మత్తులో డ్రైవర్‌.. స్కూల్‌ బస్సు బోల్తా

10 Students Injured After School Bus Rolled Down In Nellore - Sakshi

సాక్షి, నెల్లూరు(డక్కిలి) : మండలంలో జరిగిన శ్రీచైతన్య ఇంగ్లిష్‌ మీడియం స్కూల్‌ బస్సు ప్రమాదానికి డ్రైవర్‌ మద్యం మత్తే కారణమని పోలీసులు నిర్ధారించారు. శుక్రవారం జరిగిన ఈ ఘటన కలకలం రేపింది. పోలీసులు, స్థానికుల కథనం మేరకు.. వెంకటగిరి శ్రీచైతన్య ఇంగ్లిష్‌ మీడియం స్కూల్‌కు చెందిన బస్సు ఉదయం 7.30 గంటలకు డక్కిలి మండలంలోని కమ్మపల్లి, మిట్టవడ్డిపల్లి, దేవునివెల్లంపల్లి, కుప్పాయిపాళెం గ్రామాలకు చెందిన విద్యార్థులను ఎక్కించుకుని డక్కిలి వైపు వస్తోంది. ఎనిమిది గంటల సమయంలో కుప్పాయిపాళెం దాటిన తర్వాత బస్సు అదుపుతప్పినట్లుగా విద్యార్థులు గుర్తించి కేకలు వేశారు. డ్రైవర్‌ నవకోటి మద్యం మత్తులో ఉండటం, నిద్రలోకి జారుకోవడంతో బస్సు చెరువు వద్ద గుంతలో బోల్తా పడింది. ఈ సంఘటనలో నర్రావుల వెంకటేష్‌ (6వ తరగతి), పోకూరు రోహిత్‌ (6వ తరగతి), వేముల నాని (6వ తరగతి), తంబిశెట్టి యామిని (5వ తరగతి), పెదనేని చంద్రిక (5వ తరగతి), కొక్కనేటి శ్రీనివాస్‌కుమార్‌ (9వ తరగతి), వేముల శరణ్య (4వ తరగతి), ఏలేశ్వరం మహేష్‌ (5వ తరగతి), పత్తిపాటి భానుప్రకాష్‌ (6వ తరగతి), ఎ.మోహన్‌ (9వ తరగతి), కుంచెం నిఖిలేస్‌ (3వ తరగతి), డ్రైవర్‌ నవకోటిలకు గాయలయ్యాయి. వీరిలో నిఖిలేష్, యామిని, మోహన్‌ తీవ్రంగా గాయపడ్డారు. 

సకాలంలో డక్కిలి పోలీసుల స్పందన 
స్కూల్‌ బస్సు బోల్తా పడిన విషయాన్ని తెలుసుకున్న డక్కిలి ఎస్సై కామినేని గోపి వెంటనే స్పందించి తన సిబ్బందితో ఘటనా స్థలానికి వెళ్లారు. భయాందోళనతో కేకలు వేస్తున్న విద్యార్థులను ఎస్సై, పోలీసు సిబ్బంది స్థానికులు సాయంతో బస్సులో నుంచి బయటకు తీశారు. పోలీసు వ్యాన్‌లో డక్కిలి పీహెచ్‌సీకి తరలించారు. అక్కడ విద్యార్థులకు డాక్టర్‌ సుధీర్‌కుమార్‌ ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం వెంకటగిరిలోని ప్రైవేట్‌ వైద్యశాలకు తరలించారు. గూడూరు ఆర్డీఓ బాపిరెడ్డి, డక్కిలి తహసీల్దార్‌ మునిలక్ష్మి లు విద్యార్థులను పరామర్శించారు. వైద్యసేవల గురించి ఆరాతీశారు. తహసీల్దార్‌ కుప్పాయిపాళెం, డీ వడ్డిపల్లి గ్రామాలకు వెళ్లి విద్యార్థుల తల్లిదండ్రులతో మాట్లాడి ఓదార్చారు. 

సంఘటనా స్థలాన్ని పరిశీలించిన సీఐ 
వెంకటగిరి సీఐ అన్వర్‌బాషా ప్రమాదం గురించి తెలుసుకుని ఘటనా స్థలానికి వివరాలు ఆరాతీశారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ స్కూల్‌ బస్సు డ్రైవర్‌ నవకోటి మద్యం సేవించి డ్రైవింగ్‌ చేసినట్లుగా తెలిపారు. ఈ విషయం డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ టెస్ట్‌లో వెల్లడైందన్నారు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.స్కూల్‌ బస్సు డ్రైవర్‌ నవకోటి మద్యం సేవించి బస్సు నడపడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు చెబుతున్నారు. అతను గురువారం రాత్రి వేటకు వెళ్లి రాత్రంతా నిద్రపోలేదు. శుక్రవారం ఉదయం నవకోటికి పోలీసులు డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ టెస్ట్‌ చేయగా 49 శాతం ఆల్కాహాల్‌ ఉన్నట్లుగా చూపించింది. స్కూల్‌ నిర్వాహకులు తమ పిల్లలను తీసుకెళ్లే విషయంలో నిబంధనలు పాటించలేదని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. కమ్మపల్లి, మిట్టవడ్డిపల్లి, దేవునివెల్లంపల్లి, కుప్పాయపాళెం, డక్కిలి, వెలికల్లు తదితర గ్రామాల నుంచి ప్రతిరోజూ 50 మందికి పైగా విద్యార్థులు బస్సులో వెళుతున్నారు. వాహనం కండీషన్‌లో లేదని వారు చెబుతున్నారు. క్లీనర్‌ను కూడా నియమించలేదని వాపోయారు. 

రాత్రంతా నిద్రపోలేదు
స్కూల్‌ బస్సు డ్రైవర్‌ నవకోటి మద్యం సేవించి బస్సు నడపడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు చెబుతున్నారు. అతను గురువారం రాత్రి వేటకు వెళ్లి రాత్రంతా నిద్రపోలేదు. శుక్రవారం ఉదయం నవకోటికి పోలీసులు డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ టెస్ట్‌ చేయగా 49 శాతం ఆల్కాహాల్‌ ఉన్నట్లుగా చూపించింది. స్కూల్‌ నిర్వాహకులు తమ పిల్లలను తీసుకెళ్లే విషయంలో నిబంధనలు పాటించలేదని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. కమ్మపల్లి, మిట్టవడ్డిపల్లి, దేవునివెల్లంపల్లి, కుప్పాయపాళెం, డక్కిలి, వెలికల్లు తదితర గ్రామాల నుంచి ప్రతిరోజూ 50 మందికి పైగా విద్యార్థులు బస్సులో వెళుతున్నారు. వాహనం కండీషన్‌లో లేదని వారు చెబుతున్నారు. క్లీనర్‌ను కూడా నియమించలేదని వాపోయారు.  

డ్రైవర్‌ నిద్రలో ఉన్నాడు : విద్యార్థి
కుప్పాయిపాళెం గ్రామం దాటగానే చెరువు వద్ద బస్సు పక్కకు వెళ్లి పోతుండటాన్ని గుర్తించి కేకలు వేశాం. అప్పటికే డ్రైవర్‌ నిద్రలో ఉన్నాడు. బస్సు అదుపుతప్పి గుంతలో పడిపోగానే మేము గాయపడ్డాం. కేకలు వేయగా చుట్టుపక్కల వారు, పోలీసులు వచ్చి కాపాడారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top