షార్ట్‌ సెల్లర్స్‌పై ‘బ్యాంకు’ పిడుగు! | Sakshi
Sakshi News home page

షార్ట్‌ సెల్లర్స్‌పై ‘బ్యాంకు’ పిడుగు!

Published Thu, Oct 26 2017 12:13 AM

PSU bank shares show with government statement

(సాక్షి, బిజినెస్‌ ప్రత్యేక ప్రతినిధి) బ్యాంకులే కాదు... బ్యాంకు షేర్లూ నోట్లు కురిపించాయి. కొన్ని షేర్లయితే ఒకేరోజు ఏకంగా 45 శాతానికిపైగా పెరిగిపోయాయి. ప్రభుత్వ రంగ దిగ్గజాలు ఎస్‌బీఐ, పీఎన్‌బీ, బీఓబీ, ఐడీబీఐ, కెనరా బ్యాంక్‌... ఒకటేమిటి!! దాదాపు అన్ని బ్యాంకులదీ ఇదే పరిస్థితి. కాకపోతే... డెరివేటివ్స్‌లో (ఎఫ్‌ అండ్‌ ఓ) ట్రేడవుతున్న పీఎస్‌యూ బ్యాంకు షేర్లు మాత్రమే ఈ స్థాయిలో పెరిగాయి. ప్రభుత్వ రంగ బ్యాంకులైనా... డెరివేటివ్స్‌లో లేనివైతే ఒక మోస్తరు స్థాయిలో మాత్రమే పెరిగాయి.  ఈ మేజిక్‌తో ఒకేరోజులో కొందరు ట్రేడర్లు వందలు, వేల కోట్లు సంపాదించి ఉండొచ్చు. కానీ షార్ట్‌ సెల్లర్లు అదే స్థాయిలో నష్టపోయారు. నిజానికి డెరివేటివ్స్‌ ట్రేడింగ్‌లో ఒకరికి లాభం వచ్చిందంటే దానర్థం మరొకరు నష్టపోయినట్లే. అంటే! బ్యాంకులకు ఈ స్థాయిలో ప్రభుత్వం నిధులు సమకూరుస్తుందని, ఎఫ్‌ అండ్‌ ఓ ఎక్స్‌పైరీ గడువుకు ఒక్కరోజు ముందు ఈ ప్రకటన వస్తుందని... దాంతో అవి ఇంతలా పెరిగిపోతాయని తెలియక షార్ట్‌ సెల్లింగ్‌ చేసినవారంతా ఉచ్చులో చిక్కుకుపోయినట్లే. ఆ వివరాలే ఈ ప్రత్యేక కథనం.
ఒక రంగానికి చెందిన షేర్లన్నీ గంపగుత్తగా ఈ స్థాయిలో పెరిగిన దాఖలాలు... బహుశా స్టాక్‌ మార్కెట్‌ చరిత్రలో లేవనే చెప్పాలి. మొండి బకాయిలు పేరుకుపోవడమే కాక రోజురోజుకూ కొత్త ఎన్‌పీఏలు బయటపడుతుండటంతో ఈ మధ్య ప్రభుత్వ రంగ బ్యాంకుల పనితీరు దయనీయంగా తయారయింది. లాభాలుగా వచ్చిన సొమ్మును ఈ ఎన్‌పీఏలకు సర్దుబాటు చేస్తూ అవి భారీ నష్టాలను ప్రకటిస్తున్నాయి. దీంతో ఈ మధ్య ప్రభుత్వ రంగ బ్యాంకులపై ఇన్వెస్టర్లకు మోజు తగ్గింది. ట్రేడర్లు వీటిలో షార్ట్‌ పొజిషన్లు తప్ప లాంగ్‌ పొజిషన్లు మానేశారు. ఫలితంగానే స్టేట్‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా వంటి షేరు సోమవారం ఉదయానికి ఏకంగా రూ.240 స్థాయిలోకి పడిపోయింది. మిగిలిన బ్యాంకుల పరిస్థితీ అంతే. ఎన్‌పీఏలు మరీ పెరిగిపోవడంతో పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ (పీఎన్‌బీ), బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా (బీఓబీ) సహా బ్యాంకులన్నీ కనిష్ఠ స్థాయిల్లోనే ట్రేడవుతున్నాయి. ప్రైవేటు రంగ బ్యాంకు షేర్లు బాగానే పెరుగుతున్నప్పటికీ... ప్రభుత్వ రంగ షేర్లవైపు ఎవరూ చూడటం మానేశారు. ఎఫ్‌ అండ్‌ ఓలో వీటిలో షార్ట్‌ పొజిషన్లు భారీ స్థాయిలో ఉండటమే దీన్ని సూచిస్తోందని చెప్పాలి.

షేరు అంతలా ఎందుకు పెరిగాయంటే...
అక్టోబర్‌ నెల డెరివేటివ్స్‌ గడువు గురువారంతో ముగియనుంది. పీఎస్‌యూ బ్యాంకు షేర్లు ఇప్పటికే బాగా పడి ఉన్నాయి. ఇంకొక్క రెండ్రోజులు గడిస్తే ఎక్స్‌పైరీ అయిపోతుంది. నవంబర్‌ కాంట్రాక్టులు మొదలవుతాయి. ఈ సమయంలో బ్యాంకులకు ప్రభుత్వం మూలధనాన్ని సమకూర్చవచ్చునంటూ మంగళవారం ఉదయం నుంచే కొన్ని వార్తలు వెలువడ్డాయి. కాకపోతే ఎంత మొత్తమిస్తారనేది ఎవ్వరూ చెప్పలేకపోయారు. దీంతో సోమ, మంగళవారాల్లో చాలా వరకూ ప్రభుత్వ రంగ బ్యాంకుల షేర్లు 2 నుంచి 4 శాతం వరకూ పెరిగాయి. మంగళవారం మార్కెట్లు ముగిశాక ఆర్థిక మంత్రి నేతృత్వంలో మీడియా సమావేశం పెట్టి... బ్యాంకులకు రూ.2.11 లక్షల కోట్లను మూలధనంగా సమకూరుస్తామని చెప్పారు. అంటే చాలా బ్యాంకులు మొండి బకాయిల్లో కూరుకుపోయి ఉన్నాయి కనుక... వాటికి మరిన్ని రుణాలివ్వటానికి తగిన మూలధనం లేదు కనుక... ఆ మూలధనాన్ని ప్రభుత్వం కొంత బడ్జెట్‌ నుంచి, కొంత బాండ్ల జారీ ద్వారా సమకూరుస్తుందన్న మాట. అంటే డిపాజిట్లు కాకుండా ప్రభుత్వ బ్యాంకుల్లోకి గాలివాటం డబ్బులు ఏకంగా కేంద్రం నుంచి వస్తాయి. బ్యాంకులకిది నిజంగా కిక్కిచ్చే వార్తే!!. డెరివేటివ్స్‌ గడువు తీరే ముందు ఇలాంటి వార్త రావటం... ఆ షేర్లలో లాంగ్‌ పొజిషన్లున్న వారికి కనకవర్షం కురిపించేదే!!.

నిజానికి బ్యాంకులకు ఈ డబ్బులన్నీ వెంటనే వచ్చేవి కావు. కనీసం రెండేళ్ల సమయం పడుతుంది. సానుకూల వార్త కనక బ్యాంకు షేర్లు కొంత పెరిగే అవకాశం ఉంది. కాకపోతే ఇప్పటికే ఆ షేర్లలో షార్ట్‌లు విపరీతంగా ఉండటంతో... బుధవారం ఉదయాన్నే సదరు బ్యాంకు షేర్లలో దాదాపు 15–20–30% గ్యాప్‌ అప్‌తో ట్రేడింగ్‌ మొదలయ్యింది. నిజానికి డెరివేటివ్స్‌ ట్రేడింగ్‌ చేసేవారంతా మార్జిన్‌ ట్రేడర్లే. అంటే లాట్‌ ధరలో 15–20% మాత్రమే పెట్టి ట్రేడింగ్‌ చేస్తారు. ఉదయాన్నే గ్యాప్‌ అప్‌తో ట్రేడింగ్‌ మొదలయ్యేసరికి... ఆయా బ్యాంకుల్లో షార్ట్‌ పొజిషన్లున్న వారందరికీ వారి బ్రోకింగ్‌ సంస్థల నుంచి మెసేజ్‌లు వచ్చాయి. అర్జంటుగా మరింత మార్జిన్‌ మనీ అందుబాటులో ఉంచాలని, లేకపోతే ఆ పొజిషన్లు స్క్వేర్‌ ఆఫ్‌ అయిపోతాయని దాని సారాంశం. కొందరి షార్ట్‌ పొజిషన్లయితే ఎలాంటి మెసేజ్‌లూ లేకుండానే స్క్వేర్‌ ఆఫ్‌ అయిపోయాయి. పొజిషన్లు స్క్వేర్‌ ఆఫ్‌ అవుతున్న కొద్దీ ఆయా షేర్లు మరింత పెరగటం మొదలెట్టాయి. ఫలితం... కొన్ని షేర్లు ఏకంగా ఒకేరోజు 45%పైగా పెరిగిపోయాయి. అదీ కథ!!

ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ జరిగిందా?
బ్యాంకులకు మూలధనాన్ని అందజేయనున్నట్లు మంగళవారం సాయంత్రం ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ ప్రకటించారు. బుధవారం బ్యాంకు షేర్లు బీభత్సమైన ర్యాలీ చేశాయి. కాకపోతే మంగళవారం ఈ ప్రకటన వెలువడటానికి ముందే కొన్ని ప్రభుత్వ బ్యాంకు షేర్లలో ఆసక్తికరమైన ట్రేడింగ్‌ జరిగింది. ఉదాహరణకు భారీగా 46 శాతం పెరిగిన పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకునే తీసుకుంటే... మంగళవారంనాడు 145 స్ట్రైక్‌ ప్రైస్‌ వద్ద దీని కాల్‌ ధర కనిష్టం 5 పైసలు. గరిష్ఠం రూ.2.20. చిత్రమేంటంటే... గత శుక్రవారం బ్యాంకు షేర్లన్నీ బాగా పపడగా... ఈ కాల్‌లో రూ.1.98 కోట్ల టర్నోవర్‌ మాత్రమే జరిగింది. సోమవారం ఈ టర్నోవర్‌ రూ.4 కోట్లకు చేరింది. కానీ మంగళవారం ఏకంగా ఈ ఒక్క కాల్‌లోనే రూ.104 కోట్ల మేర టర్నోవర్‌ నమోదయింది. ఇంకేముంది! బుధవారం ఇది ఏకంగా 4,140 శాతం పెరిగిపోయింది. మరి సమాచారం తెలియని వారు అమ్మితే... తెలిసిన వారే ఈ కాల్‌ను కొన్నారా? కొని ఒకేరోజులో ఏకంగా 414 రెట్ల లాభాన్ని జేబులో వేసుకున్నారా? ఇది ఇన్‌సైడర్‌ ట్రేడింగేనా? అనే అనుమానాల్ని ట్విటర్‌ వేదికగా కొందరు వ్యక్తం చేయటం గమనార్హం.  

Advertisement
Advertisement