‘ఎందుకలా చేశారు.. మీ ఇంట్రెస్ట్‌ ఏమిటి’

ACB queried Atchannaidu in the ESI scam - Sakshi

లేఖలు, సిఫారసులతో అధికారులపై ఒత్తిడి ఎందుకు తెచ్చారు?

ఈఎస్‌ఐ స్కామ్‌లో అచ్చెన్నాయుడును ప్రశ్నించిన ఏసీబీ  

సాక్షి, అమరావతి/గుంటూరు: ‘ఎందుకలా చేశారు.. లేఖలు, సిఫారసులతో ఈఏస్‌ఐ అధికారులపై ఒత్తిడి ఎందుకు తెచ్చారు.. ఈ వ్యవహారాల్లో మీ ఇంట్రెస్ట్‌ ఏమిటి’ అంటూ ఈఎస్‌ఐ స్కామ్‌లో ఏ–2 నిందితుడిగా ఉన్న మాజీ మంత్రి, టీడీపీ టెక్కలి ఎమ్మెల్యే కింజరపు అచ్చెన్నాయుడును ఏసీబీ అధికారులు ప్రశ్నించారు. కుంభకోణంలో అరెస్టయి రిమాండ్‌లో ఉన్న ఆయన్ను కస్టడీలోకి తీసుకున్న ఏసీబీ శుక్రవారం కూడా విచారణ చేసింది.

ఐదు గంటలపాటు విచారణ
► రెండో రోజు విచారణకు ముందు అచ్చెన్నకు గుంటూరు జీజీహెచ్‌లో వైద్య పరీక్షలు నిర్వహించారు. ఎండోస్కొపి అయిన తర్వాత ఆయనను ప్రత్యేక వార్డుకు తరలించిన ఏసీబీ అధికారులు అక్కడే విచారణ చేశారు.
► ఏసీబీ కేంద్ర పరిశోధన బృందం (సీఐయూ) డీఎస్పీలు పీఎస్‌ఆర్కే ప్రసాద్, చిరంజీవి నేతృత్వంలో 5 గంటల పాటు విచారణ జరిపారు.
► విచారణ సమయంలో అచ్చెన్నాయుడు తరఫు న్యాయవాది హరిబాబు, వైద్యుడిని అనుమతించారు. విచారణను ఆడియో, వీడియో ద్వారా రికార్డు చేసినట్టు సమాచారం. 
► టెలీ హెల్త్‌ సర్వీసెస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ నిర్వహించిన టోల్‌ ఫ్రీ, ఈసీజీ సేవలు, నిబంధనలకు విరుద్ధంగా మందులు, సర్జికల్‌ ఎక్విప్‌మెంట్, ఫర్నిచర్, ఇతర పరికరాల కొనుగోళ్లపై ఏసీబీ ప్రశ్నించినట్టు సమాచారం. 

కీలకాంశాలివీ..: ‘మీరు ఇచ్చిన లేఖలు, సిఫారసులతోనే ఈఎస్‌ఐ స్కామ్‌కు తెరలేచింది. ఇందులో రూ.150 కోట్లకుపైగా ప్రజాధనం దుర్వినియోగమైంది. మీరు లేఖలు, సిఫారసులు చేయడానికి గల కారణాలు ఏమిటి. కొన్ని కంపెనీలకు మీరు ఎందుకు సిఫారసులు చేశారు. ఆ కంపెనీల వాళ్లు మీకు ముందే తెలుసా? గుర్తింపు కలిగిన కంపెనీలు ఉన్నా ఎందుకు పరిగణనలోకి తీసుకోలేదు. నామినేషన్‌ పద్ధతులు, నకిలీ కొటేషన్లు, బిల్లులు వంటి వాటితో జరిగిన అవినీతి, అక్రమాలు గురించి మీకు తెలుసా. ఇందులో మీ పాత్ర ఎంత?’ అనే ప్రశ్నలతోపాటు వివిధ కోణాల్లోనూ ప్రశ్నించినట్లు సమాచారం. తాను లేఖలు ఇచ్చినట్టు, సిఫారసులు చేసినట్టు అంగీకరించిన అచ్చెన్న ఏసీబీ అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానాలు ఇవ్వలేదని తెలిసింది. 

అచ్చెన్న ఒత్తిడితోనే చేశాం: మాజీ డైరెక్టర్లు
కోర్టు అనుమతితో ఈఎస్‌ఐ మాజీ డైరెక్టర్లు సీకే రమేష్‌కుమార్, జి.విజయకుమార్, రిటైర్డ్‌ జేడీ వి.జనార్దన్, సూపరింటెండెంట్‌ ఎంకేపీ చక్రవర్తి, సీనియర్‌ అసిస్టెంట్‌ ఇవన రమేష్‌లను కస్టడీకి తీసుకున్న ఏసీబీ.. శుక్రవారం విచారణ జరిపారు. అచ్చెన్న లేఖలు, సిఫారసుల వల్లే తాము నామినేషన్‌ పద్ధతిలో టెలీ హెల్త్‌ సర్వీసెస్‌ సేవలు, మందులు, పరికరాలకు కొనుగోలు ఒప్పందాలు చేసుకున్నట్టు ఈఎస్‌ఐ మాజీ డైరెక్టర్లు అంగీకరించినట్టు తెలిసింది.  వారిని వేర్వేరుగా ప్రశ్నించగా.. అచ్చెన్న లేఖలు, సిఫారసులు ఒత్తిళ్లపై వాస్తవాలను వారు ఏసీబీ అధికారుల వద్ద కుండబద్దలు కొట్టినట్టు చెప్పారని సమాచారం. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top