40వేల కోట్ల పెట్టుబడులు!!

 Rs 40000 cr investment expected in OALP-II bid round - Sakshi

ఓఏఎల్‌పీ రెండో రౌండు  వేలంపై అంచనా

14 బ్లాక్‌ల వేలం ప్రక్రియ ప్రారంభం

మార్చి 12లోగా బిడ్ల దాఖలు

న్యూఢిల్లీ: ఓపెన్‌ ఏకరేజ్‌ లైసెన్సింగ్‌ విధానం (ఓఏఎల్‌పీ) కింద తలపెట్టిన రెండో విడత చమురు, గ్యాస్‌ బ్లాక్‌ల వేలం ద్వారా రూ. 40,000 కోట్ల పెట్టుబడులు రావొచ్చని అంచనా వేస్తున్నట్లు చమురు శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ చెప్పారు. గతేడాది నిర్వహించిన తొలి విడతలో 55 బ్లాక్‌లు వేలం వేయగా రూ. 60,000 కోట్ల మేర పెట్టుబడులకు కమిట్‌మెంట్‌ లభించినట్లు ఆయన తెలియజేశారు. రెండో విడతలో 14 బ్లాక్‌లు ఉన్నట్లు సోమవారం వేలం ప్రక్రియ ప్రారంభించిన  > మంత్రి చెప్పారు. మూడో విడత కింద 12 చమురు, గ్యాస్‌ బ్లాక్‌లు, అయిదు కోల్‌ బెడ్‌ మీథేన్‌ బ్లాక్‌ల వేలం వేయనున్నామని, ఈ ప్రక్రియ ఈ నెలలోనే ప్రారంభం కాగలదని ఆయన చెప్పారు.  ఓఏఎల్‌పీ–2 కింద వేలం వేసే 14 బ్లాక్‌ల విస్తీర్ణం 29,333 చ.కి.మీ. ఉంటుందని, బిడ్‌ల దాఖలుకు మార్చి 12 తుది గడువుగా ఉంటుందని మంత్రి పేర్కొన్నారు.  

12,600 మిలియన్‌ టన్నుల నిక్షేపాలు.. 
కేజీ బేసిన్‌లో ఒక డీప్‌ వాటర్‌ బ్లాక్‌తో పాటు అండమాన్, కచ్‌ బేసిన్‌లో చెరి రెండు, మహానది బేసిన్‌లో ఒక బ్లాక్‌ వేలం వేస్తున్న వాటిలో ఉన్నాయి. ఈ 14 బ్లాక్‌లలో దాదాపు 12,609 మిలియన్‌ టన్నుల చమురు, తత్సమాన గ్యాస్‌ నిక్షేపాలు ఉండొచ్చని అంచనా. ఓఏఎల్‌పీ –1 లో మొత్తం 55 బ్లాకులు వేలం వేయగా వేదాంత సంస్థ 41 బ్లాకులు దక్కించుకుంది. మిగతావాటిలో ప్రభుత్వ రంగానికి చెందిన ఆయిల్‌ ఇండియా తొమ్మిది, ఓఎన్‌జీసీ కేవలం రెండు మాత్రమే దక్కించుకున్నాయి. ఈ 55 బ్లాక్‌ల విస్తీర్ణం 59,282 చ.కి.మీ. ఉంటుంది. ప్రస్తుతం ఉత్పత్తి, అన్వేషణ లైసెన్సు పరిధిలో లేని చిన్న స్థాయి చమురు, గ్యాస్‌ బ్లాక్‌లను తీసుకునేందుకు కంపెనీలు ఓఏఎల్‌పీ కింద తమ ఆసక్తిని (ఈవోఐ) వ్యక్తం చేయాల్సి ఉంటుంది. ఈ ఈవోఐల ఆధారంగా కేంద్రం ఏటా రెండు విడతలుగా వేలం నిర్వహిస్తుంది. ఉత్పత్తయ్యే చమురు, గ్యాస్‌లో ప్రభుత్వానికి అత్యధిక వాటా ఇచ్చే సంస్థకు బ్లాక్‌లు దక్కుతాయి.  

విదేశీ భాగస్వాములకు ఓకే.. 
సంక్లిష్ట క్షేత్రాల్లో ఇంధన ఉత్పత్తి పెంపునకు ప్రభుత్వ రంగ ఓఎన్‌జీసీ, ఆయిల్‌ ఇండియా సంస్థలు ప్రైవేట్, విదేశీ సంస్థలను భాగస్వాములుగా చేసుకునేందుకు అనుమతించనున్నట్లు ప్రధాన్‌ వివరించారు. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top