
సాక్షి, ముంబయి : పీఎన్‌బీ స్కామ్ కేసుకు సంబంధించి బిలియనీర్ జ్యూవెలర్ నీరవ్ మోదీ, గీతాంజలి జెమ్స్‌కు చెందిన మొహుల్ చోక్సీలకు సీబీఐ కోర్టు ఆదివారం నాన్ బెయిలబుల్ వారెంట్‌ను జారీ చేసింది. తప్పుడు పత్రాలతో వీరు పీఎన్‌బీ నుంచి భారీ మొత్తంలో రుణాలు పొంది వాటిని దారిమళ్లించిన వ్యవహారం వెలుగుచూసిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది ఫిబ్రవరిలో పీఎన్‌బీ ముంబయి బ్రాంచ్ అలహాబాద్, యాక్సిస్ బ్యాంక్ హాంకాంగ్ బ్రాంచ్‌లకు జారీచేసిన హామీ పత్రాల (ఎల్‌ఓయూ)పై నీరవ్ మోదీ ఇతరులు రూ 280.7 కోట్లు మోసపూరితంగా పొందినట్టు తేలడంతో ఈ భారీ స్కాం బయటపడింది.
సీబీఐ నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్ ప్రకారం డైమండ్ ఆర్ యూఎస్, సోలార్ ఎక్స్పోర్ట్స్, స్టెల్లార్ డైమండ్స్‌ల తరపున ఎల్‌ఓయూలు జారీ అయ్యాయి. కుంభకోణం వెలుగుచూసిన అనంతరం నీరవ్ మోదీ ఇతర నిందితులపై మనీల్యాండరింగ్ నియంత్రణ చట్టం (పీఎంఎల్‌ఏ) కింద కూడా కేసు నమోదైంది.