వాట్సాప్‌ పేమెంట్‌ సర్వీసులు లాంచింగ్‌కు ముందే...

WhatsApp To Set Up New Office In India - Sakshi

న్యూఢిల్లీ : ప్రముఖ ఇన్‌స్టాంట్‌ మెసేజింగ్‌ మాధ్యమం వాట్సాప్‌ త్వరలోనే భారత్‌లో తన పేమెంట్‌ సర్వీసులను లాంచ్‌ చేయబోతుంది. దీని కోసం సరికొత్త ఫీచర్‌ను వాట్సాప్‌ రూపొందించింది. ఈ ఏడాది ప్రారంభం నుంచే ఈ కొత్త ఫీచర్‌ను బీటా టెస్టింగ్‌కు తీసుకొచ్చింది. అయితే వాట్సాప్‌ సర్వీసులు దేశవ్యాప్తంగా అధికారికంగా లాంచ్‌ చేయడానికి కంటే ముందే.. ఈ కంపెనీ భారత్‌లో కొత్త ఆఫీసును ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీచేసింది. ఒకవేళ భారత్‌లో పేమెంట్‌ ఫీచర్‌ను లాంచ్‌ చేయాలనుకుంటే, ముందస్తుగా ఇక్కడ ఒక ఆఫీసు ఏర్పాటు చేయాలని కేంద్ర ఎలక్ట్రానిక్స్‌, ఐటీ మంత్రిత్వ శాఖ ఆదేశించింది. ఆఫీసు ఏర్పాటు చేసేంతవరకు ఈ సర్వీసులు లాంచ్‌ చేయొద్దని తెలిపింది. పేమెంట్‌ సర్వీసులను లాంచ్‌ చేయనున్న నేపథ్యంలో కంపెనీ చీఫ్‌ ఆపరేటింగ్‌ ఆఫీసర్‌ మాట్‌ ఐడెమా, కేంద్ర ఎలక్ట్రానిక్స్‌, ఐటీ మంత్రిత్వ శాఖతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆర్‌బీఐ మార్గదర్శకాలను కోడ్‌ చేసిన మంత్రిత్వ శాఖ, ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. 

వాట్సాప్‌ లాంచ్‌ చేయబోయే ఈ సర్వీసులపై ప్రభుత్వం కూడా నిఘా ఉంచనుంది. రెండు దశల ధృవీకరణ, ఫైనాన్సియల్‌గా కీలకమైన డేటాను ఎలా స్టోర్‌ చేస్తారు అనే విషయాలపై వాట్సాప్‌కు ప్రశ్నలు కూడా ఎదురవుతున్నాయి. అంతేకాక వాట్సాప్‌కు ఫేస్‌బుక్‌కు చెందినది కావడంతో, డేటా షేరింగ్‌పై కూడా కేంద్రం పలు ప్రశ్నలు వేస్తోంది. ఇప్పటికే ఫేస్‌బుక్‌ తన యూజర్ల డేటా థర్డ్‌ పార్టీలకు షేర్‌ చేయడంపై కేంద్రం సీరియస్‌గా ఉన్న సంగతి తెలిసిందే. పేమెంట్‌ సర్వీసుల్లో కస్టమర్లకు ఏదైనా సమస్య వస్తే, వాటిని వెంటనే పరిష్కరించడానికి 24 గంటల టోల్‌-ఫ్రీ కస్టమర్‌ సర్వీసును ఏర్పాటు చేయాలని వాట్సాప్‌ యోచిస్తోంది.

ఎలక్ట్రానిక్స్‌, ఐటీ మంత్రిత్వ శాఖ ఆదేశాలతో, వాట్సాప్‌ భారత్‌లో ఓ కార్యాలయం ఏర్పాటు చేయడాన్ని కీలకమైన అంశంగా పరిగణలోకి తీసుకుంది. అంతేకాక కొత్త ఆఫీసు ఏర్పాటుతో పాటు భారత్‌లోనూ ఓ బృందం ఏర్పాటు చేసేందుకు సన్నద్ధమవుతోంది. వాట్సాప్‌ ఇండియా హెడ్‌, హెడ్‌ ఆఫ్‌ పాలసీలను నియమించుకోవడం కోసం వాట్సాప్‌ తీవ్ర కసరత్తు చేస్తోంది. భారత్‌లో ఆఫీసు ఏర్పాటు చేయడంతో కేవలం సమస్యలను పరిష్కరించడమే కాకుండా.. పేమెంట్స్‌ అప్లికేషన్‌లో విశ్వసనీయతను పెంచడానికి ఇది సహకరించనుందని తెలిసింది. వాట్సాప్‌ ఇప్పటికే తన ప్రైవసీ పాలసీని అప్‌డేట్‌ చేసింది. హెచ్‌డీఎఫ్‌సీ, యాక్సిస్‌ బ్యాంక్‌లను తన పార్టనర్‌ బ్యాంక్‌లుగా చేర్చుకుంది. జూలై నెల మొదటి వారంలోనే ఈ సర్వీసులను భారత్‌లో లాంచ్‌ చేయాలని అనుకుంది. కానీ కొత్త డెవలప్‌మెంట్‌తో ఈ ఫీచర్‌ లాంచింగ్‌ వాయిదా పడింది. 
 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top