డెయిరీ రంగంలోకి ‘వల్లభ’

vallabbha This month the products are marketed - Sakshi

ఈ నెలలోనే  మార్కెట్లోకి ఉత్పత్తులు

తొలుత రూ.200 కోట్ల పెట్టుబడి

కంపెనీ చైర్మన్‌ బొల్లా బ్రహ్మనాయుడు

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: డెయిరీ రంగంలోకి మరో బ్రాండు ‘వల్లభ’ ఎంట్రీ ఇస్తోంది. ఏప్రిల్‌ 20న ఆంధ్రప్రదేశ్‌లో, 25న తెలంగాణలో ఈ బ్రాండ్‌ అడుగు పెడుతోంది. పాలతోపాటు పెరుగు, లస్సి, మజ్జిగ, పనీర్, ఐస్‌ క్రీం, నెయ్యి వంటి ఉత్పత్తులను విక్రయించనుంది. తెలుగు రాష్ట్రాల కంటే ముందుగా తమిళనాడు, కర్ణాటక మార్కెట్లలో ఈ ఉత్పత్తులను ప్రవేశపెడుతోంది. ఇప్పటికే చెన్నై, బెంగళూరు నగరాలకు శాంపిళ్లను విడుదల చేసినట్లు వల్లభ మిల్క్‌ ప్రొడక్ట్స్‌ చైర్మన్‌ బొల్లా బ్రహ్మనాయుడు ‘సాక్షి’ బిజినెస్‌ బ్యూరో ప్రతినిధికి చెప్పారు. దశలవారీగా ఇతర నగరాలకు విస్తరిస్తామన్నారు. తొలి దశలో 500 దాకా పార్లర్లను నెలకొల్పుతామని వివరించారు. 

రూ.200 కోట్లతో..
డెయిరీ కోసం కంపెనీ తొలిదశలో రూ.200 కోట్లను వెచ్చిస్తోంది. చిత్తూరు జిల్లా కాణిపాకం, గుంటూరు జిల్లా వినుకొండతోపాటు రాజమండ్రి, హైదరాబాద్‌లో ప్రాసెసింగ్‌ యూనిట్లు నిర్మాణంలో ఉన్నాయి. ఒక్కో యూనిట్‌కు రోజుకు 2 లక్షల లీటర్ల పాలను ప్రాసెస్‌ చేయగల సామర్థ్యం ఉంటుంది. ఏడాది చివరికి 100 పాల శీతలీకరణ కేంద్రాలను సైతం కంపెనీ ఏర్పాటు చేస్తోంది. వినుకొండ యూనిట్‌ ఏప్రిల్‌ 19న ప్రారంభిస్తున్నారు. హైదరాబాద్‌ కేంద్రం అందుబాటులోకి వచ్చేంత వరకు ఈ యూనిట్‌ నుంచే తెలంగాణకు పాలను సరఫరా చేస్తారు. 

వల్లభ గ్రూప్‌ నుంచి..
తిరుమల డెయిరీ వ్యవస్థాపకుల్లో ఒకరైన బొల్లా బ్రహ్మనాయుడు వల్లభ బ్రాండ్‌ను ప్రమోట్‌ చేస్తున్నారు. వల్లభ గ్రూప్‌ ఇప్పటికే పశు దాణా, రైస్‌ బ్రాన్‌ ఆయిల్‌ తయారీలో ఉంది. వల్లభ మిల్క్‌ ప్రొడక్ట్స్‌ కంపెనీలో బ్రహ్మనాయుడుకు 55 శాతం వాటా ఉంది. తిరుమల డెయిరీని ఫ్రాన్స్‌కు చెందిన లాక్టాలిస్‌ గ్రూప్‌ 2014లో సుమారు రూ.1,750 కోట్లకు కొనుగోలు చేసింది. లాక్టాలిస్‌తో అప్పటి తిరుమల మిల్క్‌ ప్రమోటర్లకున్న నాన్‌–కాంపీట్‌ (పోటీకి రాకూడదు) ఒప్పందం ఇటీవలే ముగిసింది.  

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top