బ్యాంకింగ్‌ మోసాలు రూ.95,760 కోట్లు

Nirmala Sitharaman Speaks Over Banking Scams At Parliament - Sakshi

ఏప్రిల్‌–సెప్టెంబర్‌ మధ్య ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో లెక్కలు ఇవి...

రాజ్యసభలో ఆర్థికమంత్రి వెల్లడి

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంకింగ్‌లో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలల్లో (ఏప్రిల్‌–సెప్టెంబర్‌) రూ.95,760 కోట్లకుపైగా మోసాలు చోటుచేసుకున్నాయి. ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ మంగళవారం రాజ్యసభలో ఈ విషయాన్ని తెలియజేశారు. ‘‘రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) అందించిన సమాచారం ప్రకారం ఏప్రిల్‌ నుంచి సెప్టెంబర్‌ మధ్య ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో మోసాలకు సంబంధించి 5,743 కేసులు నమోదయ్యాయి. నిధులపరంగా చూస్తే, ఈ మోసాల విలువ 95,760.49 కోట్లు’’ అని ఆర్థికమంత్రి తెలిపారు. బ్యాంకుల్లో మోసాల నివారణకు సమగ్ర చర్యలను చేపట్టినట్లు, నిర్వహణలో లేని కంపెనీలకు సంబంధించి 3.38 లక్షల బ్యాంక్‌ అకౌంట్లను స్తంభింపజేసినట్లు  వెల్లడించారు.

పీఎంసీ డిపాజిట్లలో 78% మందికి ఊరట
పంజాబ్‌ అండ్‌ మహారాష్ట్ర కోఆపరేటివ్‌ బ్యాంక్‌ (పీఎంసీ) డిపాజిటర్ల విషయంలో ఒక్కో ఖాతా నుంచి గరిష్ట నగదు ఉపసంహరణ పరిమితిని రూ. 50,000 వరకు పెంచినట్లు  ఆర్థికశాఖ సహాయమంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ తెలిపారు. దీనితో డిపాజిటర్లలో 78% మందికి తమ అకౌంట్ల పూర్తి బ్యాలెన్స్‌ను విత్‌డ్రా చేసుకునే అవకాశం ఏర్పడినట్లు ఆయన తెలిపారు.

ఆటో రంగం పుంజుకుంటుంది... 
వాహన రంగంలో మందగమనం సైక్లికల్‌ (ఎగుడు–దిగుడు) అని భారీ పరిశ్రమలు, ప్రభు త్వ రంగ సంస్థల వ్యవహారాల శాఖ మంత్రి ప్రకాశ్‌ జవదేకర్‌ లోక్‌సభలో ఇచ్చిన లిఖిత పూర్వక సమాధానంలో పేర్కొన్నారు. ఈ రంగానికి మద్దతిచ్చేందుకు ప్రభుత్వం తగిన చర్యలు అన్నింటినీ తీసుకుంటోందని తెలిపారు. ఈ రంగానికి రుణ లభ్యతకుగాను ప్రభుత్వ రంగ బ్యాంకులకు రూ.70,000 కోట్ల నిధులు విడుదల చేసిన విషయాన్ని  ప్రస్తావించారు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top