అన్న చేతిలో చెల్లెలు దారుణ హత్య

Brother Killed Sister In Prakasam For Land Issue - Sakshi

హత్యతో ఉలిక్కిపడిన స్వర్ణ గ్రామం

7 సెంట్ల స్థల వివాదమే హత్యకు కారణం

హతురాలికి వివాహమై 7 నెలలే..

ప్రకాశం, స్వర్ణ (కారంచేడు): కంటికి రెప్పలా కాపాడాల్సిన అన్నే కాలయముడయ్యాడు. తాతల కాలం నుంచి వస్తున్న కేవలం 7 సెంట్ల స్థలం వివాదం చెల్లి ప్రాణం తీస్తే.. అన్నను జైలు పాలు చేయనుంది. ఎప్పుడూ ప్రశాంతంగా ఉండే స్వర్ణ గ్రామంలో హత్య జరగడంతో ప్రజలు ఒక్క సారిగా ఉలిక్కి పడ్డారు. తోడ పుట్టిన వాడు కాకపోయినా పెద్దనాన్న కొడుకు అయిన అన్నే తనను హతమారుస్తాడని ఆ చెల్లి ఊహించలేకపోయింది. చీరాల రూరల్‌ సీఐ భక్తవత్సలరెడ్డి, స్థానికులు అందించిన సమాచారం మేరకు.. కారంచేడు మండలం స్వర్ణ ఉత్తర బజారుకు చెందిన సుంకల పద్మావతి (28)ని ఈ ఏడాది మార్చి నెలలో జిల్లాలోని బేస్తవారిపేట మండలం రెట్లపల్లి గ్రామానికి చెందిన వెంకటరమణకు ఇచ్చి వివాహం చేశారు.

హైదరాబాద్‌ నుంచి స్వర్ణ వచ్చిన పద్మావతిని అదే గ్రామానికి చెందిన సూదా శింగయ్య శివాలయం సమీపంలో మాటు వేసి బజారుకు వెళ్లి వస్తున్న ఆమెను కత్తితో పొడిచి చంపాడు. మొదట శివాలయం ప్రహరీ గోడకు తలను బలంగా గుద్దాడు. అనంతరం ఛాతీ భాగంలో కత్తితో బలంగా పొడిచి కేశవరప్పాడు రోడ్డు గుండా పారిపోయాడు. మృతురాలు వివాహం అనంతరం ఆమె భర్త ఉద్యోగ రీత్యా హైదరాబాద్‌లో నివాసముంటున్నారు. గతంలో మృతురాలు  నేషనల్‌ యువజన కేంద్రీయ విద్యలో ఉద్యోగం చేసింది. దీనిలో భాగంగా అక్టోబర్‌ 2వ తేదీన రివార్డు తీసుకోవడానికి సోమవారం సాయత్రం స్వగ్రామానికి చేరుకుంది. అప్పటికే ఆస్తుల గొడవలతో ఆమెపై కక్ష పెంచుకున్న వరుసకు అన్న అయిన సూదా శింగయ్య హత్య చేసేందుకు రంగం సిద్ధం చేసుకున్నాడు. సోమవారం రాత్రి కూడా ఇంటి పరిసరాల్లో సంచరించాడని మృతురాలి తల్లి వెంకాయమ్మ భోరున విలపించింది.

ఆస్తి తగాదాలే కారణమా..
తాతల కాలం నుంచి వచ్చే కేవలం 7 సెంట్ల వ్యవసాయ భూమితో పాటు ఇంటి సరిహద్దు వివాదమే హత్యకు కారణమై ఉంటాయని స్థానికులు, పోలీసులు చెబుతున్నారు. ప్రస్తుతం ఎలాంటి గొడవలు జరగడం లేదని, ప్రశాంతంగా ఉంటున్న ఈ సమయంలో తన కుమార్తెను శింగయ్య పొట్టన పెట్టుకున్నాడని మృతురాలి తండ్రి బోరున విలపించాడు.

మాకు కూడా ప్రాణగండం ఉంది..
కొద్దిపాటి ఆస్తి తగాదాలతో తమ చెల్లిని పొట్టన పెట్టుకున్న శింగయ్య చేతిలో  తమకు కూడా ప్రాణ గండం ఉందని మృతురాలి అక్కలు శివకుమారి, విజయలక్ష్మిలు భోరున విలపిస్తున్నారు. మా తండ్రి మేము నలుగురం అమ్మాయిలమని, మా అందరిలో తెలివిగా ఉండే మా చెల్లిని చంపేశాడని, మిగిలిన మమ్మల్ని కూడా చంపేస్తాడనే భయం ఉందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ రోజు గ్రామానికి రాకుండా ఉన్నా మా చెల్లి బతికి ఉండేదని వారు విలపిస్తున్న తీరు చూపరులను కలిచివేసింది.

దర్యాప్తు చేస్తున్నాం..
హత్య జరిగిన వెంటనే చీరాల సీఐ భక్తవత్సలరెడ్డి, ఈపురుపాలెం ఎస్‌ఐ కే హానోక్‌తో పాటు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతి విషయాన్ని హైదరాబాద్‌లో ఉన్న భర్తకు తెలియజేశామని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చీరాల ప్రభుత్వాస్పత్రికి తరలించినట్లు ఆయన చెప్పారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top