కట్టుకున్న భార్యే సూత్రధారి

Auto Driver Murder Case Reveals in PSR Nellore - Sakshi

ఆటో డ్రైవర్‌ హత్య కేసును ఛేదించిన పోలీసులు

నిందితులను అదుపులోకి తీసుకున్న వైనం  

నెల్లూరు, మనుబోలు: మండలంలోని మడమనూరు గ్రామంలో వారంరోజుల క్రితం జరిగిన ఆటో డ్రైవర్‌ చేవూరు శ్రీనివాసులు హత్య కేసును పోలీసులు ఛేదించారు. కట్టుకున్న భార్యే ప్రధాన సూత్రధారిగా గుర్తించారు. ప్రియుడి ద్వారా ఆమె పథకం ప్రకారం భర్తను హత్య చేయించినట్టుగా వారు తెలిపారు. బుధవారం నిందితులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. మండల కేంద్రంలోని పోలీసు స్టేషన్‌లో గూడూరు డీఎస్పీ బాబూప్రసాద్‌ విలేకరుల సమావేశం నిర్వహించి వివరాలను వెల్లడించారు. మడమనూరుకు చెందిన చేవూరు శ్రీనివాసులు ఆటో డ్రైవర్‌గా జీవనం సాగించేవాడు. ఈనెల 28వ తేదీ రాత్రి భోజనం ముగించుకుని ఇంటి వెనక్కు వెళ్లిన అతను దుండగుల కత్తిపోట్లకు గురై మృతిచెందాడు. పోలీసులు క్లూస్‌ టీం, డాగ్‌ స్క్వాడ్‌లను పిలిపించి వివరాలు సేకరించి విచారణ చేపట్టారు. ఈక్రమంలో గతంలో ఉన్న గొడవలను దృష్టిలో ఉంచుకుని అదే గ్రామానికి చెందిన ఓ వ్యక్తి శ్రీనివాసులును హత్య చేసి ఉంటాడని మృతుడి బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

కాల్‌ డేటా ఆధారంగా..
మృతుడి ఇంటి సమీపంలో దొరికిన కత్తులు, చేతి రుమాలు, చెప్పులు, తమిళ అక్షరాలున్న అగ్గిపెట్టె తదితర ఆధారాలతో పోలీసులు విచారణ మొదలు పెట్టారు. ఈక్రమంలో అనుమానిస్తున్న వ్యక్తికి హత్యతో ఎటువంటి సంబంధం లేదని తేలింది. అదే సమయంలో మృతుడి భార్య శారద వైపు నుంచి కూడా దర్యాప్తు ప్రారంభించారు. ఆమె సొంతూరు ముత్తుకూరు మండలంలోని మల్లూరులో విచారణ చేయగా ఆమెకు తమిళనాడులోని పుదుకీచలం గ్రామానికి చెందిన రాజేంద్రన్‌ అనే వ్యక్తితో ఏడేళ్లుగా వివాహేతర సంబంధం ఉన్నట్టుగా గుర్తించారు. దీంతో రాజేంద్రన్, శారదల కాల్‌ డేటా ఆధారంగా దర్యాప్తును ముమ్మరం చేశారు. రాజేంద్రన్‌ కదలికలపై నిఘా పెట్టారు. బుధవారం రాజేంద్రన్‌తోపాటు మరో ఇద్దరు మోటార్‌బైక్‌పై నెల్లూరు వైపు వస్తున్నారు. గూడూరు సీఐ వంశీధర్‌ వాహనాలు తనిఖీ చేస్తుండగా అనుమానాస్పదంగా ఉన్న వారిని అదుపులోకి తీసుకుని విచారించగా నేరం ఒప్పుకున్నారు.

రూ.50 వేలకు బేరం
రాజేంద్రన్‌తో వివాహేతర సంబంధం పెట్టుకున్న శారద భర్తను అడ్డు తొలగించుకోవాలని భావించింది. దీంతో ప్రియుడితో కలిసి భర్త హత్యకు పథకం వేసింది. ఈ నేపథ్యంలో రాజేంద్రన్‌ తమిళనాడులోని పలుతిగైమేడు గ్రామానికి చెందిన బాబు అనే వ్యక్తితోపాటు అదే గ్రామానికి చెందిన మైనర్‌ బాలుడితో హత్య చేసేందుకు రూ.50 వేలకు బేరం కుదుర్చుకున్నాడు. ముందుగా అనుకున్న ప్రకారం గత నెల 28వ తేదీ రాత్రి ముగ్గురూ కలిసి మడమనూరు వచ్చి శ్రీనివాసులును వారి పశువుల దొడ్డిలో కత్తులతో పొడిచి చంపారు. వీరి ముగ్గురితోపాటు మృతుడు భార్య శారదను కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని అరెస్ట్‌ చేశారు. సమావేశంలో గూడూరు సీఐ వంశీధర్, రూరల్‌ ఎస్సై శ్రీనివాసులురెడ్డి, మనుబోలు ఎస్సై సూర్యప్రకాశ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.    

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top