కొత్త సీఎండీ, యస్‌ బ్యాంకు షేరు దూకుడు

Yes Bank names Ravneet Singh Gill as  New  Md and Ceo - Sakshi

సాక్షి, ముంబై: ప్రయివేటు రంగ బ్యాంకు యస్‌ బ్యాంకు గాడిలో పడినట్టు కనిపిస్తోంది. అటు ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో మెరుగైన ఫలితాలు..ఇటు కొత్త  సీఎండీ ప్రకటన...దీంతో యస్‌బ్యాంకు కౌంటర్లో ఉత్సాం నెలకొంది. తమ బ్యాంకు కొత్త ఎండీ, సీఈవోగా రవ్‌నీత్‌ గిల్‌ను ఎంపిక చేసినట్లు యస్‌ బ్యాంక్‌ వెల్లడించింది. దీనికి ఆర్‌బీఐ ఆమోదం లభించిందనీ, మార్చి1 నుంచి గిల్‌ బాధ్యతలు చేపట్టనున్నట్లు తెలిపింది. గిల్‌ ప్రస్తుతం డాయిష్‌ బ్యాంక్‌ ఇండియా సీఈవోగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

ఈ ఏడాది క్యూ3(అక్టోబర్‌-డిసెంబర్‌)లో యస్‌ బ్యాంకు రూ. 1001 కోట్ల నికర లాభం ఆర్జించింది. నికర వడ్డీ ఆదాయం(ఎన్‌ఐఐ) రూ. 2667 కోట్లుకాగా. రూ. 2297 కోట్లమేర స్లిప్పేజెస్‌ నమోదయ్యాయి. స్థూల మొండిబకాయిలు(ఎన్‌పీఏలు) 1.6 నుంచి 2.1 శాతానికి, నికర ఎన్‌పీఏలు 0.86 శాతం నుంచి 1.18 శాతానికి పెరిగాయి. ఈ సందర్భంగా ఐఎల్‌ఎఫ్‌ఎస్‌ గ్రూప్‌ ఎక్స్‌పోజర్‌ విలువ రూ. 2530 కోట్లుగా వెల్లడించింది. ఈ నేపథ్యంలో  యస్‌బ్యాంకు షేరు   దూసుకుపోయింది.  యస్‌ బ్యాంకు షేరు ఇంట్రాడేలో 18 శాతంపైగా దూసుకెళ్లి రూ. 235 వద్ద గరిష్టాన్ని తాకింది. చివరికి 14.32 శాతం లాభంతో రూ. 225 వద్ద నిలిచింది.

కాగా యస్‌ బ్యాంక్ వ్యవస్థాపకుడు, సీఈవో రాణా కపూర్‌ పదవీకాలాన్ని పొడిగించేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ససేమిరా అంగీకరించికపోవడంతో  ఫిబ్రవరికల్లా పదవీ బాధ్యతల నుంచి తప్పుకోవలసి ఉన్న సంగతి తెలిసిందే

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top