వ్యాక్సిన్లపై ఆశలు- నాస్‌డాక్‌ రికార్డ్‌

Vaccine hopes and tech support lifts Nasdaq to record high - Sakshi

ఆస్ట్రాజెనెకా, కాన్సినో బయోలాజిక్స్‌

ఫైజర్‌- బయోఎన్‌టెక్‌.. వ్యాక్సిన్ల ఎఫెక్ట్‌

క్లినికల్‌ పరీక్షలలో పెరిగిన రోగ నిరోధక శక్తి

నాస్‌డాక్‌కు మైక్రోసాఫ్ట్‌, అమెజాన్‌ దన్ను

ఎలక్ట్రిక్‌ కార్ల కంపెనీ టెస్లా సరికొత్త రికార్డ్‌

మోడార్నా ఇంక్‌ 13 శాతం పతనం

ఓవైపు దేశంలోని 50 రాష్ట్రాలకుగాను 42 రాష్ట్రాలకు కరోనా వైరస్‌ విస్తరించినప్పటికీ మరోపక్క వ్యాక్సిన్‌ల అభివృద్ధిలో ఫార్మా దిగ్గజాల ముందడుగు సెంటిమెంటుకు బలాన్నిస్తోంది. దీంతో సోమవారం ఆటుపోట్ల మధ్య యూఎస్‌ మార్కెట్లు లాభాలతో ముగిశాయి. డోజోన్స్‌ నామమాత్రంగా 9 పాయింట్లు బలపడి 26,681 వద్ద నిలవగా.. ఎస్‌అండ్‌పీ 27 పాయింట్లు(0.9 శాతం) ఎగసి 3,252 వద్ద స్థిరపడింది. నాస్‌డాక్‌ మరింత అధికంగా 264 పాయింట్లు(2.5 శాతం) జంప్‌చేసి 10,767 వద్ద ముగిసింది. ఇది చరిత్రాత్మక గరిష్టంకాగా.. ఇందుకు ప్రధానంగా అమెజాన్‌, మైక్రోసాఫ్ట్‌ సహకరించాయి. అయితే వారాంతానికి కోవిడ్‌-19 కారణంగా మరణించిన వారి సంఖ్య 1.4 లక్షలను దాటడం ఆందోళనలను పెంచుతున్నట్లు విశ్లేషకులు పేర్కొన్నారు.

సానుకూల ఫలితాలు
ఆస్ట్రాజెనెకా, కాన్సినో బయోలాజిక్స్‌, ఫైజర్‌- బయోఎన్‌టెక్‌ రూపొందిస్తున్న వ్యాక్సిన్‌ల క్లినికల్‌ పరీక్షలు విజయవంతమవుతున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి. ప్రయోగాలలో వ్యాక్సిన్లు రోగ నిరోధక శక్తిని పెంచుతున్నట్లు డేటా పేర్కొంది.  దీంతో ఇన్వెస్టర్లకు హుషారొచ్చినట్లు నిపుణులు తెలియజేశారు. అయితే ఇటీవల జోరు చూపుతున్న ఫార్మా షేరు మోడర్నా ఇంక్‌ కౌంటర్లో లాభాల స్వీకరణ తలెత్తినట్లు తెలియజేశారు. దీంతో సోమవారం ఈ షేరు 13 శాతం కుప్పకూలింది. 83 డాలర్ల దిగువకు చేరింది. ఇందుకు వ్యాక్సిన్ల అభివృద్ధిలో  ప్రత్యర్థి సంస్థలు ముందడుగు వేయడం కూడా ప్రభావం చూపినట్లు నిపుణులు పేర్కొన్నారు. ప్రధానంగా ఆస్ట్రాజెనెకా- ఆక్స్‌ఫర్డ్‌ వ్యాక్సిన్‌(AZD1222) క్లినికల్‌ పరీక్షలలో ఇమ్యూనిటీని పెంచుతున్నట్లు తాజాగా వెల్లడైన విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు. బ్రిటిష్‌ ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్శిటీ సహకారంతో ఆస్ట్రాజెనెకా అభివృద్ధి చేస్తున్న ఈ వ్యాక్సిన్‌ వినియోగంలో ఇతర సమస్యలు పెద్దగా తలెత్తకపోవడం గమనార్హం!

ఐబీఎం అప్‌
బ్లూచిప్స్‌లో సోషల్‌ మీడియా దిగ్గజం అమెజాన్‌ 8 శాతం దూసుకెళ్లి 3197 డాలర్లను తాకగా.. టెక్‌ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌ 4.3 శాతం జంప్‌చేసి 212 డాలర్లకు చేరింది. ఈ బాటలో ఫలితాలు ఆకట్టుకోవడంతో ఐబీఎం 5 శాతం పుంజుకోగా.. ఆటో దిగ్గజం టెస్లా ఇంక్‌ 9.5 శాతం ఎగసింది. 1643 డాలర్ల వద్ద ముగిసింది. వెరసి మరోసారి సరికొత్త గరిష్టాన్ని అందుకుంది. ఇతర కౌంటర్లలో చమురు దిగ్గజం షెవ్రాన్‌  5 బిలియన్‌ డాలర్లకు కంపెనీని కొనుగోలు చేయనున్న వార్తలతో నోబుల్‌ ఎనర్జీ 5.4 శాతం జంప్‌చేసింది. అయితే షెవ్రాన్‌ 2.2 శాతం క్షీణించింది. సానుకూల క్యూ2 ఫలితాలతో హాలిబర్టన్‌‌ 2.5 శాతం బలపడింది.

ఆసియా ఇలా
కోవిడ్‌-19 ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు ఈసీబీ 650 బిలియన్‌ యూరోల ప్యాకేజీపై అంచనాలతో సోమవారం జర్మనీ 1 శాతం పుంజుకోగా.. ఫ్రాన్స్‌ 0.5 శాతం లాభపడింది. అయితే యూకే 0.5 శాతం నీరసించింది. ప్రస్తుతం ఆసియా మార్కెట్లు జోష్‌తో కదులుతున్నాయి. తైవాన్‌, హాంకాంగ్‌, కొరియా, థాయ్‌లాండ్‌, ఇండొనేసియా, జపాన్‌ 2-1 శాతం మధ్య ఎగశాయి. సింగపూర్‌ 0.3 శాతం బలపడగా.. చైనా యథాతథంగా కదులుతోంది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top