నోకియా నుంచి కొత్తగా ఐదు ఫోన్లు

Nokia unveils five phones iconic Nokia 8110 returns - Sakshi

బార్సిలోనా : నోకియా బ్రాండు స్మార్ట్‌ఫోన్‌ తయారు చేసి, మార్కెట్‌లోకి విడుదల చేస్తున్న హెచ్‌ఎండీ గ్లోబల్‌ తన పోర్ట్‌ఫోలియోను మరింత విస్తరిస్తోంది. బార్సిలోనాలో జరుగుతున్న మొబైల్‌ వరల్డ్‌ కాంగ్రెస్‌ 2018(ఎండబ్ల్యూసీ) వేదికగా కొత్తగా ఐదు డివైజ్‌లను హెచ్‌ఎండీ గ్లోబల్‌ ఆవిష్కరించింది. అవి నోకియా 8 సిరొక్కో, నోకియా 7 ప్లస్‌, నోకియా 6(కొత్త వేరియంట్‌), నోకియా 1, పునరుద్ధరించిన నోకియా 8110.  నోకియాకు చెందిన ఐకానిక్‌ మోడల్‌ 8110. ఈ మోడల్‌ను ప్రస్తుతం 4జీ కనెక్టివిటీతో పాటు గూగుల్‌ అసిస్టెంట్‌, గూగుల్‌ మ్యాప్స్‌, గూగుల్‌ సెర్చ్‌, ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌ వంటి యాప్స్‌తో కంపెనీ ఆవిష్కరించింది. పన్నులు, ఇతర సబ్సిడీలను మినహాయించి నోకియా ఐకానిక్‌ మోడల్‌ అయిన 8110 ధరను హెచ్‌ఎండీ గ్లోబల్‌ 79 యూరోలుగా నిర్ణయించింది. మే నుంచి ఈ ఫోన్‌ అందుబాటులోకి రాబోతుంది. 

''గతేడాది ఈ రోజుల్లో, అభిమానుల నుంచి మంచి స్పందన రావాలని ఆశిస్తూ మా ప్రయాణాన్ని ప్రారంభించాం. మా స్పేస్‌లో అత్యంత వినూత్నమైన బ్రాండులను డెలివరీ చేస్తున్నాం. గతేడాది 70 మిలియన్లకు పైగా నోకియా ఫోన్లను రవాణా చేశాం'' అని హెచ్‌ఎండీ గ్లోబల్‌ సీఈవో ఫ్లోరియాన్‌ సైచి చెప్పారు. కొత్తగా ఐదు డివైజ్‌ల ఆవిష్కరణతో తమ రేంజ్‌ను విస్తరించుకున్నామని తెలుపడం చాలా గర్వంగా ఉందని, నోకియా 8 సిరొక్కోతో స్మార్ట్‌ఫోన్‌ డిజైన్‌లో కొత్త బెంచ్‌మార్కు తీసుకొచ్చామని హెచ్‌ఎండీ గ్లోబల్‌ చీఫ్‌ ప్రొడక్ట్‌ ఆఫీసర్‌ జూహో సర్వికాస్‌ అన్నారు. నోకియా 8 సిరొక్కో, నోకియా 7 ప్లస్‌, కొత్త నోకియా 6లు ఆండ్రాయిడ్‌ వన్‌ ఫ్యామిలీలో చేరాయని, గూగుల్‌ డిజైన్‌ చేసిన హై క్వాలిటీ సాఫ్ట్‌వేర్‌ అనుభవాన్ని వీటిలో తాము అందించినట్టు పేర్కొన్నారు. నోకియా 8 సిరొక్కో స్మార్ట్‌ఫోన్‌ ధర 749 యూరోలుగా కంపెనీ నిర్ణయించింది. అంటే భారత కరెన్సీ ప్రకారం సుమారు రూ.60వేలుగా తెలుస్తోంది. కానీ భారత్‌లో ఈ స్మార్ట్‌ఫోన్‌ ధర ఎంత ఉండొచ్చో కంపెనీ వెల్లడించలేదు. 

ఏప్రిల్‌ ప్రారంభం నుంచి నోకియా 8 సిరొక్కో స్మార్ట్‌ఫోన్‌ సేల్‌ మొదలవుతోంది. 5.5 అంగుళాల క్యూహెచ్‌డీ పీఓలెడ్‌ డిస్‌ప్లే, 3డీ కార్నింగ్‌ గొర్రిల్లా గ్లాస్‌ 5, ఆక్టా-కోర్‌ క్వాల్‌కమ్‌ స్నాప్‌డ్రాగన్‌ 835 ఎస్‌ఓసీ, 6జీబీ ర్యామ్‌, 128జీబీ ఇన్‌బిల్ట్‌ స్టోరేజ్‌, 12 ఎంపీ, 13 ఎంపీతో డ్యూయల్‌ రియర్‌ కెమెరా, 5 ఎంపీ ఫ్రంట్‌ కెమెరా దీనిలో ఫీచర్లు. కాగ, కొత్త నోకియా 6 ముందు దాని కంటే 60 శాతం వేగవంతంగా పనిచేస్తుంది. ఈ ఫోన్‌ను 279 యూరోలకు కంపెనీ మార్కెట్‌లోకి ఆవిష్కరించింది. ఆండ్రాయిడ్‌ ఓరియో గో ఎడిషన్‌ స్మార్ట్‌ఫోన్‌ అయిన నోకియా 1, మృదువుగా డిజైన్‌ అయింది. గూగుల్‌ ప్లే స్టోర్‌ ఫుల్‌ యాక్సస్‌తో దీన్ని ఆవిష్కరించింది. దీని ధర కూడా అన్ని పన్నులు, సబ్సిడీలు కలుపుకోకపోతే, 85 డాలర్లుగా కంపెనీ నిర్ణయించింది. 
 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top