బ్లూ కిరోసిన్‌ దందా

Blue kerosene danda - Sakshi

అర్ధరాత్రి క్యాన్లలో తరలింపు

హైవేపై వెళ్లే లారీలకు విక్రయాలు

జిల్లాలో రేషన్‌ కోటా కింద 

1.62 లక్షల లీటర్ల పంపిణీ

జనగామ : జిల్లా కేంద్రంగా బ్లూ కిరోసిన్‌ దందా యథేచ్ఛగా సాగుతోంది. డీజిల్‌ ధరలు పెరుగుతుండడంతో వాహనదారులు రేషన్‌ ద్వారా పంపిణీ చేసే బ్లూ కిరోసిన్‌ వైపు దృష్టి సారిస్తున్నారు. కొంతమంది బ్రోకర్లు రాత్రికి రాత్రే బ్లూ కిరోసిన్‌ను బ్లాక్‌ మార్కెట్‌కు తరలిస్తున్నారు. లబ్ధిదారులతోపాటు పలువురు ఏజెంట్ల నుంచి బ్లూ కిరోసిన్‌ను సేకరిస్తూ రహస్య ప్రదేశాల్లో డంపింగ్‌ చేస్తున్నారు.

జనగామ పట్టణంలో నడిరోడ్డుపై ‘బ్లాక్‌’ దందా సాగిస్తున్నా సంబంధిత అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. జనగామతోపా టు మండలాల్లో ఈ వ్యాపారం మూడు పూలు..ఆరుకాయలుగా వర్ధిల్లుతోంది.  జనగామ జిల్లాలోని 13 మండలాల్లో 355 రేషన్‌ దుకాణాలు ఉన్నాయి.  ప్రతి నెల 1.62 లక్షల కుటుంబాలకు 1.62 లక్షల లీటర్ల కిరోసిన్‌ను పంపిణీ చేస్తున్నారు.

రేషన్‌ దుకాణాల ద్వారా నిరుపేద కుటుంబాలకు సరఫరా చేస్తున్న కిరోసిన్‌ పెద్ద మొత్తంలో పక్కదారి పడుతోంది. జనగామ జిల్లా కేంద్రంలో కొంతమంది బ్రోకర్ల కనుసన్నల్లో ఈ దందా జరుగుతోంది. వరంగల్‌-హైదరాబాద్‌ జాతీయ రహదారి వెంబడే ఓ వ్యాపారి పట్టపగలే కిరోసిన్‌ను బ్లాక్‌లో అమ్ముతున్నాడు. పట్టణంలోని రెండు మూడు ప్రదేశాల్లో కూడా గుట్టు చప్పుడు కాకుండా విక్రయిస్తున్నారు. రహస్య ప్రదేశాల్లోని గోదాంలో బ్లూ కిరోసిన్‌ క్యాన్లను నిల్వ చేస్తున్నారు.

తనిఖీలు చేస్తున్నాం

అర్ధరాత్రి సమయంలో బ్లూ కిరోసిన్‌ అమ్మకాలపై తనిఖీలు చేస్తున్నాం. కొడకండ్ల పరిధిలో కేసులు కూడా నమోదు చేసినం. లబ్ధిదారులు ఎక్కడా కూడా కిరోసిన్‌ అమ్ముకోవద్దు. ఎవరైనా సబ్సిడీ కిరోసిన్‌ అమ్మినా, ప్రైవేట్‌ వ్యాపారాలకు వినియోగించినా కేసులు తప్పవు. - రుక్మిణి, డీఎస్‌ఓ  
 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top