టోకు ధరలకు ఆహారం, తయారీ సెగ | Sakshi
Sakshi News home page

టోకు ధరలకు ఆహారం, తయారీ సెగ

Published Fri, Jul 15 2016 12:29 AM

టోకు ధరలకు ఆహారం, తయారీ సెగ

జూన్‌లో ద్రవ్యోల్బణం 1.62 శాతం
ఆహార ద్రవ్యోల్బణం 8.18 శాతం
ఆగస్టు 9 ఆర్‌బీఐ రేటు కోత అంచనాలపై నీళ్లు

న్యూఢిల్లీ: టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం వరుసగా మూడవ నెలలోనూ ‘ప్లస్’లోనే కొనసాగింది. జూన్‌లో టోకు ధరల సూచీ 1.62%గా నమోదయ్యింది. టోకు సూచీలో ఆహార ధరల విభాగంలో భారీ పెరుగుదల, అలాగే సూచీలో దాదాపు 65 శాతం వెయిటేజ్ ఉన్న తయారీ రంగంలో ద్రవ్యోల్బణం కూడా ‘క్షీణతలోంచి’ బయటకు రావడం వంటి అంశాలు తాజా ఫలితానికి కారణం.  టోకు ద్రవ్యోల్బణం సూచీ  మార్చి వరకూ   దాదాపు పదిహేడు నెలల పాటు అసలు పెరుగుదల లేకపోగా, క్షీణతలో కొనసాగిన విషయం తెలిసిందే. 2015 ఇదే నెలలో ఈ రేటు -2.13 శాతంగా ఉంది.

 ప్రధాన విభాగాలను వేర్వేరుగా చూస్తే...
ఫుడ్, నాన్ ఫుడ్ ఆర్టికల్స్‌తో కూడిన ప్రైమరీ ఆర్టికల్స్ విభాగంలో రేటు 2015 జూన్‌లో -0.48 శాతం క్షీణతలో ఉంది. ఇది తాజాగా 5.5 శాతంగా నమోదయ్యింది. ఫుడ్ ఆర్టికల్స్‌లో రేటు ఏకంగా 3.12 శాతం నుంచి 8.18 శాతానికి పెరిగింది. కూరగాయలు, పండ్లు, తృణ ధాన్యాలు, ప్రొటీన్ ఆధారిత ఉత్పత్తుల ధరల భారీ పెరుగుదల దీనికి కారణం. కూరగాయల ధరలు వార్షికంగా (2015 ఇదే  నెలలో పోల్చితే)  16.91 శాతం పెరిగాయి. పప్పుల ధరలు ఏకంగా 27శాతం పెరిగాయి. చక్కెర ధర 26 శాతం ఎగసింది. పండ్ల ధరలు 6 శాతం ఎగశాయి. ఆలూ ధరలు 64 శాతం పెరగడం గమనార్హం. అయితే ఉల్లి ధరలు మాత్రం 29 శాతం తక్కువగా ఉన్నాయి.  ఇక  నాన్-ఫుడ్ ఆర్టికల్స్ విభాగంలో రేటు 1.16 శాతం నుంచి 5.72 శాతానికి చేరింది.

తయారీ రంగాన్ని చూస్తే... -0.77% క్షీణత నుంచి ప్లస్+ 1.17%కి చేరింది.

 రేటు కోత లేనట్లేనా...!
మంగళవారం విడుదలైన రిటైల్ ద్రవ్యోల్బణం 22 నెలల గరిష్ట స్థాయి 5.77 శాతానికి పెరగడంతోపాటు, తాజాగా విడుదలైన కూడా ఆహార ద్రవ్యోల్బణం తీవ్రంగా ఉండడంతో ఆగస్టు 9 నాటి ద్రవ్య పరపతి సమీక్ష సందర్భంగా ఆర్‌బీఐ పాలసీ వడ్డీరేటు(రెపో)ను తగ్గించే అవకాశం లేదని ఐడీఎఫ్‌సీ బ్యాంక్ చీఫ్ ఎకనమిస్ట్ ఇంద్రనీల్ పన్ పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ రేటు 6.5 శాతంగా ఉంది.

Advertisement

తప్పక చదవండి

Advertisement