
భారత్–పాక్‌ల మధ్య ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టడంతో మార్కెట్లు సానుకూలంగా స్పందించాయి. ఇన్వెస్టర్ల కొనుగోళ్లతో మూడు రోజుల వరుస నష్టాలకు శుక్రవారం బ్రేక్ పడింది. విదేశీ నిధుల అండతో స్టాక్ మార్కెట్లు మార్చి సిరీస్‌ను లాభాలతో ప్రారంభించాయి. మార్చి సిరీస్‌లో ఇన్వెస్టర్లు ఎఫ్‌అండ్‌వోలో నూతన పొజిషన్లను తీసుకోవడం కూడా లాభాలకు దారితీసింది. బీఎస్‌ఈ సెన్సెక్స్ 196 పాయింట్లు పెరిగి 36,064 వద్ద క్లోజ్ అవగా, నిఫ్టీ 71 పాయింట్లు లాభపడి 10,863 వద్ద ముగిసింది. సెన్సెక్స్ సానుకూలంగా ప్రారంభమై ఇంట్రాడేలో 36,140 పాయింట్ల గరిష్ట స్థాయి వరకు వెళ్లింది. కాకపోతే కొన్ని స్టాక్స్‌లో లాభాల స్వీకరణ జరగడంతో చివరికి లాభాలు పరిమితయ్యాయి. అంతకుముందు మూడు రోజుల్లో సెన్సెక్స్ 346 పాయింట్లు నష్టపోవడం గమనార్హం. అటు నిఫ్టీ ఇంట్రాడేలో 10,878 గరిష్ట, 10,823 కనిష్ట స్థాయిలను నమోదు చేసింది. మొత్తం మీద ఈ వారంలో సెన్సెక్స్ నికరంగా 192 పాయింట్ల మేర, నిఫ్టీ 71 పాయింట్ల మేర పెరిగాయి. మార్కెట్లు లాభాలో ముగియడం వరుసగా ఇది రెండో వారం. రుణాల వృద్ధి, తయారీ కార్యకలాపాలు, నూతన ఆర్డర్లు, ఉగ్యోగ కల్పనకు సంబంధించి బలమైన డేటాకు తోడు సరిహద్దు ఉద్రిక్తతలు తేలిక పడడం మార్కెట్లకు సానుకూలంగా పనిచేశాయి.
స్మాల్‌క్యాప్ ర్యాలీ: ఇండస్ ఇండ్ బ్యాంకు అత్యధికంగా 3 శాతం లాభపడింది. ఆ తర్వాత యస్ బ్యాంకు, వేదాంత, హీరో మోటో, కోల్ ఇండియా, ఐసీఐసీఐ బ్యాంకు తదితర స్టాక్స్ లాభాలను ఆర్జించాయి. నష్టపోయిన వాటిల్లో మారుతి సుజుకీ, భారతీ ఎయిర్‌టెల్, ఏషియన్ పెయింట్స్, ఆర్‌ఐఎల్ ఉన్నాయి. స్మాల్‌క్యాప్ సూచీ ఏకంగా 2 శాతానికి పైగా లాభపడగా, మిడ్‌క్యాప్ ఇండెక్స్ సైతం 1.29 శాతం పెరిగింది. ఇన్‌ఫ్రా, పీఎస్‌యూ, మెటల్ సూచీలు ఒకటిన్నర శాతం నుంచి 2 శాతం మధ్య లాభపడ్డాయి. క్యాపిటల్ గూడ్స్, పవర్ సూచీలు ఒక శాతానికి పైగా పెరిగాయి.