Wed, Jan 31 2024 6:31 PM | Last Updated on Wed, Jan 31 2024 7:03 PM

86 Police Transferred From Panjagutta Police Station - Sakshi

రాష్ట్ర పోలీస్ డిపార్ట్‌మెంట్‌లోనే ఇదో సంచలనం. గతంలో ఎన్నడూ లేని విధంగా ఒకే పీఎస్‌ లోని మొత్తం 86 మందిని.. 

హైదరాబాద్, సాక్షి: రాష్ట్ర పోలీస్ డిపార్ట్‌మెంట్‌లోనే ఇదో సంచలనం. గతంలో ఎన్నడూ లేని విధంగా ఒకే పీఎస్‌ లోని మొత్తం 86 మందిని బదిలీచేస్తూ ఉత్తర్వులిచ్చారు పోలీస్ కమీషనర్. ఇన్‌స్పెక్టర్ నుంచి హోంగార్డ్‌ వరకు అందరినీ బదిలీ చేశారు. పంజాగుట్ట పోలీసులపై పలు ఆరోపణలు రావడంతో.. తొలిసారి పీఎస్ లో ఉన్న 80శాతం సిబ్బందిని బదిలీచేస్తూ సీపీ శ్రీనివాసరెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ట్రాన్స్‌ఫర్స్‌తో పోలీసులు అవినీతికి పాల్పడితే ఇలాంటి పరిణామాలే ఉంటాయని రాష్ట్రవ్యాప్తంగా వార్నింగ్ ఇచ్చినట్లయింది. 

సిటీలో ప్రధాన పోలీస్ స్టేషన్స్ లో పంజాగుట్ట ఒకటి. నాలుగేళ్ల క్రితం దేశంలోనే రెండో ఉత్తమ పోలీస్ స్టేషన్ గా అవార్డు పొందింది. మూడున్నర లక్షల మంది జనాభా.. ఐదు సెక్టార్లు.. వందకు పైగా పోలీస్ సిబ్బంది.. అంతటి పేరున్న పంజాగుట్ట పీఎస్ రీసెంట్ గా వివాదాల్లో నిలిచింది. రాజకీయ పలుకుబడితో ఈ పోలీస్ స్టేషన్ లో పోస్టింగ్స్ కోసం ఆఫీసర్లు వెంటబడేవారు. ఇట్లాంటి పోలీస్ స్టేషన్స్ లోని సిబ్బంది పలు కీలక కేసులను తప్పుదారి పట్టిస్తున్నారు. దీంతో స్టేషన్ సిబ్బందిని భారీగా ట్రాన్స్‌ఫర్స్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు హైదరాబాద్ సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి.

నిన్న జరిగిన ఇన్స్పెక్టర్ల బదిలీల్లో పంజాగుట్ట ఇన్స్పెక్టర్ ని బదిలీ చేస్తూ శోభన్ అనే కొత్త ఇన్స్పెక్టర్ ని సీఐగా నియమించారు. ఈరోజు పీఎస్‌లోని ఆరుగురు ఎస్సైలు, 9 మంది ఏఎస్సైలు, 16 మంది హెడ్ కానిస్టేబుల్స్ తో పాటు కానిస్టేబుల్స్, హోమ్ గార్డులను బదిలీ చేస్తూ సర్క్యులర్ జారీ చేశారు సీపీ. పీఎస్‌లో మొత్తంగా వందకు పైగా సిబ్బంది ఉండగా అందులో 85 మందిని ఈరోజు ట్రాన్స్ ఫర్ చేశారు. డిటెక్టివ్ ఇన్స్పెక్టర్, ఎస్సైలను మినహా మిగతా అందరినీ ట్రాన్స్ ఫర్ చేశారు. ట్రాన్స్ ఫర్ అయిన వారి స్థానంలో కొత్తగా 82 మందిని నియమిస్తూ నిర్ణయం తీసుకున్నారు కమీషనర్ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి.

ప్రజాభవన్ ముందు జరిగిన యాక్సిడెంట్ కేసులో బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు సాహిల్‌ని తప్పించి మరొకరిపై కేసు పెట్టారని అప్పట్లో పని చేస్తున్న సీఐ దుర్గారావును సస్పెండ్ చేశారు సీపీ. సీఐ దుర్గారావుకు మరికొంత మంది సిబ్బంది సహకరించారనే ఆరోపణలు వచ్చాయి. రీసెంట్ గా పంజాగుట్టలో ఒక వ్యక్తి ఫుల్లుగా తాగి తన కారుతో రోడ్డుపై ఉన్నవారందరినీ గుద్దుకుంటూ వెళ్లాడు. అతడ్ని పట్టుకుని స్థానికులు పోలీసులకు అప్పగించారు. ఆ తర్వాత ఆ వ్యక్తిని రిమాండ్ కి తరలిస్తుండగా పోలీసుల నుంచి తప్పించుకున్నాడు. పోలీసుల నిర్లక్ష్యంతోనే ఇలా జరిగిందనే ఆరోపణలు వచ్చాయి.

వివిధ కేసుల్లో అరెస్టయిన నిందితులను కోర్టులకు, జైళ్లకు తరలించే టైమ్ లో పంజాగుట్ట పోలీసులు ఏమరపాటుగా ఉంటున్నారనే విమర్శలు వచ్చాయి. నిందితులకు సహకరిస్తూ వారి బంధువులతో మాట్లాడే అవకాశం కల్పిస్తున్నట్లు ఉన్నతాధికారుల దృష్టికి వచ్చింది. నెల క్రితం డ్రంకెన్ డ్రైవ్ లో పట్టుబడి.. న్యూసెన్స్ క్రియేట్ చేసిన ఇద్దరిని ట్రాఫిక్ పోలీసులు పంజాగుట్ట పోలీసులకు అప్పగించగా.. వారిద్దరూ పోలీసుల నుంచి పారిపోయారు. గతంలో ఇదే పీఎస్ కి చెందిన ఇద్దరు కానిస్టేబుల్స్ పెట్రోలింగ్ డ్యూటీ చేస్తూ, లిక్కర్ తాగుతూ పట్టుబడ్డారు. ఇదే పీఎస్ లోని ఓ ఎస్సై.. మహిళా బాధితుల పట్ల అనుచితంగా ప్రవర్తించినట్లు ఆరోపణలు వచ్చాయి. 

అలాగే సీఎం రేవంత్ రెడ్డి సెక్యూరిటీ కదలికల్ని సైతం లీక్ చేస్తున్నారని సమాచారం అదింది. ఇవన్నీ దృష్టిలో ఉంచుకుని ఒకేసారి భారీగా ట్రాన్స్ ఫర్స్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు నగర కమీషనర్. అవినీతికి పాల్పడ్డా.. సివిల్ వివాదాల్లో తలదూర్చినా.. ట్రాన్స్ ఫర్స్ తో పాటు సస్పెన్షన్స్ ఉంటాయంటున్నారు పోలీస్ ఉన్నతాధికారులు. ఆరోపణలు వచ్చిన ప్రతీ పోలీస్ పై స్పెషల్ బ్రాంచ్ పోలీసులతో ఇంటర్నల్ ఇన్వెస్టిగేషన్ చేయించి, రుజువైతే చర్యలు తీసుకుంటామంటున్నారు.

ఇదీ చదవండి: తెలంగాణ ట్రాఫిక్ చలాన్ల రాయితీ గడువు మళ్లీ పెంపు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement