భారత్‌ నుంచి సంపన్నుల వలస | NewWorld Wealth Report | Sakshi
Sakshi News home page

భారత్‌ నుంచి సంపన్నుల వలస

Feb 5 2018 2:13 AM | Updated on Feb 5 2018 2:13 AM

NewWorld Wealth Report - Sakshi

న్యూఢిల్లీ:  పేదవారు పొట్ట చేత పట్టుకుని వలస పోవడం వినే ఉంటారు. వారిది జీవనపోరాటం. అయితే, వలసలు వారికే పరిమితం కాదు. సంపన్నులు కూడా తమ అవసరాల కోసం, ఆశయాల కోసం, మెరుగైన జీవనం కోసం వలసల బాట పడుతున్నారు. విదేశాలకు తమ గమ్యస్థానాన్ని మార్చుకుంటున్నారు.

2017లో మన దేశం నుంచి 7,000 మంది మిలియనీర్లు (అధిక విలువ కలిగిన వ్యక్తులు/మిలియన్‌ డాలర్లు/రూ.6.4 కోట్లు ఆపై సంపద ఉన్నవారు) విదేశాలకు వలసపోయారని న్యూవరల్డ్‌ వెల్త్‌ రిపోర్ట్‌ చెబుతోంది. 2016లో వలస వెళ్లిన వారి సంఖ్య కంటే 16 శాతం అధికం. 2016లో 6,000 మంది, 2015లో 4,000 మంది మిలియనీర్లు మన దేశం నుంచి విదేశాలకు మకాం మార్చారు. అమెరికా, యూఏఈ, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ మన దేశ వాసులను ఆకర్షించిన టాప్‌ దేశాలు.  

కీలక అంశాలు...
♦  2017లో 10,000 మంది చైనీయులు ఆ దేశం వీడి వెళ్లారు. వలసల్లో అంతర్జాతీయంగా మొదటి స్థానం చైనాదే. టర్కీ 6,000 మంది, బ్రిటన్‌ 4,000 మంది, ఫ్రాన్స్‌ 4,000 మంది, రష్యా 3,000 మంది మిలియనీర్లను కోల్పోయాయి. మిలియనీర్ల వలసల సంఖ్య 2017లో మొత్తం మీద అంతర్జాతీయంగా 95,000గా ఉంది.  
♦  మిలియనీర్లను ఆకర్షించడంలో ఆస్ట్రేలియా అగ్రస్థానం దక్కించుకుంది. 2017లో ప్రపంచ దేశాల నుంచి ఈ దేశానికి తరలివెళ్లిన వారు 10,000 మంది ఉన్నారు. అగ్ర రాజ్యం అమెరికా ఈ విషయంలో మరోసారి ఆస్ట్రేలియా కంటే వెనుకబడింది. అయితే, మొత్తం మీద మిలియనీర్ల ఆకర్షణలో ఆస్ట్రేలియా తర్వాత నిలిచింది అగ్రరాజ్యమే. 9,000 మంది ఈ దేశాన్ని ఆశ్రయించారు. ఆ తర్వాత కెనడా 5,000 మంది, యూఏఈ 5,000 మందిని ఆకర్షించాయి.  
♦  మిలియనీర్ల సంపద ఎక్కువగా వున్న దేశాల్లో భారత్‌కు ఈ నివేదిక ఆరో స్థానం కల్పించింది. మొత్తం సంపద విలువ 8,230 బిలియన్‌ డాలర్లు.
భారత్‌లో 3,30,400 మంది మిలియనీర్లు ఉన్నారు. మిలియనీర్ల సంఖ్యా పరంగా భారత్‌ అంతర్జాతీయంగా 9వ స్థానంలో నిలిచింది. మల్టీ మిలియనీర్లు 20,730 మంది ఉన్నారు. ఈ విషయంలో ఏడో స్థానంలో ఉంది. 119 మంది బిలియనీర్ల (100 కోట్ల డాలర్లు, అంతకు పైన సంపద ఉన్నవారు)తో అమెరికా, చైనా తర్వాత మూడో స్థానంలో నిలిచింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement