
సాక్షి,ముంబై : రూపాయి మారకపు విలువ మంగళవారం మరింత దిగజారింది. డాలరుకు డిమాండ్ బాగా పెరగడంతో దేశీయ కరెన్సీ అంతకంతకూ వెలవెలబోతోంది. సోమవారం అత్యంత కనిష్ఠానికి పడిపోయిన రూపాయి మంగళవారం మరో 37 పైసలు దిగజారింది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.71.58 వద్ద తాజా లైఫ్ టైం కనిష్ఠానికి పడిపోయింది. ఇతర దేశాల కరెన్సీలతో పోలిస్తే డాలరు విలువ బాగా బలపడుతోంది. అంతర్జాతీయ వాణిజ్య భయాల నేపథ్యంలో పెట్టుబడిదారులు, దిగుమతిదారులు నుంచి డాలరుకు డిమాండ్ బాగా పెరిగింది. అటు చమురు ధరలు భారీగా పెరగడం, అమెరికా కరెన్సీ డాలరుతో మారకంలో వర్ధమాన దేశాల కరెన్సీలు పతన బాట పట్టడం రూపాయి విలువను ప్రభావితం చేస్తున్నాయి. ఇంటర్‌బ్యాంక్ ఫారిన్ ఎక్స్చేంజ్‌లో రూపాయి విలువ 71.24 వద్ద ప్రారంభమై, ముగింపు నాటికి మరింత పతనమై 71.58 వద్ద క్లోజైంది.
కాగా ఏప్రిల్-జూన్ కాలంలో దేశ జీడీపీ అంచనాలను మించుతూ 8.2 శాతం పురోగతి సాధించడంతో సోమవారం రూపాయ ఆరంభంలో బలపడింది. సోమవారం డాలరుతో మారకంలో తొలుత 24 పైసలు(0.32 శాతం) లాభంతో 70.76 వరకూ ఎగసింది. తదుపరి డాలర్లకు డిమాండ్ పెరగడంతో చివర్లో చతికిల పడి 71.21 వద్ద రికార్డ్ కనిష్టం వద్ద ముగిసిన సంగతి తెలిసిందే.