కిరాణా స్టోర్లే.. ఇక ఏటీఎంలు

Now, kirana stores to turn ATMs for Paytm - Sakshi

ముంబై : కిరాణా స్టోర్లే.. ఇక ఏటీఎంలు... ఏంటి అదెలా అనుకుంటున్నారా? పేటీఎం పేమెంట్స్‌ బ్యాంకు ఇది నిజం చేయబోతుంది. తన నెట్‌వర్క్‌ను విస్తరించే క్రమంలో పేటీఎం పేమెంట్స్‌ బ్యాంకు ఈ వినూత్న ఆలోచనకు తెరతీసింది. వచ్చే నెలల్లో లక్ష కిరాణా స్టోర్లతో పేటీఎం డిజిటల్‌ బ్యాంకు భాగస్వామ్యం ఏర్పరుచుకోబోతుంది. దీంతో గ్రామీణ ప్రాంతాల్లో, బీ-టౌన్లలో ఎక్కువ మంది కస్టమర్లను ఆకట్టుకోబోతుంది. పేటీఎం లాంచ్‌ చేసిన పేమెంట్స్‌ బ్యాంకుతో జీరో బ్యాలెన్స్‌ అకౌంట్లను ప్రారంభించుకోవచ్చు. అంతేకాక డిజిటల్‌ లావాదేవీలకు జీరో ఛార్జీలే. కిరాణా స్టోర్లే ఏటీఎంలుగా పనిచేయనున్నాయి. ఈ స్టోర్లను 'పేటీఎం కా ఏటీఎం' అని పిలువనున్నారు. వీటిలోనే కస్టమర్లు సేవింగ్స్‌ అకౌంట్లు ప్రారంభించుకునేందుకు, నగదును డిపాజిట్‌ చేసి, విత్‌డ్రా చేసేందుకు అనుమతి ఇవ్వనున్నారు.  

ప్రతి భారతీయుడికి బ్యాంకింగ్‌ సౌకర్యం అందుబాటులోకి తీసుకొచ్చే లక్ష్యంతో 'పేటీఎం కా ఏటీఎం' బ్యాంకింగ్‌ అవుట్‌లెట్లను ప్రారంభిస్తున్నామని పేటీఎం పేమెంట్స్‌ బ్యాంకు సీఈవో, ఎండీ రేణు సతి చెప్పారు. తమ ఇంటి పక్కనే ఉన్న అవుట్‌లెట్‌ను సందర్శించి, బ్యాంకు అకౌంట్‌ ప్రారంభించుకోవచ్చని పేర్కొన్నారు. నగదును డిపాజిట్‌ చేయడం, విత్‌డ్రా చేయడం, అదనంగా ఆధార్‌ లింక్‌ను చేపట్టడం వంటి లావాదేవీలను చేపట్టుకోవచ్చని చెప్పారు. నాణ్యమైన బ్యాంకింగ్‌ సర్వీసులను లక్షల కొద్దీ పనిచేసే, పనిచేయని కస్టమర్లకు అందజేయడానికి హైపర్‌-లోకల్‌ మోడల్‌ బ్యాంకింగ్‌ కీలక పాత్ర పోషిస్తుందని తాము నమ్ముతున్నట్టు తెలిపారు. ఢిల్లీ ఎన్‌సీఆర్‌, లక్నో, కాన్పూర్‌, అలహాబాద్‌, వారణాసి​, అలిఘర్‌ వంటి ఎంపికచేసిన నగరాల్లో 3000 స్టోర్లతో పేటీఎం ఒప్పందం కుదుర్చుకుంది. ఆఫ్‌లైన్‌ విస్తరణ కోసం దాదాపు రూ.3వేల కోట్లను పెట్టుబడులుగా పెడుతోంది.  

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top