‘రెడీ టు ఈట్’లోకి స్నేహ ఫామ్స్ | sneha forms in ready to eat | Sakshi
Sakshi News home page

‘రెడీ టు ఈట్’లోకి స్నేహ ఫామ్స్

Nov 27 2014 12:57 AM | Updated on Sep 2 2017 5:10 PM

‘రెడీ టు ఈట్’లోకి స్నేహ ఫామ్స్

‘రెడీ టు ఈట్’లోకి స్నేహ ఫామ్స్

పౌల్ట్రీ రంగంలో ఉన్న స్నేహ ఫామ్స్ రెడీ టు ఈట్ విభాగంలోకి ప్రవేశిస్తోంది.

 హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: పౌల్ట్రీ రంగంలో ఉన్న స్నేహ ఫామ్స్ రెడీ టు ఈట్ విభాగంలోకి ప్రవేశిస్తోంది. ఇందుకోసం మహబూబ్‌నగర్ జిల్లాలో రూ.60 కోట్లతో ప్రాసెసింగ్ ప్లాంట్‌ను నెలకొల్పుతోంది. 6 నెలల్లో ప్లాంటులో ఉత్పత్తి కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయి. గంటకు 6,000 కోళ్లను ప్రాసెస్ చేయగల సామర్థ్యం దీనికి ఉంది. భారత్‌లో ఉన్న అతికొద్ది అత్యాధునిక ప్లాంట్లలో ఇది ఒకటని స్నేహ ఫామ్స్ ఎండీ డి.రామ్‌రెడ్డి సాక్షి బిజినెస్ బ్యూరోకు తెలిపారు. చిల్డ్, ఫ్రోజెన్, కట్ పీసెస్, రెడీ టు ఈట్ ఉత్పత్తులను ప్లాంటులో ఉత్పత్తి చేస్తామన్నారు. భారత్‌తోపాటు మధ్యప్రాచ్య దేశాలకూ ఎగుమతి చేస్తామని చెప్పారు. ప్లాంటు అందుబాటులోకి వస్తే ఆదాయం రూ.200-250 కోట్లు పెరుగుతుందన్నారు.

 ఫీడ్ ప్లాంట్లు రూ.70 కోట్లతో..
 స్నేహ చికెన్ పేరుతో కార్యకలాపాలు సాగిస్తున్న స్నేహ ఫామ్స్‌కు చెందిన స్నేహ ఫుడ్ అండ్ ఫీడ్స్‌కు హైదరాబాద్, కరీంనగర్, జడ్చర్ల, విజయవాడ వద్ద కోళ్ల దాణా (ఫీడ్) తయారీ ప్లాంట్లున్నాయి. నాలుగు ప్లాంట్ల సామర్థ్యం రోజుకు 3,000 టన్నులు. మరో రెండు ప్లాంట్లను రూ.70 కోట్లతో దక్షిణాది రాష్ట్రాల్లోనే  ఏర్పాటు చేస్తోంది. గతంలో రైతులే సొంతంగా దాణా తయారు చేసుకునేవారు. ఇప్పుడు అందుబాటు ధరలో, నాణ్యమైన దాణా మార్కెట్లో లభిస్తోంది. దీంతో రెడీమేడ్ దాణాకు గిరాకీ పెరుగుతోందని కంపెనీ చెబుతోంది. కంపెనీ టర్నోవరు ప్రస్తుతం రూ.1,500 కోట్లుంది.

 ఎఫ్‌ఎంసీజీ విభాగంలోకి..
 సోయా, రైస్ బ్రాన్ (తవుడు) నూనెను సఫల బ్రాండ్‌తో కంపెనీ విక్రయిస్తోంది. ఉత్పత్తుల సంఖ్య ఎక్కువగా ఉండాలన్న డీలర్ల కోరిక మేరకు సన్‌ఫ్లవర్, పల్లి నూనె కూడా సఫల బ్రాండ్ కిందకు తెచ్చినట్టు రామ్‌రెడ్డి తెలిపారు. కష్ణపట్నం వద్ద ప్యాకింగ్ యూనిట్ నెలకొల్పామన్నారు. కొద్ది రోజుల్లో గోధుమ పిండి, ఉప్పు, మినరల్ వాటర్ వంటి ఉత్పత్తులను పరిచయం చేస్తామని పేర్కొన్నారు. ఏటా రెండు కొత్త ఉత్పత్తులు తేవాలన్నది ఆలోచనగా చెప్పారు. చికెన్ ఆధారిత రెడీ టు ఈట్ ఉత్పత్తులను పెద్ద ఎత్తున మార్కెట్లోకి తెస్తామని తెలిపారు.

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement
Advertisement