సీఎం బినామీ సుజనాకు షాక్‌ | Big Shock To Chandrababu Binami Sujana Choudhary | Sakshi
Sakshi News home page

సీఎం బినామీ సుజనాకు షాక్‌

Apr 3 2019 4:03 AM | Updated on Apr 3 2019 9:48 AM

Big Shock To Chandrababu Binami Sujana Choudhary - Sakshi

డబ్బు ఇలా బదలాయించారు

సాక్షి, అమరావతి: బ్యాంకుల నుంచి రుణాలు తీసుకొని ఎగ్గొట్టిన కేసులో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు బినామీ సుజనా చౌదరికి ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) గట్టి షాక్‌ ఇచ్చింది. సుజనా గ్రూపు కంపెనీ బెస్ట్‌ అండ్‌ కాంప్ట్రన్‌ ఇంజనీరింగ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ (బీసీఈపీఎల్‌)పై నమోదైన మనీ లాండరింగ్‌ కేసులో హైదరాబాద్‌లోని వైస్రాయ్‌ హోటల్స్‌కు చెందిన రూ.315 కోట్ల విలువైన స్థిర, చరాస్తులను జప్తు చేసినట్లు ఈడీ మంగళవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపింది.

ఈ కేసులో విచారణ ఇంకా కొనసాగుతోందని పేర్కొంది. కాగా సుజనా గ్రూపు.. మహల్‌ హోటల్స్‌ పేరిట ఒక డొల్ల కంపెనీని సృష్టించి తీసుకున్న రుణం మొత్తాన్ని దొంగ లావాదేవీల రూపంలో వైస్రాయ్‌ హోటల్స్‌కు తరలించినట్లు ఈడీ దర్యాప్తులో తేలింది. వైస్రాయ్‌ హోటల్స్, మహల్‌ హోటల్స్‌ మధ్య వ్యాపార లావాదేవీలు జరిగినట్లుగా ఒప్పందాలు కుదుర్చుకొని ఈ మొత్తాన్ని వైస్రాయ్‌ హోటల్స్‌కు చేరవేశారు. రూ.315 కోట్లు మహల్‌ హోటల్స్‌ నుంచి వచ్చినట్లు విచారణలో వైస్రాయ్‌ హోటల్స్‌ అంగీకరించింది. 

మొత్తం రూ.6,000 కోట్లు ఎగవేత
సుజనాచౌదరి బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలను.. డొల్ల కంపెనీలు సృష్టించి, దొంగ ఇన్‌వాయిస్‌ల ద్వారా జరగని లావేదేవీలు జరిగినట్లు చూపించి సొంత ఖాతాల్లోకి బదలాయించుకున్నట్లు తేలింది. ఈ విధంగా ఇప్పటివరకు వివిధ బ్యాంకుల నుంచి రూ.6,000 కోట్ల రుణాలు తీసుకుని చెల్లించకుండా ఎగ్గొట్టినట్లు తేలింది. బెంగళూరులో సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఇచ్చిన ఫిర్యాదుతో తీగ లాగితే మొత్తం డొంక కదిలింది. బీసీఈపీఎల్‌ రూ.364 కోట్ల విలువైన రుణాలు తీసుకొని ఎగ్గొట్టిందంటూ సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా.. ఆంధ్రాబ్యాంక్, కార్పొరేషన్‌ బ్యాంకులతో కలసి బెంగళూరులో ఫిర్యాదు చేసింది. దీంతో 2010–2013 కాలంలో ఈ సంస్థ బ్యాంకుల నుంచి రుణాలు తీసుకొని ఎగ్గొట్టినట్లుగా.. సీబీఐ నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ ఆధారంగా ఈడీ దర్యాప్తు చేపట్టింది.

తదనంతరం చెన్నై, న్యూఢిల్లీ, హైదరాబాద్‌ల్లో ఉన్న సుజనా గ్రూపునకు చెదిన కంపెనీలు, నివాసాల్లో చేసిన సోదాల్లో కీలక డాక్యుమెంట్లు, ఎలక్ట్రానిక్‌ వస్తువులు ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్‌ పంజాగుట్టలోని సుజనా కార్యాలయంలో చేసిన సోదాల్లో వివిధ డొల్ల కంపెనీలకు చెందిన 124 రబ్బరు స్టాంపులు దొరికాయి. అలాగే బీసీఈపీఎల్‌కు చెందిన రబ్బరు స్టాంపుతో పాటు, ఈ రుణం ద్వారా లబ్ధిపొందిన కంపెనీలు, వివిధ రుణదాతలు, వ్యాపార సంస్థలకు చెందిన రబ్బరు స్టాంపులు దొరికాయి. కాగా సుజనాచౌదరి పెద్దమొత్తంలో తీసుకున్న రుణాలు ఎక్కడికి తరలించారు? ఎవరు లబ్ధి పొందారు అనేది ఈడీ తదుపరి విచారణలో తేలాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement