నకిలీ మద్యం తయారీ ముఠా అరెస్ట్‌ | Adulterated Alcohol Caught in Kurnool | Sakshi
Sakshi News home page

నకిలీ మద్యం తయారీ ముఠా అరెస్ట్‌

Jan 2 2020 12:56 PM | Updated on Jan 2 2020 12:56 PM

Adulterated Alcohol Caught in Kurnool - Sakshi

స్వాధీనం చేసుకున్న నకిలీ మద్యం బాటిళ్లు

కర్నూలు, డోన్‌ టౌన్‌: నకిలీ మద్యం తయారీ ముఠాను ఎక్సైజ్‌ పోలీసులు అరెస్ట్‌ చేసి, వారి నుంచి రూ.8 లక్షల విలువ చేసే భారీ ముడిసరుకును స్వాధీనం చేసుకున్నారు. ఆ వివరాలను ఎక్సైజ్‌ శాఖ డిప్యూటీ కమిషనర్‌ చెన్నకేశవరావు బుధవారం విలేకరులకు వెల్లడించారు. మండల పరిధిలోని ఉడుములపాడు గ్రామానికి చెందిన ఉప్పరి రాంబాబు తన ఇంటిలో అండర్‌గ్రౌండ్‌లో బంకర్‌ ఏర్పాటు చేసుకొని కొంతకాలంగా నకిలీ మద్యం తయారు చేసి, ఇతర ప్రదేశాలకు తరలిస్తూ వస్తున్నాడు. విషయం తెలుసుకున్న ఎక్సైజ్‌ పోలీసులు గత నెల 29న సోదాలు చేసి నకిలీ మద్యం తయారీ గుట్టును రట్టు చేశారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారించగా మరికొన్ని విషయాలు వెలుగులోకి వచ్చాయి. రాంబాబుకు తెలంగాణ రాష్ట్రంలోని అమరవాయికి చెందిన శ్రీనివాసగౌడ్, ప్రకాశం జిల్లా అద్దంకి శ్రీనివాసరావులతో సంబంధాలు ఉన్నట్లు విచారణలో తేలింది. 

కర్ణాటక నుంచి ముడిసరుకు..
కర్ణాటక రాష్ట్రం నుంచి స్పిరిట్, క్యారామిల్, మూతలు తదితర ముడి సరుకు తెప్పించి నకిలీ మద్యాన్ని రాంబాబు తయారు చేసేవాడు. వీటి కొనుగోలుకు ఉడుములపాడుకు చెందిన ఈడిగ నాగభూషణం, డోన్‌ పట్టణానికి చెందిన ఫజల్, ఈడిగ రవి ఆర్థికంగా డబ్బు సమకూర్చేవారు. తయారు చేసిన నకిలీ మద్యాన్ని బనగానపల్లెకు చెందిన క్రిష్ణారెడ్డి, శివ, కృష్ణగిరి మండలం చిట్యాల గ్రామానికి చెందిన మురళీధర్‌గౌడ్, కొత్తపల్లెకు చెందిన రాజశేఖర్‌ తదితరులతో పాటు మరికొంత మంది ద్వారా విక్రయించేవాడు.  

రూ.8 లక్షల విలువ చేసే ముడిసరుకు స్వాధీనం
నిందితుడి నుంచి పోర్డ్‌ ఐకాన్‌ ఏపీ 21ఏఈ 3007 నంబరు కారు, 720 క్వాటర్‌ బాటిళ్లతో పాటు రాంబాబు ఇంటిలోని బంకర్‌లో 17 బస్తాల్లో ఉన్న నకిలీ మద్యం బాటిళ్లు, 245 లీటర్ల స్పిరిట్, 4 వేల మ్యాక్‌డోల్‌ బ్రాంది, 2 వేల ఇంపీరియల్‌ బ్లూ మద్యం బ్రాండ్‌ ఖాళీ మూతలు, 10 వేల గోలా క్యాప్స్, క్యారమిల్, ఏస్సేన్, మద్యం మీటర్, 19 ఖాళీ క్యాన్లు, 2 డ్రమ్ములు, 800 ఖాళీ క్వాటర్‌ బాటిళ్లు తదితర వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. ఉప్పరి రాంబాబుతో పాటు ఉడుములపాడుకు చెందిన నాగభూషణం, రవిని అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. కాగా ముడి సరుకు రవాణా అసలు సూత్రధారుడిని త్వరలో అరెస్టు చేస్తామని డీసీ చెప్పారు. సమావేశంలో నంద్యాల ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌ మధుసూదన్, స్టేట్‌ టాస్క్‌ఫోర్స్‌ డీఎస్పీ క్రిష్ణకిషోర్‌రెడ్డి, కర్నూలు సీసీఎస్‌ డీఎస్పీ వినోద్‌కుమార్, అసిస్టెంట్‌ ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌ శివశంకర్‌రెడ్డి, డోన్‌ సీఐ లక్ష్మణదాసు, ఎస్‌ఐలు శ్రీధర్‌రావు, రమణారెడ్డి, సిబ్బంది లక్ష్మినారాయణ, సుధాకర్‌రెడ్డి, లాలప్ప, శంకర్‌నాయక్, ధనుంజయ ఉన్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement