గత ఆరు నెలల్లో పరిశ్రమల పురోగతి అంతంతే | Not Much Changed on Ground for Industry in 6 Months: Survey | Sakshi
Sakshi News home page

గత ఆరు నెలల్లో పరిశ్రమల పురోగతి అంతంతే

Feb 2 2015 2:55 AM | Updated on Sep 2 2017 8:38 PM

గత ఆరు నెలల్లో పరిశ్రమల పురోగతి అంతంతే

గత ఆరు నెలల్లో పరిశ్రమల పురోగతి అంతంతే

గడిచిన ఆరు నెలల్లో దేశీ పారిశ్రామిక రంగ పరిస్థితుల్లో పెద్దగా పురోగతేమీ లేదని కార్పొరేట్ వర్గాల్లో అత్యధికులు అభిప్రాయపడుతున్నారు.

* ఈ ఏడాది ప్రథమార్ధంలో మెరుగుపడొచ్చు...
* అసోచామ్ సర్వే నివేదికలో వెల్లడి

న్యూఢిల్లీ: గడిచిన ఆరు నెలల్లో దేశీ పారిశ్రామిక రంగ పరిస్థితుల్లో పెద్దగా పురోగతేమీ లేదని కార్పొరేట్ వర్గాల్లో అత్యధికులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుత త్రైమాసికంలో కూడా పెట్టుబడి ప్రణాళికల్లో భారీ మార్పులేవీ ఉండకపోవచ్చని పేర్కొన్నారు. అసోచామ్ నిర్వహించిన ‘వ్యాపార విశ్వాస సర్వే’ నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి.

గతేడాది మే నెలలో మోదీ నేతృత్వంలో సుస్థిరమైన కొత్త కేంద్ర ప్రభుత్వం ఏర్పాటుతో కార్పొరేట్లలో వ్యాపార విశ్వాసం ఉరకలెత్తింది. అయితే, గత ఆరు నెలల్లో వ్యాపార వాతావరణంలో మార్పులు అంతంతమాత్రమేనని సర్వేలో 54.2 శాతం మంది అభిప్రాయపడినట్లు అసోచామ్ పేర్కొం ది. ఈ ఏడాది(2015) ప్రథమార్ధంలో ఈ పరిస్థితులు కొంత మెరుగయ్యే అకాశం ఉందని 62.5 శాతం మంది పారిశ్రామికవేత్తలు ఆశాభావం వ్యక్తం చేశారు.

ఇతర ముఖ్యాంశాలివీ...
సర్వేలో పాల్గొన్న కార్పొరేట్ సారథుల్లో 45.8 శాతం మంది ఈ క్వార్టర్(జనవరి-మార్చి)లో కూడా వ్యాపార పెట్టుబడి ప్రణాళికల్లో మార్పులేవీ ఉండకపోవచ్చని చెప్పారు. ఎగుమతులు కూడా మందకొడిగానే ఉంటాయన్నారు.
జనవరి-మార్చి కాలంతో పాటు రానున్న రోజుల్లో నియామకాలు(హైరింగ్) పుంజుకోనున్నాయని 41.7% మంది అభిప్రాయపడ్డారు.
ప్రస్తుత త్రైమాసికంలో ఆర్డర్లు పెరుగుతాయని మెజారిటీ(58.3 శాతం) కార్పొరేట్లు ఆశాభావంతో ఉన్నారు.
పెట్టుబడులు పుంజుకుంటే.. దీనికి అనుగుణంగా రానున్న కొద్ది నెలల్లోనే కంపెనీల అమ్మకాలు, లాభాలు కూడా జోరందుకునే అంవకాశాలున్నాయని అసోచామ్ సెక్రటరీ జనరల్ డీఎస్ రావత్ పేర్కొన్నారు. గతేడాది డిసెంబర్‌లో ఈ సర్వే నిర్వహించారు.

Advertisement
Advertisement