ఓలా విదేశీ జర్నీ

Ola's Foreign Journey - Sakshi

త్వరలో ఆస్ట్రేలియా మార్కెట్‌లోకి

ఉబెర్‌కు పోటీగా కార్యకలాపాలు 

న్యూఢిల్లీ: ట్యాక్సీ సర్వీసుల దేశీ దిగ్గజం ఓలా... విదేశీ మార్కెట్లకు కూడా కార్యకలాపాలు విస్తరిస్తోంది. త్వరలో ఆస్ట్రేలియాలోనూ సర్వీసులు ప్రారంభించనుంది. ఇందులో భాగంగా.. ప్రస్తుతం సిడ్నీ, మెల్‌బోర్న్, పెర్త్‌ నగరాల్లో ప్రైవేట్‌ వాహనదారులను తమ ప్లాట్‌ఫాంపై నమోదు చేసే ప్రక్రియ కొనసాగుతున్నట్లు ఓలా ఒక ప్రకటనలో తెలియజేసింది.

ఈ ఏడాది తొలినాళ్లలోనే ఆస్ట్రేలియాలో సేవలు ప్రారంభించాలని యోచిస్తున్నట్లు సంస్థ సహ వ్యవస్థాపకుడు, సీఈవో భవీష్‌ అగర్వాల్‌ తెలిపారు. డ్రైవర్‌ పార్ట్‌నర్స్‌కి ప్రాధాన్యమిస్తూ.. మెరుగైన ట్యాక్సీ సేవలను అందుబాటు ధరల్లో అందించాలనే లక్ష్యంతో పనిచేస్తున్నట్లు ఆయన చెప్పారు. నియంత్రణ సంస్థల నుంచి అనుమతులన్నీ లభించిన తర్వాత వ్యాపార కార్యకలాపాలను ప్రకటించనున్నట్లు తెలియజేశారు.

ఆస్ట్రేలియా మార్కెట్లో అమెరికన్‌ దిగ్గజం ఉబెర్‌తో ఓలా పోటీపడనుంది. ఈ రెండు సంస్థల మధ్య ఇప్పటికే భారత మార్కెట్లో తీవ్రమైన పోటీ నడుస్తోంది. ఆస్ట్రేలియాలో ఉబెర్‌ 2012లో కార్యకలాపాలు ప్రారంభించింది. సిడ్నీ, మెల్‌బోర్న్, బ్రిస్బేన్, అడిలైడ్, పెర్త్, కాన్‌బెరా వంటి 19 ప్రధాన నగరాల్లో సేవలు అందిస్తోంది. మరోవైపు, 2011లో ప్రారంభమైన ఓలా... ప్రస్తుతం దేశీయంగా 110 నగరాల్లో ట్యాక్సీ సర్వీసులు అందిస్తోంది. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top