భారత్‌ వృద్ధి ఇకపైనా పరుగే | ndia will grow at 7.2% in 2017-18, says World Bank | Sakshi
Sakshi News home page

భారత్‌ వృద్ధి ఇకపైనా పరుగే

May 29 2017 11:42 PM | Updated on Sep 5 2017 12:17 PM

భారత్‌ వృద్ధి ఇకపైనా పరుగే

భారత్‌ వృద్ధి ఇకపైనా పరుగే

ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన ఆర్థిక వ్యవస్థగా భారత్‌ ఇకముందూ తన ప్రయాణం సాగిస్తుందని ప్రపంచ బ్యాంకు పేర్కొంది.

► 2017–18 ఆర్థిక సంవత్సరంలో 7.2 శాతం వృద్ధి  
►  ప్రపంచ బ్యాంకు నివేదిక

న్యూఢిల్లీ: ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన ఆర్థిక వ్యవస్థగా భారత్‌ ఇకముందూ తన ప్రయాణం సాగిస్తుందని ప్రపంచ బ్యాంకు పేర్కొంది. భారత ఆర్థిక వ్యవస్థ 2017–18 ఆర్థిక సంవత్సరంలో 7.2 శాతం వృద్ధి రేటును నమోదు చేస్తుందని అంచనా వేసింది. అంతేకాదు 2019–20 నాటికి 7.7 శాతం వద్ధి రేటుకు చేరుకుంటుందని వివరించింది. బలమైన ఫండమెంటల్స్, పెట్టుబడుల తీరు మెరుగుపడుతుండడం, సంస్కరణల వాతావరణాన్ని సానుకూలతలుగా పేర్కొంది. మహిళల భాగస్వామ్యాన్ని మరింత పెంచితే రెండంకెల వృద్ధి రేటు సాధన దిశగా సాగిపోవచ్చనీ సూచించింది.

ఈ మేరకు ‘ఇండియా డెవలప్‌మెంట్‌ రిపోర్ట్‌’ను ప్రపంచ బ్యాంకు విడుదల చేసింది. గతేడాది చక్కని వర్షపాతం తర్వాత పరిస్థితులు మెరుగుపడుతుండగా పెద్ద నోట్లను రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయం భారత వృద్ధికి విఘాతం కలిగించిందని ప్రపంచ బ్యాంకు వివరించింది. దీంతో గత ఆర్థిక సంవత్సరంలో 6.8 శాతంగా జీడీపీ రేటు ఉండొచ్చని తెలిపింది. ‘‘భారత్‌ ఇకపైనా ప్రపంచంలో అత్యంత వేగవంతమైన ఆర్థిక వ్యవస్థగా కొనసాగుతుంది. జీఎస్టీ అమలు ప్రోత్సాహాన్ని ఇవ్వనుంది’’ అని  బ్యాంకు దేశీయ డైరెక్టర్‌ జునైద్‌ అహ్మద్‌ తెలిపారు.

మహిళల పాత్ర పెరగాలి
దేశాభివృద్ధిలో మహిళల భాగస్వామ్యం పెరగాల్సిన అవసరాన్ని ప్రపంచ బ్యాంకు ప్రముఖంగా ప్రస్తావించింది. వారి పాత్ర ప్రస్తుతం చాలా తక్కువగా ఉందని ప్రపంచ బ్యాంకు సీనియర్‌ ఆర్థికవేత్త ఫ్రెడరికో గిల్‌ శాండర్‌ తెలిపారు. ‘‘భారత్‌లో డిగ్రీ చదివిన మహిళల్లో 65 శాతం మంది పని చేయడం లేదు. ఈ రేటు బంగ్లాదేశ్‌లో 41 శాతం, ఇండోనేషియా, బ్రెజిల్‌లో 25 శాతంగానే ఉంది. భారత్‌ మరిన్ని ఉద్యోగాలు కల్పించాలి. వేతన ఉద్యోగాలను విస్తృతం చేయాలి. అలాగే, భద్రతతో కూడిన పరిస్థితులను కల్పించడం ద్వారా పని ప్రదేశాల్లో లింగ అసమానత్వాన్ని తగ్గించాలి’’ అని శాండర్‌ సూచించారు.

గత ఆర్థిక సంవత్సరంలో 7.6 శాతం: ఎస్‌బీఐ
జీడీపీ వృద్ధి రేటును గత రెండు ఆర్థిక సంవత్సరాలకు సంబంధించి సవరించే అవకాశం ఉందని ఎస్‌బీఐ తెలిపింది. 2015–16 ఆర్థిక సంవత్సరంలో 8.3 శాతం, 2016–17లో 7.6 శాతానికి సవరించొచ్చని ‘ఎకోవ్రాప్‌’ పేరుతో విడుదల చేసిన నివేదికలో పేర్కొంది. మే 31న విడుదల కానున్న జీడీపీ గణాంకాలు బావుంటాయన్న అభిప్రాయాన్ని వినిపించింది. నూతన ఐఐపీ, డబ్ల్యూపీఐ సిరీస్‌ 2013–14 నుంచి అన్ని జీడీపీ గణాంకాలపైనా ప్రభావం చూపొచ్చని తెలిపింది.

‘‘2013–14లో 6.5గా ఉన్న జీడీపీ రేటును 7.3 శాతానికి సవరించొచ్చు. అలాగే, 2015–16 జీడీపీని 7.9 నుంచి 8.3 శాతానికి, 2016–17 వృద్ధి రేటును 7.1 నుంచి 7.6 శాతానికి సవరించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నాం’’ అని నివేదికలో ఎస్‌బీఐ పేర్కొంది. మే 19 నాటికి వ్యవస్థలోకి నగదు తిరిగి ప్రవేశపెట్టడం (రీమోనిటైజేషన్‌) 80 శాతానికి చేరిందని తెలిపింది. ‘‘గతేడాది నవంబర్‌ 8 నుంచి ఈ ఏడాది మే 12 వరకు వ్యవస్థలోకి రూ.7 లక్షల కోట్ల డిపాజిట్లు వచ్చాయని అంచనా వేస్తున్నట్టు వివరించింది. మెరుగైన జీడీపీ గణాంకాలకు తోడు సరిపడా లిక్విడిటీ, నెమ్మదించిన ద్రవ్యోల్బ ణంతో ఆర్‌బీఐకి ద్రవ్య విధాన నిర్వహణ క్లిష్టంగా మారిందని ఈ నివేదికను రూపొందించిన ఎస్‌బీఐ ముఖ్య ఆర్థిక సలహాదారు సౌమ్యకాంతి ఘోష్‌ పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement